Russia Ukraine War: కాన్వాయ్‌పై రష్యా దళాల బుల్లెట్ల వర్షం- చిన్నారి సహా ఏడుగురు మృతి
Russia Ukraine War: ఉక్రెయిన్‌లో ప్రజలను తరలిస్తోన్న ఓ కాన్వాయ్‌పై రష్యా దళాలు దాడి చేశాయి. ఈ దాడిలో ఏడుగురు మృతి చెందినట్లు ఉక్రెయిన్ తెలిపింది.
Russia Ukraine War:
ఉక్రెయిన్‌పై రష్యా దాడులు ఉద్ధృతం చేసింది. కీవ్ ప్రాంతంలోని పెరెమొగా గ్రామలో ఓ కాన్వాయ్‌పై రష్యా దళాలు కాల్పులు జరిపినట్లు ఉక్రెయిన్ ప్రకటించింది. మహిళలు, పిల్లలు ఉన్న ఈ కాన్వాయ్‌పై జరిగిన దాడిలో ఏడుగురు మృతి చెందినట్లు తెలిపింది. ఈ మేరకు ఉక్రెయిన్ సైనిక నిఘా విభాగం వెల్లడించింది. మృతుల్లో ఓ చిన్నారి కూడా ఉంది.
పౌరుల తరలింపు కోసం ఏర్పాటు చేసిన గ్రీన్ కారిడార్‌లోనే కాన్వాయ్ వెళ్లిందని.. అయినప్పటికీ నిబంధనలు అతిక్రమించి రష్యా దళాలు కాల్పులు జరిపినట్లు ఉక్రెయిన్ ఆరోపించింది. అయితే అధికారులకు చెప్పకుండా ఆ కాన్వాయ్ వెళ్లడం వల్లే కాల్పులు జరిగినట్లు తర్వాత పేర్కొంది.
శుక్రవారం ఈ ఘటన జరిగినట్లు ఉక్రెయిన్ తెలిపింది. ఉక్రెయిన్ భాషలో పెరెమొగా అంటే 'విజయం' అని అర్థం. కీవ్‌కు 22 మైళ్ల ఈశాన్యాన ఈ గ్రామం ఉంది. ఈ కాల్పులు జరిపిన తర్వాత గ్రామస్థులను తిరిగి ఇంటికి వెళ్లిపోవాలని రష్యా బలగాలు బెదిరించినట్లు ఉక్రెయిన్ పేర్కొంది.
వెనక్కి తగ్గని రష్యా
రష్యాపై ప్రపంచ దేశాలు కట్టుదిట్టమైన ఆంక్షలు విధిస్తున్నా పుతిన్ మాత్రం వెనక్కి తగ్గట్లేదు. రష్యా సేనలు బాంబు దాడులతో ఉక్రెయిన్‌లో భయాందోళనలు సృష్టిస్తున్నాయి. మెలిటొపోల్‌ను స్వాధీనం చేసుకున్న రష్యా సైన్యం ఆ నగర మేయర్‌ను అపహరించుకుపోయినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆరోపించారు. శత్రు సైనికులకు సహకరించట్లేదనే ఉక్రోషంతో ఇలా చేసినట్లు తెలిపారు.
మరో హెచ్చరిక
ఉక్రెయిన్‌కు ఆయుధాలు సరఫరా చేసేందుకు ముందుకు వస్తున్న దేశాలకు రష్యా శనివారం ఓ హెచ్చరిక జారీ చేసింది. పశ్చిమ దేశాలు అక్కడకు ఆయుధాలు పంపిస్తే ఆ వాహన శ్రేణులు తమకు లక్ష్యాలుగా మారుతాయని రష్యా విదేశాంగ శాఖ సహాయ మంత్రి సెర్గే ర్యాబ్‌కోవ్ శనివారం ప్రకటించారు. ఉక్రెయిన్‌కు ఆయుధాలు సరఫరా చేయడం ప్రమాదకరమైన చర్య అని అమెరికా సహా అనేక దేశాలను ఇప్పటికే హెచ్చరించామని చెప్పారు.తమ హెచ్చరికల్ని అమెరికా తీవ్రంగా పరిగణించలేదన్నారు.