Taliban Seizes Pakistan Outposts: పలు పాక్ స్థావరాలు స్వాధీనం చేసుకున్న తాలిబాన్లు, 12 మంది పాక్ సైనికులు మృతి
డ్యూరాండ్ సరిహద్దు రేఖ వెంట ఆఫ్గనిస్తాన్ కు చెందిన తాలిబాన్ బలగాలు దాడులు చేసి కొన్ని పాక్ స్థావరాలను స్వాధీనం చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో 12 మంది పాక్ సైనికులు మృతిచెందారు.

తాలిబాన్ నేతృత్వంలోని సైన్యం డ్యూరాండ్ లైన్ (సరిహద్దు రేఖ) వెంట ఉన్న పాకిస్తాన్ ఆర్మీ స్థావరాలను స్వాధీనం చేసుకుందని సమాచారం. ఈ విషయాన్ని ఆఫ్ఘనిస్తాన్ రక్షణ మంత్రిత్వ శాఖ శనివారం నాడు ధృవీకరించింది. "తాలిబాన్ దళాలు కునార్, హెల్మండ్ ప్రావిన్స్ లలో డ్యూరాండ్ సరిహద్దు రేఖ దాటి పాకిస్తాన్ ఆర్మీ నుండి అనేక స్థావరాలను స్వాధీనం చేసుకున్నాయి" అని ఆఫ్ఘనిస్తాన్ రక్షణ అధికారి తెలిపారు.
పాక్, తాలిబన్ బలగాల మధ్య నెలకొన్న ఉద్రిక్తత ఇప్పటికే తీవ్ర నష్టాన్ని కలిగించాయి. పాక్, ఆఫ్గన్ బలగాలు జరిపిన పరస్పర కాల్పుల్లో కనీసం 12 మంది పాకిస్తాన్ సైనికులు మరణించారని, మరికొందరు గాయపడ్డారని టిఓఎల్ఓన్యూస్ వర్గాలు వెల్లడించాయి. బహ్రాంచా జిల్లాలోని షాకిజ్, బిబి జానీ, సలేహాన్ ప్రాంతాలతో పాటు పక్తియాలోని ఆర్యూబ్ జాజీ జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
దాడికి కారణాన్ని వెల్లడించిన ఆఫ్గన్ రక్షణశాఖ
పాకిస్తాన్ ఆఫ్ఘన్ గగనతలాన్ని ఉల్లంఘించిన కారణంగా ఇది ప్రతిస్పందన దాడిగా అభివర్ణించారు ఆఫ్ఘనిస్తాన్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అయిన ఇనాయతుల్లా ఖ్వారజ్మి. స్థానిక సమయం ప్రకారం శనివారం అర్ధరాత్రికి పోరాటం ముగిసిందని ఆయన తెలిపారు. "ఒకవేళ ప్రత్యర్థి మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్ గగనతలాన్ని ఉల్లంఘిస్తే, మా సాయుధ దళాలు దానిని రక్షించేందుకు ఈసారి తీవ్ర స్థాయిలో మా ప్రతిస్పందనను ఎదుర్కోవడానికి పాక్ సైన్యం సిద్ధంగా ఉండాలని" అని ఖ్వారజ్మి హెచ్చరించారు.
తూర్పు ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో పోరాటం
ఆఫ్గనిస్తాన్ రాజధాని కాబూల్ సమీపంలో పాకిస్తాన్ వైమానిక దాడులు నిర్వహించిన కొన్ని రోజుల తర్వాత ఈ పరిణామం చోటుచేసుకుంది. ఆఫ్గన్ తాలిబన్ బలగాలు నంగర్హర్, కునార్ లోని పాకిస్తాన్ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని "ప్రతీకార" చర్యలకు దిగాయని ఆఫ్ఘనిస్తాన్ 201 ఖాలిద్ బిన్ వాలిద్ ఆర్మీ కార్ప్స్ పేర్కొంది.
పక్తియా ప్రావిన్స్ లోని ఆర్యూబ్ జాజీ జిల్లాలో కూడా ఘర్షణలు చెలరేగాయి. వివాదాస్పద సరిహద్దు వెంట స్పీనా షాగా, గివి, మాని జాభా, పరిసర ప్రాంతాలకు అల్లర్లు, ఘర్షణలు విస్తరించాయి. ఆఫ్ఘన్ రక్షణ మంత్రిత్వ శాఖ దాడిలో పాకిస్తాన్ సైనిక స్థావరాలు, ఆయుధాలు, సామాగ్రి ధ్వంసమయ్యాయని పేర్కొంది, ఇందులో కునార్, హెల్మండ్ ప్రావిన్స్ లలో ఒక్కొక్కటి చొప్పున స్థావరాలు ధ్వంసం చేసినట్లు తెలిపింది. తాలిబాన్ బలగాలు పాక్ నుంచి ఆయుధాలు, వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
తాలిబన్లు, పాక్ కు మధ్య పోరాటం తీవ్రమవుతున్నట్లు కనిపిస్తోంది. పక్తియా, పక్తికా, ఖోస్ట్, కునార్, హెల్మండ్, నంగర్హర్ ప్రావిన్స్ లలో ఒకే సమయంలో ఘర్షణలు జరిగినట్లు సమాచారం. 2021లో తాలిబాన్ తిరిగి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆఫ్గన్ సరిహద్దులో జరిగిన తీవ్రమైన ఘర్షణలలో ఇది ఒకటి అని విశ్లేషకులు భావిస్తున్నారు.
వైమానిక దాడులను ఖండించిన పాకిస్తాన్
వైమానిక దాడులకు పాకిస్తాన్ ఎలాంటి బాధ్యత వహించలేదు. అయితే ఆఫ్ఘన్ భూభాగాన్ని ఉపయోగించకుండా పాకిస్తాన్ తాలిబాన్ (టిటిపి) ను నిరోధించాలని కాబూల్ ను కోరింది. ఆఫ్ఘన్ తాలిబాన్ తో సైద్ధాంతిక సంబంధాలున్న టిటిపి, 2021 నుంచి వందల మంది పాకిస్తాన్ సైనికులను హత్య చేసినట్లు ఆరోపించింది.
"ఈ సాయంత్రం, తాలిబాన్ దళాలు ఆయుధాలను ఉపయోగించడం ప్రారంభించాయి. మేం మొదట సరిహద్దు వెంబడి మొదట తేలికపాటి, తరువాత నాలుగు పాయింట్ల వద్ద భారీ ఫిరంగి దాడులు చేశాము" అని పాకిస్తాన్ లోని ఖైబర్ కనుమ ప్రావిన్స్ లోని ఒక సీనియర్ అధికారి AFPకి తెలిపారు. "పాకిస్తాన్ దళాలు భారీ కాల్పులతో స్పందించాయి. పేలుడు పదార్థాలను మోసుకెళ్తున్న మూడు అనుమానిత ఆఫ్ఘన్ క్వాడ్రాప్టర్లను కూల్చివేశాయి. తీవ్రమైన పోరాటం కొనసాగుతోందని పేర్కొన్నారు.
ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి రెండు వైపులా సంయమనం పాటించాలని పిలుపునిచ్చారు. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మధ్య ఘర్షణలు లేకుంటే విస్తృత ప్రాంతీయ స్థిరత్వానికి దోహదపడుతుందని పేర్కొన్నారు. ఖతార్ ఈ భావనను స్పష్టం చేసింది. ఉద్రిక్తతను నివారించడానికి చర్చలు, దౌత్యానికి పిలుపునిచ్చింది. సౌదీ అరేబియా సైతం సంయమనం పాటించాలని సూచించింది.






















