GO VADHA ROW : బీజేపీ - వైసీపీ మధ్య "గోవధ" రగడ..!
గోవధ చట్టాన్ని కాలం చెల్లినిదిగా అభివర్ణించిన వైసీపీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి, పార్టీ నుంచి తొలగించాలని జగన్‌కు ఏపీ బీజేపీ డిమాండ్.
" కాలం చెల్లిన చట్టాల్లో గోవధ చట్టం ఒకటి. ప్రపంచంలో ఎక్కడా గోవధ చట్టం అమలులో లేదు. లౌకిక దేశంలో గోవు పూజించే వారికి పూజించే వస్తువు, తినే వారికి ఆహార వస్తువు. ప్రజల ఆహార అలవాట్లపై నిషేధం విధించడం పౌరుడి ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడమే" కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వైసీపీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇవి. ఇప్పుడు రాజకీయ వివాదానికి కారణం అవుతున్నాయి. బీజేపీ నేతలు ఆయన ఇంటిని ముట్టడించారు. ఆయన స్వతహాగా అన్న మాటలు కావని.. ఆయన పార్టీ అభిప్రాయాలనే వెల్లడించారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ఎమ్మెల్యే ఇంటిని బీజేపీ నేతలు ముట్టడించారు. క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
బీజేపీ రాష్ట్ర నాయకత్వం కూడా ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు హిందూ మతాన్ని కించ పరిచేట్లుగా మాట్లాడుతున్నారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు. సీఎం జగన్ మౌనంగా ఉన్నారంటే... వారికి మద్దతిచ్చినట్లుగానే భావిస్తున్నామన్నారు. ఎమ్మిగనూరు ఎమ్మెల్యే మాటలను సమర్థించకపోతే.. తక్షణం ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. రాయలసీమకు చెందిన బీజేపీ నేతలు ఎమ్మిగనూరు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ధర్నాలు, ప్రదర్శనలు కూడా నిర్వహిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ నాయకలు.. ప్రజల్లోకి వెళ్లేందుకు.. అవసరమైన అంశం కోసం చూస్తున్నారు. ఈ సమయంలో చెన్న కేశవరెడ్డి వారికి మంచి ఆయుధం ఇచ్చినట్లయింది. దీంతో బీజేపీ నేతలకు ఒక్కసారిగా ఉత్సాహం వచ్చింది. ఇప్పటికే వైసీపీ సర్కార్‌పై మతమార్పిడుల ఆరోపణలు చేస్తున్న బీజేపీ నేతలు... ఇప్పుడు గోవధ అంశంతో మరింత ఇరుకున పెట్టాలని ప్రయత్నిస్తున్నారు. బీజేపీ ప్లాన్‌ను పసిగట్టారేమో కానీ.. వివరణ ఇవ్వాలని ఎమ్మిగనూరు ఎమ్మెల్యేకు.. సందేశం పంపారు. దీంతో.. చెన్నకేశరెడ్డి..తన వ్యాఖ్యలకు పార్టీకి సంబంధం లేదని వివరణ ఇచ్చారు. గోవధ నిషేధ చట్టంపై మాట్లాడిన మాటలు వైసీపీకి, సీఎంవో కార్యాలయానికి ఎటువంటి సంబంధం ప్రకటించారు. తాను పక్కా హిందువునని, హిందు దేవుళ్లనే కొలుస్తానన్నారు.
అయితే భారతీయ జనతా పార్టీ నాయకులు ఇలా వివరణ ఇవ్వడాన్ని కూడా ఓ అవకాశంగా చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఏపీ బీజేపీ నేతలు ఆలయాల సందర్శనలో ఉన్నారు. ఆ పర్యటనలో ..ఎక్కువగా చెన్నకేశవరెడ్డి అంశాన్నే చెబుతున్నారు. వైసీపీ ప్రభుత్వం ఆవును.. ఆహారవస్తువుగా చూస్తోందని ఆరోపిస్తున్నారు. తిప్పి కొట్టడానికి ఏపీ అధికార పార్టీ తన వంతు ప్రయత్నాలు చేస్తోంది. మరీ అతిగా స్పందిస్తే.. బీజేపీ ట్రాప్‌లో పడినట్లు అవుతుందని అనుకుంటున్నారు. విషయం పెద్దది కాకుండా... వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యేతోనే వివరణ ఇప్పించారు. వివాదానికి ముగింపు పలికే ప్రయత్నం చేశారు.