కల్లుగీత కార్మికులకు రూ.10లక్షలు- ‘వైఎస్ఆర్ గీత కార్మిక భరోసా’ ప్రకటించిన సీఎం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 95,245 కల్లు గీత కుటుంబాలు కులవృత్తిపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. ఏటా 1,200 మంది గీత కార్మికులు కల్లు తీస్తూ ప్రమాదానికి గురవుతున్నారు.
కల్లుగీత కార్మికుల సంక్షేమం కోసం ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కల్లు తీస్తూ ప్రమాదవశాత్తూ చెట్టుపై నుంచి పడి మరణించిన, శాశ్వత అంగవైకల్యానికి గురైనా కల్లు గీత కార్మికుల కుటుంబాలకు అండగా నిలిచేందుకు ఏపీ ప్రభుత్వం ‘వైఎస్ఆర్ గీత కార్మిక భరోసా’ పథకాన్ని ప్రకటించింది. ప్రమాదవశాత్తూ చెట్టుపై నుంచి పడి మరణించిన కల్లుగీత కార్మికుల కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలని నిర్ణయించింది. చెట్టుపై నుంచి పడి శాశ్వత అంగవైకల్యానికి గురైన కల్లుగీత కార్మికునికి కూడా రూ.10లక్షలు పరిహారం అందిస్తారు. పరిహారంలో రూ.5 లక్షలు కార్మిక శాఖ, మరో రూ.5లక్షలు రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా రూపంలో అందిస్తాయి. శుక్రవారం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ‘వైఎస్ఆర్ గీత కార్మిక భరోసా’ పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
జగన్ నిర్ణయంపై గీత కార్మికుల కుటుంబాల్లో సంతోషం
సీఎం వైఎస్ జగన్ ప్రకటించిన ‘వైయస్ఆర్ గీత కార్మిక భరోసా’ పథకం రాష్ట్రంలోని వేలాది గీతకార్మిక కుటుంబాలకు అండగా నిలవనుందని ప్రభుత్వం భావిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 95,245 కల్లు గీత కుటుంబాలు కులవృత్తిపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. ఏటా 1,200 మంది గీత కార్మికులు కల్లు తీస్తూ ప్రమాదానికి గురవుతున్నారు. వారిలో దాదాపు 40శాతం మంది ప్రాణాలు కోల్పోతుండగా..మిగిలిన వారు శాశ్వతంగా వైకల్యం బారిన పడుతున్నారు. గీత కార్మికుల ఇబ్బందులను గుర్తించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. ప్రమాదవశాత్తూ మరణించినా, శాశ్వతంగా వైకల్యం బారినపడిన కల్లు గీత కుటుంబాలకు రూ.10లక్షల పరిహారాన్ని ప్రకటించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్ణయంపై కల్లుగీత కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
చంద్రబాబు హయాంలో కేవలం రూ.7లక్షల పరిహారం
గతంలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ప్రమాదవశాత్తూ గీత కార్మికుడు మరణిస్తే..ఆ కుటుంబానికి రూ.2లక్షల పరిహారంగా అందించేవారు. ఎక్స్ గ్రేషియా పెంచాలని గీత కార్మిక కుటుంబాలు డిమాండ్ చేస్తున్నాయి. దీనికి చంద్రన్న బీమా జత చేసింది గత ప్రభుత్వం. అంటే ప్రభుత్వం ఇచ్చే రెండు లక్షలు, చంద్రన్న బీమాతో వచ్చే ఐదు లక్షలు మొత్తం ఏడు లక్షలు వచ్చేవి. ఇప్పుడు దాన్ని పది లక్షలకు పెంచింది.
కల్లు తీస్తూ ప్రమాదవశాత్తూ అంగవైకల్యం బారిన పడినవారు దరఖాస్తు చేసుకుంటే ఎక్సైజ్ శాఖ నిబంధనలకు అనుగుణంగా వైకల్యం సర్టిఫికెట్‌ను జారీ చేస్తుంది. ఇందుకోసం ఎక్సైజ్ శాఖ గురువారం ఉత్తర్వులు జారీచేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన రాష్ట్ర కల్లుగీత విధానం 2022–2027 ప్రకారం ఈ పరిహారాన్ని ఎక్సైజ్ శాఖ ప్రకటించింది.