Telangana Governor Tamilisai visit AP: గవర్నర్ వస్తేనే రోడ్ల మరమ్మతులా- తమిళిసై ఏపీ పర్యటనలో రాజకీయ దుమారం
ఏపీలో తెలంగాణ గవర్నర్ పర్యటన రాజకీయ దుమారం రేపింది. గవర్నర్ తమిళిసై వస్తున్నారానే రోడ్లపై గుంతలు పూడ్చారంటూ ప్రతిపక్షాలు, ప్రజలు ఆరోపణ. సామన్య ప్రజల ఇబ్బందులు పట్టావా అంటూ ఫైర్.
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించారు. ఎస్‌ఆర్‌ఎం యూనివర్శిటీ స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు హైదరాబాద్ నుంచి గవర్నర్ వస్తుండటంతో.. రాత్రికి రాత్రే అధికారులు రోడ్లపై ఉన్న గుంతలు పూడ్చారు. దీంతో ప్రభుత్వం తీరుపై ప్రజలు, ప్రతిపక్షాలు భగ్గుమంటున్నారు. కొన్నేళ్లు రోడ్ల బాగోగులు పట్టించుకోని పాలకులు, అధికారులు... గవర్నర్ వస్తున్నారంటే.. హడావుడిగా గుంతలు పూడ్చటంపై మండిపడ్డారు. రోడ్లపై అడుగుకో గుంత పడి... కొన్నేళ్లుగా ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోలేదని ఆపించారు. గర్నవర్ వస్తున్నారంటే మాత్రం... కొన్ని గంటల్లోనే గుంతలు పూడ్చేశారని... ఇదేమి రాజ్యమంటూ ప్రశ్నిస్తున్నారు.
ఎస్‌ఆర్‌ఎం యూనివర్శిటీ స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లారు తెలంగాణ గవర్నర్ తమిళిసై. ఆమెకు గన్నవరం ఎయిర్‌పోర్టులో కలెక్టర్ రాజాబాబు, ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. గన్నవరం నుంచి రోడ్డు మార్గంలో విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి వెళ్లారు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్. ఇంద్రకీలాద్రికి చేరుకున్న గవర్నర్‌కు దుర్గామల్లేశ్వరస్వామి ఆలయ ఈవో అధికారులు, వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. తమిళిసై అమ్మవారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత ఆమెకు వేదపండితులు ఆశీర్వచనం అందించారు.
చంద్రయాన్ 3 విజయవంతమైనందుకు సంతోషంగా ఉందన్నారు తమిళిసై. ఆదిత్య-వన్ కూడా దిగ్విజయంగా లక్ష్యాలను పూర్తిచేయాలని ఆశించారు. ఇస్రో శాస్త్రవేత్తల శ్రమ ఫలించాలని దుర్గమ్మను వేడుకున్నట్టు చెప్పారు తెలంగాణ గవర్నర్ తమిళసై. ఇక్కడి వరకు బాగానే ఉన్నా... గన్నవరం నుంచి రోడ్డు మార్గంలో విజయవాడ కనకదుర్గమ్మకు గవర్నర్ వెళ్తారన్న షెడ్యూల్ రాగానే అక్కడి అధికారులు అప్రమత్తమయ్యారు. గవర్నర్ వెళ్లే మార్గంలో రోడ్ల మరమ్మతులు చేపట్టారు. ఉన్నట్టుండి అధికారయంత్రాంగం మొత్తం కదిలి రోడ్లపై గుంతలు పూడ్చడం.. మంగళగిరిలో రాజకీయ దుమారం రేపింది.
తమిళసై రానున్నారన్న సమాచారంతో.. రాత్రికి రాత్రే ఆమె ప్రయాణించే రహదారుల్లో గుంతలను పూడ్చేరాని స్థానిక ప్రజలు చెప్తున్నారు. రాత్రి కంకరతో గుంతలు పూడ్చారని మంగళగిరి మండలం కురగల్లు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. కురగల్లు వైపుగా తెలంగాణ గవర్నర్ వస్తుందన్న విషయం తెలుసుకున్న.. స్థానిక యువకులు తమ ప్రాంతంలోని రహదారుల దుస్థితిని తెలియజేస్తూ గ్రామంలో ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు. గవర్నర్ వస్తేనే గుంతలు పూడుస్తారా అంటూ ఫ్లెక్సీల్లో ప్రశ్నించారు.
కురగల్లు గ్రామంలో అధికారుల పనితీరుకు నిరసనగా ఫ్లెక్సీలు కట్టడంతో.. పోలీసులు అలర్ట్ అయ్యారు. గవర్నర్ పర్యటన సందర్భంగా... అనుకోని సంఘటనలు జరగొచ్చని, గవర్నర్ కాన్వాయ్ అడ్డుకోవచ్చే కారణంగా... ఫ్లెక్సీలు కట్టిన కురగల్లు గ్రామ యువకులను ముందస్తుగా అరెస్ట్ చేశారు. అయితే, యువకుల అరెస్టుతో గ్రామంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.