UK PM Rishi Sunak: పాలనలో రిషి సునాక్ మార్క్ - సొంత పార్టీ ఛైర్మన్‌పై వేటు వేసిన బ్రిటన్ ప్రధాని
UK PM Rishi Sunak Fires Party Chairman Nadhim Zahawi: సొంత పార్టీ ఛైర్మన్నదీమ్ జహావిని కేబినెట్ మంత్రి పదవి నుంచి తొలగిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు బ్రిటన్ ప్రధాని రిషి సునాక్.
UK PM Rishi Sunak Fires Party Chairman Nadhim Zahawi: తప్పు చేస్తే ఎవరినీ వదిలిపెట్టేది లేదని బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ మాటల్లో కాదు చేతల్లో చేసి చూపించారు. నిబంధనలు ఉల్లంఘించినందుకు విచారణ చేపట్టి, దోషిగా తేలడంతో సొంత పార్టీ ఛైర్మన్నదీమ్ జహావిని కేబినెట్ మంత్రి పదవి నుంచి తొలగిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. పన్ను చెల్లింపుల విషయంలో కన్జర్వేటివ్ పార్టీ ఛైర్మన్ నదీమ్ జహావి నిబంధనలు ఉల్లంఘించారు. దాంతో చర్యలలో భాగంగా ప్రభుత్వ పదవి నుంచి నదీమ్ ను తొలగించారు బ్రిటన్ ప్రధాని రిషి సునాక్.
అంతటితో ఆగకుండా జహావి చెల్లించి పన్ను వ్యవహారాలకు సంబంధించిన విషయాలను పరిశీలించేందుకు ఇండిపెండెంట్ అడ్వైజర్ కు బాధ్యతలు అప్పగించారు రిషి సునాక్. గత ఏడాది బ్రిటన్‌లో తలెత్తిన రాజకీయ మార్పులలో భాగంగా నదీమ్ జహావి కొంతకాలం ఆర్థిక మంత్రిగా సేవలందించారు. అయితే ఆయనపై పన్ను చెల్లింపుల విషయంలో ఆరోపణలు రావడంతో ప్రాథమిక విచారణ చేపట్టిన అనంతరం నదీమ్ జహావిని మంత్రి పదవి నుంచి తొలగిస్తున్నట్లు ఆదివారం రిషి సునాక్ పేర్కొన్నారు. ప్రభుత్వానికి సంబంధించి నదీమ్ ను గవర్నమెంట్ పదవి నుంచి తప్పించారు. సొంత పార్టీ ఛైర్మన్ పై ఇంత కఠిన నిర్ణయం తీసుకున్న రిషి సునాక్ ఇంక అవినీతి విషయం అయితే మరింత కఠిన నిర్ణయం తీసుకుని తన దైన మార్క్ పాలన అందిస్తారని బ్రిటన్ లో హాట్ టాపిక్‌గా మారారు.
— Nadhim Zahawi (@nadhimzahawi) January 29, 2023
పన్ను చెల్లింపు విషయంలో కన్జర్వేటివ్ పార్టీ ఛైర్మన్ నదీమ్ జహావి నిబంధనలు ఉల్లంఘించారని, అయితే ఇది అజాగ్రత్త మాత్రమేనని.. ఉద్దేశపూర్వకంగా తక్కువ పన్ను చెల్లించలేదని బ్రిటిష్ పన్ను అధికారులు నిర్ధారించారు. ఇండిపెండెంట్ అడ్వైజర్ దర్యాప్తు పూర్తయిన తరువాత విచారణలో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. తనను ప్రభుత్వానికి సంబంధించిన పోస్టుల నుంచి తప్పించడంపై నదీమ్ జహావి సోషల్ మీడియాలో స్పందించారు.
భవిష్యత్తులో మీకు నా మద్దతు ఎప్పుడూ ఉంటుందని తెలియజేస్తున్నాను. మీరు ఎంచుకున్న మార్గాలు సరైనవే. వాటిని మీరు అమలు చేయడంలో ఎప్పటికీ సహాయం అందించేందుకు సిద్ధంగా ఉంటానని వేటుకు గురైన నదీమ్ జహావి బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ కు రిప్లై ఇచ్చారు.
జహావి సేవల పట్ల గర్వపడాలన్న రిషి సునాక్..
గత ఐదేళ్లుగా ప్రభుత్వంలో ఉంటూ జహావి అందించిన సేవల పట్ల ఆయన గర్వపడాలన్నారు రిషి సునాక్. కరోనా వ్యాప్తి సమయంలో టీకాల సేకరణతో పాటు ఆయన తీసుకున్న పలు నిర్ణయాలు మంచి ఫలితాలను అందించాయని కొనియాడారు. పన్ను చెల్లింపుల విషయంలో పొరపాటు జరిగి ఉండొచ్చునని నదీమ్ జహావి అంగీకరించారు. అయితే ప్రభుత్వానికి నష్టం కలిగించే ఉద్దశంతో చేసిన పని కాదని, పొరపాటు జరిగిందన్నారు. మంత్రిగా నా బాధ్యతలు సక్రమంగా నిర్వహించినందుకు సంతోషంగా ఉంది. పన్ను చెల్లింపుల విషయంలో ప్రతిపక్ష పార్టీ నేతలు పదే పదే ఆరోపణలు చేస్తుండటంతో రిషి సునాక్ గత వారం ఇండిపెండెంట్ అడ్వైజర్ ను నియమించి నదీమ్ జహావి పన్ను చెల్లింపులపై దర్యాప్తునకు ఆదేశించడాన్ని సైతం ఆయన స్వాగతించారు. ఏ శాఖ లేకున్నా, కేబినెట్ హోదాలో యూకే ప్రభుత్వానికి తన వంతు సహకారం అందిస్తున్నారు. పలువురు మంత్రులకు ప్రభుత్వం తరఫున పలు శాఖల్లో, పలు హోదాల్లో సేవలు అందించారు. తాజాగా ప్రధాని ఆయనపై వేటు వేయడంతో ప్రభుత్వానికి సంబంధించి ఏ పదవిలోనూ కొనసాగలేరు నదీమ్.