Donald Trump Tarrifs on India: భారత్‌కు బంగారం లాంటి గుడ్ న్యూస్ చెప్పిన డొనాల్డ్ ట్రంప్, కట్టుబడి ఉంటారా?
Trump Tarriffs On Gold | బంగారంపై ఎలాంటి టారిఫ్ విధించడం లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుభవార్త చెప్పారు. దాంతో గోల్డ్ మీద క్లారిటీ వచ్చింది.

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం ఒక ముఖ్యమైన ప్రకటన చేశారు. 'ది వాల్ స్ట్రీట్ జర్నల్' రిపోర్ట్ ప్రకారం.. బంగారంపై ఎలాంటి టారిఫ్ విధించడం లేదని గుడ్ న్యూస్ చెప్పారు. అసలే భారతీయులు అటు పెట్టుబడికి, ఇటు ఆభరణాల కోసం బంగారం గట్టిగానే కొంటుంటారు. అంతకుముందు, కస్టమ్స్, సరిహద్దు భద్రతా విభాగం అధికారులు బంగారంపై భారీ పన్నులు విధించవచ్చని చెప్పారు. అంతలోనే ట్రంప్ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. భారత్, రష్యాతో వివాదం నడుస్తున్న సమయంలో బంగారంపై టారిఫ్ లేదని ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఓవరాల్‌గా చూస్తే ట్రంప్ భారత్ పై 50 శాతం సుంకం విధించారు. ప్రస్తుతం 25 శాతం టారిఫ్ అమల్లోకి వచ్చింది. ఆగస్టు 27 నుంచి మిగతా 25 శాతం టారిఫ్ అమలులోకి రానుంది.
ట్రంప్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్రూత్‌లో ఒక పోస్ట్ షేర్ చేశారు. బంగారంపై భారీ సుంకం విధిస్తారని మార్కెట్‌లో వదంతులు వ్యాపించాయి. ఇదే సమయంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి, కానీ ట్రంప్ వదంతుల్ని కొట్టిపారేశారు. ఉపశమనం కలిగించే వార్త చెప్పారు. గత వారంలో, అమెరికా కస్టమ్స్ అధికారులు ఒక లేఖను విడుదల చేశారు. రెండు ప్రామాణిక బరువులు (ఒక కిలోగ్రాము, 100 ఔన్సులు) కలిగిన బంగారు కడ్డీలను సుంకం పరిధిలోకి తీసుకురావాలని తెలిపారు. ఈ లేఖ విడుదల తరువాత బంగారం వ్యాపారులతో పాటు పెట్టుబడిదారులలో ఆందోళన పెరిగింది. ఇది అంతర్జాతీయ బంగారం మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం చూపుతుందని అంతా భావించారు.
ట్రంప్ ప్రకటనతో బంగారంపై క్లారిటీ
బంగారంపై విధించనున్న టారిఫ్ పై ట్రంప్ చేసిన ఈ స్పష్టమైన ప్రకటనతో క్లారిటీ వచ్చింది. బంగారం వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యాపారులకు భారీ ఊరట కలిగింది. ఈ చర్య బంగారం ధరలు, దాని సంబంధిత వ్యాపారంలో స్థిరత్వాన్ని తెస్తుందని నిపుణులు భావిస్తున్నారు. భారత్ లాంటి దేశాలు ప్రపంచంలో బంగారం అధికంగా దిగుమతి చేసుకుంటున్నాయి. ఈ జాబితాలో చైనా తరువాత స్థానంలో భారత్ ఉంది.
అమెరికా భారత్ పై 50 శాతం సుంకం విధించింది
భారత్‌పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 50 శాతం సుంకం విధించారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడంపై భారత్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రష్యా యుద్ధాన్ని ప్రోత్సహిస్తుందని, భారత్ కొనుగోలు చేసి ఇస్తున్న మనీతో ఉక్రెయిన్ పై యుద్ధం చేస్తుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను శాంతిని కోరుకునే వ్యక్తినని, అందుకే భారత్, పాక్ మధ్య జరగాల్సిన యుద్ధాన్ని ఆపివేశానని ఇప్పటికీ డబ్బా కొట్టుకుంటున్న విషయం తెలిసిందే. భారత్‌తో జరిగే వాణిజ్య ఒప్పందంపై ట్రంప్ అసంతృప్తిగా ఉన్నారు. మొదట భారత్‌పై 25 శాతం సుంకం విధించారు. అయినా శాంతించక మరో 25 శాతం టారిఫ్ విధించారు. అమెరికాను చూసి భారత్ భయపడాల్సింది లేదన్న కేంద్రం వ్యాఖ్యలతో పాటు రష్యా, చైనా, బ్రెజిల్ లాంటి బ్రిక్స్ దేశాలతో భారత్ కలిసి కట్టుగా పనిచేసే అవకాశం ఉందని గ్రహించి భారత్ మీద విధించిన టారిఫ్ రెట్టింపు చేశారు. ఆసియా దేశాలను టార్గెట్ చేసి మరీ ట్రంప్ అధికంగా టారిఫ్ వేశారని విమర్శలు ఎదుర్కొంటున్నారు.






















