Srilanka : మరో సోమాలియాలా శ్రీలంక ! ఆ దేశ పరిస్థితికి ఇవే కారణాలు
శ్రీలంక పరిస్థితి మరో సోమాలియాలా మారుతోంది. అక్కడ రూపాయిలకు విలువ ఉండటం లేదు. రేట్లు చుక్కలను తాకుతున్నాయి. దీనికి ప్రధానంగా ఐదు కారణాలుచెప్పుకోవచ్చు..
శ్రీలంకలో గుడ్డు రేటు గుడ్లు తేలేసేలా ఉన్నాయి. పెట్రోల్ రేటు ఎవరూ కొనలేనంతకు వెళ్లిపోయింది. పేపర్లు కొనే స్థోమత లేక పరీక్షలనే రద్దు చేసిందా ప్రభుత్వం. శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం తీవ్రస్థాయికి చేరిందనడానికి ఇదే నిదర్శనం. 1948 తర్వాత దారుణమైన ఆర్థిక సంక్షోభాన్ని శ్రీలంక ఎదుర్కొంటోంది. ఈ పరిస్థితికి కారణాలేమిటి ?
కరోనా దెబ్బకు పడిపోయిన ఆదాయం !
శ్రీలంకకు ప్రధానంగా పర్యాటకం, ఎగుమతుల ద్వారానే ఆదాయం వస్తుంది.కోవిడ్ కారణంగా పర్యాటక రంగం పూర్తిగా కుదేలైపోయింది. 2019లో పర్యాటకం ద్వారా శ్రీలంక 4 బిలియన్ల డాలర్ల ఆదాయం ఆర్జించింది. ఇప్పుడు అందులో పది శాతం కూడా రావడం లేదు. ఇలా వచ్చే ఆదాయం మొత్తం విదేశీ మారకద్రవ్యమే.
దిగుమతుల మీదే ఆధారపడటం !
శ్రీలంక అత్యధికగా దిగుమతుల మీదే ఆధారపడుతుంది. తక్కువ ఆదాయం, అధిక దిగుమతి బిల్లుల కారణంగా పర్యాటక ఆధారిత శ్రీలంక విదేశీ మారకద్రవ్యం భారీ పతనాన్ని ఎదుర్కొంటోంది. దిగుమతుల కోసం చెల్లించడానికి దేశానికి ఈ సంవత్సరం 22 బిలియన్ డాలర్లు అవసరం. అయితే దాని ఆదాయం మాత్రం 12 బిలియన్ డాలర్లుగా అంచనా వేశారు. 10 బిలియన్ డాలర్ల లోటులో శ్రీలంక కోట్టుమిట్టాడుతోంది.
ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు !
పెరుగుతున్న ధరలపై ప్రజాగ్రహాన్ని తగ్గించేందుకు శ్రీలంక ప్రభుత్వం ఇటీవలే వన్ బిలియన్ డాలర్ల ప్యాకేజీ ప్రకటించింది. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు పెంచింది. పేదలకు కొంత ఆర్థిక చేయూత అందించడంతో పాటు కొన్ని ఆహార వస్తువులు, ఔషధాల ధరలపై పన్నులు తొలగించింది. కానీ వాటిని డబ్బులు ముద్రించి పంపిణీ చేసింది. ఫలితంగా ద్రవ్యోల్బణం పెరిగిపోయింది. లంక రూపాయి విలువ డాలర్‌తో పోల్చితే రూ. 275కు పడిపోయింది. దీంతో లంకేయులు తీవ్ర ఇబ‍్బందులు ఎదుర్కొంటున్నారు. నిత్యావసరాల కోసం కూడా ప్రజలు క్యూలు కట్టే పరిస్థితి నెలకొంది. పాలపొడి నుంచి లీటర్ పెట్రోల్ వరకు పెరిగిన రేట్లు జనాలకు చుక్కలు చూపిస్తున్నాయి. పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు బారులు తీరుతున్నారు. అక్కడ లీటర్ పెట్రోల్ ధర 283 రూపాయలకు చేరుకోగా, డీజిల్ ధర రూ. 220కి చేరుకుంది.
చైనా గుప్పిట చిక్కి రుణాల సంక్షోభం !
శ్రీలంక ప్రభుత్వం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. ప్రభుత్వాలు ముందు వెనుక ఆలోచించకుండా ప్రభుత్వ బాండ్లను విడుదల చేసి విశేషంగా అప్పులు చేయడం వల్ల రుణ భారం పెరిగిపోయింది. 2019 నాటికే ఈ అప్పు స్థూల దేశీయోత్పత్తి (జిడిపి)లో 42.9 శాతానికి చేరుకున్నది. 2021 నాటికి విదేశీ రుణం దాని జిడిపికి 101 శాతానికి చేరుకున్నది. అంటే దేశంలో ఉత్పత్తి అవుతున్న సంపద విలువకు మించిపోయింది. ఈ విధంగా వచ్చిందంతా అప్పులు తీర్చడానికే సరిపోతుంటే ప్రజల అవసరాలకు ఇంకేమి మిగులుతుంది? ఈ కారణంగా కొత్త రుణాలు అందడం లేదు. దక్షిణాసియా దేశాల ప్రధాన రుణదాతలలో ఒకరైన చైనాను రుణ చెల్లింపుల కోసం సహాయం చేయాలని శ్రీలంక ప్రభుత్వం అభ్యర్థించింది. అయితే, బీజింగ్ ఇంకా స్పందించలేదు. శ్రీలంక తన దిగజారుతున్న విదేశీ రుణ సంక్షోభాన్ని పరిష్కరించడానికి, బాహ్య నిల్వలను పెంచుకోవడానికి అంతర్జాతీయ ద్రవ్య నిధి బెయిలౌట్‌ను ప్యాకేజీ కోరుతోంది. ఈ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. శ్రీలంక విదేశీ రుణంలో 47 శాతం అంతర్జాతీయ స్టాక్ మార్కెట్ల నుంచి తీసుకున్నది కాగా, 22 శాతం వరల్డ్ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) వంటి బహుళ జాతి పరపతి సంస్థల నుంచి తీసుకున్నదని తెలుస్తున్నది. 10 శాతం విదేశీ రుణం ఒక్క చైనా నుంచి తీసుకున్నదే.