Chandrababu Arrest: చంద్రబాబు కేసులో ఒకే రోజు 5 పిటిషన్లు, నేడు విచారణ
Chandrababu Arrest: స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో సీఐడీ దూకుడు పెంచింది. చంద్రబాబును 5రోజుల కస్టడీకి ఇవ్వాలన్న ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్ వేసింది.
Chandrababu Arrest: స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో సీఐడీ దూకుడు పెంచింది. చంద్రబాబును సీఐడీ కస్టడీకి ఇవ్వాలన్న ఏసీబీ కోర్టులో పిటిషన్ వేసింది. చంద్రబాబును 5 రోజుల కస్టడీకి కోరుతూ సీఐడీ అధికారులు పిటిషన్ దాఖలు చేసింది. బుధవారం పిటిషన్ విచారణకు రానుంది. చంద్రబాబు లాయర్లు కౌంటర్ పిటిషన్ దాఖలు చేయకపోవడంతో ఏసీబీ కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. కౌంటర్ పిటిషన్‌ను బుధవారం దాఖలు చేస్తామని చంద్రబాబు తరఫున లాయర్లు న్యాయస్థానానికి వివరించారు.
చంద్రబాబుకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ టీడీపీ కార్యకర్త మహేష్‌రెడ్డి, కిలారు నితిన్, గింజుపల్లి సుబ్బారావు వేరువేరుగా ఏసీబీ కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. అలాగే సీఐడీ ఎఫ్ఐఆర్‌పై చంద్రబాబు తరఫు న్యాయవాదులు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. ఎఫ్ఐఆర్‌లో చంద్రబాబు పేరు లేకుండానే అరెస్ట్ చేశారని ఆయన తరఫు న్యాయవాదులు కోర్టుకు వెల్లడించారు. రిమాండ్ రిపోర్ట్‌లో ఆరోపణలకు చంద్రబాబుకు ఎలాంటి ఆధారాలు లేవని తెలిపారు. రాజకీయ కక్షసాధింపులో భాగంగానే అరెస్ట్ చేశారని తెలిపారు. తప్పుడు కేసులో చంద్రబాబును ఇరికించారని పిటిషన్ వేశారని పిటిషన్‌లో పేర్కొన్నారు.
చంద్రబాబు తరఫున క్వాష్ పిటిషన్ తో పాటు హైకోర్టులో మరో రెండు పిటిషన్లు దాఖలయ్యాయి. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కుంభకోణంలో ఏ1గా ఉన్న చంద్రబాబుకు బెయిల్ కోరుతూ మరో పిటిషన్ దాఖలైంది. అంగళ్లు అల్లర్ల కేసులో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ కోసం ఇంకొక పిటిషన్ దాఖలైంది. చంద్రబాబుకు సంబంధించిన మూడు పిటిషన్లపై నేడు హైకోర్టులో విచారణ జరిగే అవకాశాలు అవకాశాలు ఉన్నాయి. స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో టీడీపీ చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
చంద్రబాబు హౌజ్ రిమాండ్ పిటిషన్ కొట్టివేత
చంద్రబాబును హౌజ్ రిమాండ్‌కు అనుమతించాలని వేసిన పిటిషన్‌పై మంగళవారం హోరాహోరీగా వాదనలు జరిగాయ. సీఐడీ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం చంద్రబాబు హౌజ్ రిమాండ్ పిటిషన్‌ను కొట్టేసింది. సెంట్రల్ జైల్లో చంద్రబాబు కావాల్సినంత భద్రత ఉందని సీఐడీ అధికారులు తెలిపారు. సీఐడీ వాదనతో ఏకీభవించిన ఏసీబీ కోర్టు తీర్పును వెలువరించింది. ఈ విషయమై అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. సీఆర్పీసీ చట్టంలో కేవలం రెండే కస్డడీలు ఉంటాయన్నారు.
వీటిలో ఒకటి పోలీస్ కస్టడీ కాగా మరోటి జుడీషియల్ కస్టడీ అని తెలిపారు. జైలులో చంద్రబాబు కోసం ప్రత్యేకంగా ఒక బ్యారెక్‌ను కేటాయించినట్లు పొన్నవోలు చెప్పుకొచ్చారు. అంతేకాకుండా చంద్రబాబు భద్రత కోసం సీసీ కెమెరా, మెడికల్ ఎమర్జెన్సీ కూడా ఉన్నట్లు ఆయన వివరించారు. ఇక చంద్రబాబును శత్రుదుర్భేద్యంగా ఉంచినట్లు పొన్నవోలు తెలిపారు. ఈ కారణంగానే ఆయన హౌజ్ రిమాండ్ అవసరం లేదని ఆయన వాదించారు. మొత్తం మీద పొన్నవోలు వాదనతో ఏకీభవించిన ఏసీబీ కోర్టు రిమాండ్ పిటిషన్‌ను కొట్టేస్తూ తీర్పునిచ్చింది.
చంద్రబాబుతో కుటుంబ సభ్యుల ములాఖాత్
చంద్రబాబుతో మంగళవారం కుటుంబ సభ్యుల ములాఖత్ ముగిసింది. చంద్రబాబుతో భువనేశ్వరి, లోకేష్‌తో పాటు బ్రాహ్మణి మాట్లాడారు. చంద్రబాబుతో కుటుంబ సభ్యులతో 40 నిమిషాల పాటు చర్చించారు. ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ.. చంద్రబాబు ఏపీ అభివృద్ధి కోసమే పోరాడారన్నారు. చంద్రబాబు జీవితమంతా ప్రజల కోసమే ధారపోశారని అన్నారు. ఇది తమ కుటుంబానికి ఇది చాలా కష్టకాలమన్నారు. చంద్రబాబు నిర్మించిన జైల్లోనే ఆయన్ను కట్టిపాడేశారంటూ ఆమె వాపోయారు.