Chandra Babu: 95 చంద్రబాబు ఎక్కడ? మాటలతోనే సరా? చేతలేవి? తోక జాడిస్తున్న నేతలపై చర్యలు తీసుకోరా?
Chandra Babu: 95 చంద్రబాబు ఎక్కడ.. మాటలతోనే సరా? చేతలు ఎక్కడ? తోక జాడిస్తున్న నేతలపై చర్యలు ఏవి?

Chandra Babu: ఈ మధ్యకాలంలో టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు చాలా ఎక్కువగా వాడుతున్న పదం నేను "95 నాటి చంద్రబాబుని.. ఎవరి అలసత్వాన్ని ఉపేక్షించను "అని. కానీ జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అప్పటి స్ట్రిక్ట్ చంద్రబాబు మళ్లీ కనబడడం కష్టమేనా అని అనుమానాలు వస్తున్నాయి. వరుస పెట్టి పార్టీ నాయకులు వివాదాల్లో చిక్కుకుంటున్నా కొంతమంది హద్దు దాటి ప్రవర్తిస్తున్నా చంద్రబాబు హెచ్చరికలు వరకు మాత్రమే పరిమితం అయిపోతున్నారా అన్న చర్చ పార్టీ వర్గాల్లో సైతం మొదలైంది.
ఒక్క ఆగష్టు నెలలోనే నాలుగు పెద్ద వివాదాలు
ఈ ఒక్క నెలలోనే టిడిపి నాయకులు నాలుగు పెద్ద వివాదాల్లో చిక్కుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ సినిమా రిలీజ్ అవుతుంటే ఆ సినిమాను ఆడనివ్వం అంటూ అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్ ప్రసాద్ హెచ్చరిస్తున్నట్టుగా ఉన్న ఆడియో రిలీజ్ అయింది. అందులో వాడిన దుర్భాషలు రెండు తెలుగు రాష్ట్రాల్లోని జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల్ని తీవ్రంగా బాధపెట్టాయి. దానితో వాళ్ళు నిరసనలకి దిగారు. ఆడియో తనది కాదని ఎమ్మెల్యే ఎంత చెప్పినా చాలామంది అది ఆయనదే అని నమ్ముతున్నారు. చంద్రబాబు సైతం ఎమ్మెల్యేని పిలిపించి మందలించారు. కానీ ఇప్పటికీ ఆ వివాదం చల్లబడలేదు.
నెల్లూరు అరుణ విషయం పార్టీ ఇమేజ్‌ను బాగా దెబ్బతీసింది. ఆమె సన్నిహితుడు యావజ్జీవ ఖైదీ శ్రీకాంత్‌కి పెరోల్ లభించేలా ఇద్దరు టిడిపి ఎమ్మెల్యేలు సహకరించారన్న ఆరోపణలు ఉన్నాయి. అది అటు ఇటు తిరిగి ఏకంగా హోంశాఖకు అంటుకుంది. ప్రస్తుతం శ్రీకాంత్ తిరిగి జైలుకు వెళ్లిపోగా అరుణ కూడా అరెస్టు అయింది. దీనిపై హోంమంత్రి స్వయంగా మీడియాకు వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ తమను వేధిస్తున్నాడు అంటూ ఒక మహిళ మీడియా ముందుకు వచ్చారు. అసభ్యకరమైన వేధింపులు ఎదుర్కొన్నామని ఆరోపణలు చేశారు. దీని ఎమ్మెల్యే స్పందిస్తూ తనపై జరిగిన కుట్రగా ఖండించారు. ఇవన్నీ కూడా ఇండైరెక్టుగానో లేక ఆడియోలపరం గానో నేతలు వివాదాల్లో చిక్కుకున్నవి. శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి అన్ని పరిధిలూ దాటేశారు. విధుల్లో ఉన్న అటవీ సిబ్బందిపై తన అనుచరులతోపాటు దాడి చేసినట్టున్న విజువల్స్ మీడియాలో వైరల్ అయ్యాయి. వీటిలో అటవీశాఖ డైరెక్ట్ గా ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేతిలో ఉంది. దీనితో ఆయన సీరియస్ అయ్యారు. మరోవైపు సీఎం చంద్రబాబు కూడా ఎవరిని వదిలిపెట్టొద్దంటూ పోలీసులను ఆదేశించడంతో ఎమ్మెల్యేఫై కేసు నమోదైంది. ఈ నాలుగు వివాదాలు ఒక్క నెలలోనే బయటపడడం అనేది ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు ఉన్న అధికార పార్టీ ఎమ్మెల్యేలలో కొంతమంది ఎంత లెక్క చేయకుండా ప్రవర్తిస్తున్నారో అన్న నిజాన్ని బయటపెట్టింది.
హెచ్చరికతోనే సరా..?
ఇవనే కాదు ఇలాంటి వివాదాలు వరుస పెట్టి బయటపడుతున్నా "చంద్రబాబు మండిపడ్డారు " "నేతల్ని హెచ్చరించారు " ఇలాంటి హెడ్డింగ్స్‌కి వార్తలు పరిమితం అవుతున్నాయి తప్ప ఆయన తనదైన శైలిలో యాక్షన్ తీసుకున్న సూచనలు కనిపించడం లేదు. 2024లో గెలిచి పార్టీ అధికారంలోకి వచ్చిన కొత్తలో అసభ్యకరమైన వీడియోలో కనిపించినందుకు సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలాన్ని వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేశారు చంద్రబాబు. అలాంటి ఫైర్‌నే తెలుగు ప్రజలు చంద్రబాబు నుంచి ఎదురుచూసేది.
నిజంగానే 1995-99 మధ్య చంద్రబాబు అంటే స్ట్రిక్ట్ పొలిటీషియన్, క్రమశిక్షణ కలిగిన అడ్మినిస్ట్రేటర్‌గా దేశవ్యాప్తంగా పేరు ఉండేది. ఆయన కూడా అది గమనించి "తాను 95మోడల్ చంద్రబాబు "గానే పని చేస్తానని పదేపదే చెబుతున్నారు. కానీ గ్రౌండ్ రియాల్టీ అలా కనిపించడం లేదన్న వాదన ఉంది. ఆయన మనసులో ఏముందో తెలియదు గానీ పార్టీ క్రమశిక్షణపరంగా సామాన్య తెలుగు ప్రజలు ఎదురుచూస్తున్న చంద్రబాబు పనితీరు ఇదైతే మాత్రం కాదు అనే విశ్లేషణలు బలంగా వినిపిస్తున్నాయి.





















