Anantapur TDP politics : జేసీ పవన్ ఎక్కడ ? అనంతపురం ఎంపీగా పోటీ చేసే ఉద్దేశంలో లేరా ?
JC Diwakar Reddy son : అనంతపురం ఎంపీగా జేసీ దివాకర్ రెడ్డి కుమారుడు పోటీ చేయడం లేదా ? జేసీ పవన్ టీడీపీకి ఎందుకు దూరంగా ఉంటున్నారు.
Anantapur JC Diwakar Reddy son : అనంతపరం జిల్లాలో జేసీ బ్రదర్స్ వారసుల రాజకీయంలో స్పష్టమైన తేడా కనిపిస్తోంది. జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు విస్తృతంగా పర్యటిస్తూ వచ్చే ఎన్నికలకు సిద్ధమవుతూంటే..జేసీ దివాకర్ కర్ రెడ్డి, ఆయన కుమారుడు జేసీ పవన్ రెడ్డి మాత్రం వీలైనంత మౌనం పాటిస్తున్నారు.
జేసీ కుటుంబానికి అనంతపురం జిల్లాలో ప్రత్యేక ము్దర
సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కుటుంబం. 2019 ఎన్నికల్లో జేసీ బ్రదర్స్ వారసులను రాజకీయాలకు దింపాలని ఆలోచించారు. తెలుగుదేశం పార్టీ అధిష్టానంతో మాట్లాడి వారి స్థానాల్లో తమ వారసులకు టికెట్లు తెచ్చుకోవడంలో సక్సెస్ అయ్యారు. 2019 ఎన్నికల్లో తాడిపత్రి టీడీపీ అభ్యర్థిగా జేసీ ప్రభాకర్ రెడ్డి తనయుడు జేసీ అస్మిత్ రెడ్డి, అనంతపురం పార్లమెంటు అభ్యర్థిగా జేసీ దివాకర్ రెడ్డి తనయుడు జెసి పవన్ రెడ్డి రంగంలోకి దిగారు. రాజకీయంగా ఎంతో అనుభవం ఉన్న రాజకీయ ఉద్దండుల కుమారులు గెలుపే లక్ష్యంగా 2019 ఎన్నికల్లో ప్రచారం కొనసాగించారు. అనూహ్యంగా రాష్ట్రమంతా జగన్ ఫ్యాన్ గాలి గట్టిగా వియడంతో అటు తాడిపత్రిలోనూ.. ఇటు అనంతపురం పార్లమెంట్ అభ్యర్థిగా పోటీచేసిన పవన్ రెడ్డి ఓటమి చెందారు.
కొంత కాలం నుంచి సైలెంట్ అయిన జేసీ పవన్ రెడ్డి
ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తుండడంతో తాడిపత్రిలో జెసి ప్రభాకర్ రెడ్డి ప్రజా వ్యతిరేక విధానాలపై తీవ్రంగా పోరాడుతున్నారు. అయితే మరోపక్క జెసి పవన్ మాత్రం జిల్లాలో కనిపించడం లేదు. రానున్న ఎన్నికల్లో జేసీ పవన్ కుమార్ రెడ్డి అనంతపురం పార్లమెంటు అభ్యర్థిగా నిలబడతాడా లేదా అన్నది ప్రశ్నగా మిగిలింది. గడచిన రెండు సంవత్సరాలుగా జెసి పవన్ క్రియాశీలక రాజకీయాల్లో చురుకుగా ఉండడం లేదు. జనవరిలో తిరిగి వస్తారని ఆయన అనుచరవర్గంలో ప్రచారం జరుగుతుంది. పవన్ చురుకుగా పనిచేస్తే అధిష్టానం మరో అవకాశం కల్పిస్తుందని ఆయన అభిమానులు ఆశిస్తున్నారు. ప్రస్తుత పరిణామాల దృష్ట్యా జెసి కుటుంబం తెలుగుదేశం పార్టీ కోసం విశేషంగా పోరాటం చేస్తుంది. 2019 ఎన్నికల అనంతరం అనంతపురం పార్లమెంట్ పరిధిలో ఏ కార్యక్రమం జరిగిన జెసి పవన్ రెడ్డి పాల్గొనేవారు. అనంతపురం అర్బన్ లో తెలుగుదేశం పార్టీ నేత ప్రభాకర్ చౌదరితో విభేదాలు ఉన్నప్పటికీ జెసి పవన్ తన అనుచరులతో కలిసి తన పని తాను చేసుకుంటూ వెళ్తుండేవాడు. క్యాడర్ కి భరోసానిస్తూ ముందుకెళ్లాడు.
పవన్ రెడ్డి పోటీ చేసే ఉద్దేశంలో లేరా ?
ప్రస్తుతం రాజకీయాల్లో పవన్ చురుకుగా లేకపోవడం కార్యకర్తల్లో కొంత నిరాశ ఆందోళన చెందుతున్నారు. కారణాలు ఏవైనా ప్రస్తుతం పార్టీ కార్యక్రమాలకు మాత్రం జెసి పవన్ దూరంగా ఉంటూ వస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యువగళం పాదయాత్ర ఉమ్మడి అనంతపురం జిల్లాలో కొనసాగింది. లోకేష్ పాదయాత్రలో పార్టీ సీనియర్ నేతలతో పాటు పార్టీలో టికెట్ ఆశిస్తున్న అభ్యర్థుల సైతం పాదయాత్రలో చురుగ్గా పాల్గొన్నారు. జెసి దివాకర్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి లు ఈ యాత్రలో పాల్గొన్నారు. పాదయాత్రలో జెసి పవన్ పాల్గొనుకపోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.
అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలనుకుంటున్నారా ?
జేసీ పవన్ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసేందుకు సుముఖంగా లేనట్లు పార్టీలో చర్చించుకుంటున్నారు. అనంతపురం పార్లమెంటు పరిధిలో ఏదైనా అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు చర్చ కొనసాగుతుంది. ఏది ఏమైనాప్పటికీ బలమైన రాజకీయ కుటుంబం నేపథ్యం ఉన్న జెసి పవన్ రెడ్డి త్వరలోనే క్రియాశీలక రాజకీయాల్లో పాల్గొని నమ్ముకున్న పార్టీ కేడర్ కు అభిమానులకు భరోసాని ఇవ్వాలని అభిమానులు కార్యకర్తలు కోరుకుంటున్నారు.