(Source: ECI/ABP News/ABP Majha)
పీసీసీ చీఫ్ షర్మిల తొలి పోరు విశాఖలోనే
Sharmila News: ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన వైఎస్ షర్మిల స్పీడ్ పెంచుతున్నారు. రాహుల్ గాంధీ యాత్ర పై దాడిని నిరసిస్తూ ఆమె తొలి పోరును విశాఖ నుంచి ప్రారంభిస్తున్నారు.
AP PCC Chief Sharmila Tour In Vizag: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన వైఎస్ షర్మిల స్పీడ్ పెంచుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని వైసీపీ సర్కారుపై పదునైన విమర్శలు చేసిన ఆమె.. ఇప్పుడు క్షేత్రస్థాయిలో పోరుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే జిల్లాలు వారీగా టూరుకు సన్నద్ధమైన ఆమె.. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ న్యాయ జోడో యాత్రపై అసోంలో జరిగిన దాడిని ఖండిస్తూ నిరసనకు పిలుపునిచ్చారు. రాష్ట్ర, జిల్లా కేంద్రాల్లో మౌన దీక్షలు చేపట్టాలని పిలుపునిచ్చిన షర్మిల.. స్వయంగా ఆమె కూడా విశాఖలో పాల్గొననున్నారు. ఇదే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ శ్రేణులను ఆనందానికి గురి చేస్తోంది. ఏపీసీసీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన కొద్దిరోజుల్లోనే షర్మిల రాజకీయాల్లో వేగం పెంచడంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు.
జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద దీక్ష
రాహుల్ గాంధీ సాగిస్తున్న యాత్రపై బీజేపీ గూండాలు దాడి చేశారంటూ విమర్శలు చేసిన షర్మిల.. మౌన దీక్షలో పాల్గొనేందుకు విశాఖకు వస్తున్నారు. సోమవారం సాయంత్రం 5.30 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్టుకు ఆమె చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కేడర్‌తో కలిసి జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్దకు చేరుకుని మౌనదీక్ష చేయనున్నారు. అనంతరం పార్టీ నాయకులతో కలిసి స్థానిక హోటల్‌లో సమావేశం కానున్నారు. అనంతరం ఆమె తిరిగి విజయవాడకు వెళతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పీసీసీ అధ్యక్షురాలిగా షర్మిల బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలిసారి విశాఖకు వస్తున్న నేపథ్యంలో ఘనంగా స్వాగతం పలికేందుకు ఆ పార్టీ నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. వైసీపీ ఆవిర్భావం తరువాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కేడర్‌లో స్తబ్ధత ఏర్పడింది. ఇప్పటి వరకు ఎంతో మంది పీసీసీ అధ్యక్షులు వచ్చినప్పటికీ కేడర్‌లో ఉత్సాహాన్ని తీసుకురాలేకపోయారు. తొలిసారి షర్మిల పగ్గాలు తీసుకున్న తరువాత ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం కనిపిస్తోంది.
ఆసక్తి రేపుతున్న పర్యటన..
షర్మిల విశాఖ పర్యటన సర్వత్రా ఆసక్తిని కలిగిస్తోంది. పీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత ఆమె తొలి పర్యటన ఇది. అది కూడా రాహుల్ గాంధీ యాత్రపై దాడిని నిరసిస్తూ చేపడుతున్నారు. ఇక్కడ వచ్చిన తరువాత ఆమె రాజకీయంగా వైసీపీపై ఏమైనా విమర్శలు చేస్తారా..? మౌన దీక్షను ముగించుకుని వెళతారా..? అన్నది చూడాల్సి ఉంది. ఏది ఏమైనా షర్మిల పర్యటన పట్ల ఆ పార్టీ శ్రేణులు మాత్రం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి వందలాది మంది కార్యకర్తలు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్దకు చేరుకునేందుకు సిద్ధమవుతున్నారు.