Amaravati Farmers : కౌలుకూ నోచుకోని అమరావతి రైతులు - వారిపై ప్రభుత్వానికి అంత పగ ఎందుకు ?
అమరావతి రాజధాని రైతులకు ప్రభుత్వం కౌలుకూడా సక్రమంగా ఇవ్వడం లేదు. ప్రభుత్వం ఒప్పందాలను ఉల్లంఘిస్తోందని.. కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని రైతులు అంటున్నారు.
Amaravati Farmers : అమరావతికి భూములు ఇచ్చిన రైతులపై ఏపీ ప్రభుత్వం పగ సాధిస్తుందన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటి వరకూ జరిగినవి కాకుండా చట్ట ప్రకారం ఇవ్వాల్సిన కౌలు కూడా ఇవ్వడం లేదు. రాజధాని నిర్మాణం కోసం తొమ్మిదేళ్ల క్రితం భూములు ఇచ్చిన రైతులకు ప్రతి ఏటా ఇచ్చే వార్షిక కౌలు అందజేయడంలో గత మూడేళ్లుగా తీవ్ర జాప్యం జరుగుతోంది. దీంతో రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. అందరూ చిన్న, సన్నకారు రైతులే కావడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పంటలు లేక.. కౌలు ఇవ్వక.. ప్రభుత్వం అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వక సమస్యలు ఎదుర్కొంటున్నారు.
వైసీపీ ప్రభుత్వం వచ్చాక రైతులకు సమస్యలు
2016 నుంచి 2019 వరకు ఏటా ఏప్రిల్ నుంచి మే చివరిలోగా వార్షిక కౌలు సొమ్ము రైతుల ఖాతాల్లో జమయ్యేది. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 2020 నుంచి ఏటా జూన్ నుంచి ఆగస్టులోగా జమ చేస్తూ వచ్చింది. ఈ ఏడాది ఇంత వరకు రైతుల ఖాతాల్లో వార్షిక కౌలు జమ కాలేదు. తమకు కౌలు సొమ్ము రాలేదని కోర్టును ఎవరైతే ఆశ్రయిస్తున్నారో వారికి మాత్రమే కౌలు చెల్లింపులు జరుగుతున్నాయి. కోర్టును ఆశ్రయించిన దాదాపు 2,400 మందికి ఈ ఏడాది వార్షిక కౌలు జమైంది. మిగతా వారికి ఇంతవరకూ జమకాలేదు. కోర్టులో పిటిషన్ వేయగానే సంబంధిత పిటిషన్‌దారులకు కౌలు చెల్లిస్తున్న సిఆర్‌డిఎ అధికారులు... మిగతా వారి గురించి పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు.
రాజధాని కోసం భూముల్ని త్యాగం చేసిన రైతులు
రాజధాని నిర్మాణ నిమిత్తం 2015లో సిఆర్‌డిఎకు భూములు అప్పగించిన 22,736 మంది రైతులకు పదేళ్లపాటు ఏటా పది శాతం పెంచేలా అప్పటి టిడిపి ప్రభుత్వం రాజధాని రైతులకు కౌలు సాయం ప్రకటించింది. మెట్ట భూములకు ఎకరాకు రూ.30 వేలు, మూడు పంటలు పండే జరీబు భూముల రైతులకు ఎకరాకు రూ.50 వేలు కౌలు అప్పటి టిడిపి ప్రభుత్వం నిర్ధారించింది. ఈ మొత్తంపై ఏటా పది శాతం సొమ్ము పెంచి రైతుల ఖాతాల్లో జమయ్యేలా గత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ విధానాన్ని ప్రస్తుత ప్రభుత్వం కొనసాగిస్తోన్నా, చెల్లింపుల్లో తీవ్ర జాప్యం చేస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూ సమీకరణలో 22,736 మంది రైతులు 33,717 ఎకరాల భూములు ఇవ్వగా, వీరికి 2015 నుంచి 2019 వరకు సకాలంలో కౌలు డబ్బులు వారి ఖాతాల్లో జమయ్యాయి. 2020 నుంచి ఏటా జాప్యం జరుగుతోంది.
కోర్టుల్లో వారాల కొద్దీ వాయిదాలతో సమస్యలు
కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన వారికి మాత్రమే 2021 నుంచి ఏటా రైతులకు కౌలు సాయం అందిస్తున్నారు. ఈ ఏడాది మేలో ఇవ్వాల్సిన కౌలు సొమ్ము ఇంతవరకు రైతుల ఖాతాల్లో జమ కాలేదు. జీవో జారీ చేశామని ఓ సారి.. సీఎఫ్ఎంఎస్‌లో ఉన్నాయని మరోసారి వాదనలు వినిపించి మూడు, నాలుగు వారాల వాయిదా కోరుతున్నారు ప్రభుత్వ లాయర్లు. ఆ తర్వాత కూడా కోర్టును ఆశ్రయించిన వారికే ఇస్తున్నారు. గత రెండేళ్లుగా అసైన్డు రైతులకు కూడా కౌలు పరిహారం నిలిచిపోయింది. 29 గ్రామాల్లో మూడు వేల మంది అసైన్డు రైతులు ఉన్నారు. వీరి భూములు కూడా రాజధానికి తీసుకున్నారు. అసైన్డు భూముల అప్పగింతలో అక్రమాలు జరిగాయని సిఐడి అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ దర్యాప్తు పెండింగ్‌లో ఉండడంతో మూడు వేల మంది అసైన్డు రైతులకు కౌలు పరిహారం నిలిపివేశారు. ఏ భూమి వివాదంలో ఉంటే ఆ భూమికి పరిహారం నిలిపివేయాలని, అందరికీ నిలిపివేయడం సరికాదని అసైన్డు రైతులు గత రెండుళ్లుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.