AAP Roadshow Amritsar: ఆప్ విజయోత్సవ ర్యాలీ- పంజాబ్‌లో చారిత్రక నిర్ణయాలు ఖాయమట!
AAP Roadshow Amritsar: పంజాబ్‌కు కాబోయే సీఎం భగవంత్ మాన్, ఆమ్ఆద్మీ అధినేత అరవింద్ కేజ్రీవాల్.. ఈరోజు అమృత్‌సర్‌లో విజయోత్సవ ర్యాలీ నిర్వహించనున్నారు.
AAP Roadshow Amritsar: పంజాబ్‌లో ఆమ్‌ఆద్మీ సాధించి అఖండ విజయాన్ని గుర్తుచేస్తూ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్, కాబోయే సీఎం భగవంత్ మాన్ ఇద్దరూ అమృత్‌సర్‌లో భారీ రోడ్ షో నిర్వహించనున్నారు. ప్రజలు ఇచ్చిన భారీ విజయానికి వారికి కృతజ్ఞతలు తెలపనున్నారు.
ప్రమాణ స్వీకారం
పంజాబ్ ముఖ్యమంత్రిగా భగవంత్ సింగ్ మాన్ ఈనెల 16న ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇదివరకే ప్రకటించినట్టు స్వాతంత్ర్య సమర యోధుడు భగత్‌సింగ్ పూర్వీకుల గ్రామమైన ఖట్కర్కలన్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు పంజాబ్ గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్‌ను శనివారం కలిసి భగవంత్ మాన్ తెలిపారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు మద్దతు తెలుపుతూ ఇచ్చిన లేఖను గవర్నర్‌కు సమర్పించినట్లు భగవంత్ మాన్ అన్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ అంగీకరించారన్నారు.
అందరికీ ఆహ్వానం
48 ఏళ్ల భగవంత్ మాన్‌ను ఆప్ శాసనసభాపక్షా నేతగా పార్టీ ఎమ్మెల్యేలు శుక్రవారం ఎన్నుకున్నారు. మార్చి 16న మధ్యాహ్నం 12.30 నిమిషాలకు ప్రమాణస్వీకారం జరగనుంది.
భారీ గెలుపు
పంజాబ్‌లో 117 అసెంబ్లీ స్థానాల్లో 92 సీట్లను ఆప్ దక్కించుకుంది. ధురీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన మాన్ 58,206 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. మరోసారి అధికారం దక్కించుకుంటామని ధీమాగా ఉన్న కాంగ్రెస్‌కు ఆప్ భారీ షాక్ ఇచ్చింది. చరణ్‌జిత్ సింగ్ చన్నీ, నవజోత్ సింగ్ సిద్ధూ సహా అగ్రనాయకులు అందరూ ఆప్ దెబ్బకు ఇంటిముఖం పట్టారు.
అంతేకాకుండా శిరోమణి అకాలీ దళ్ వ్యవస్థాపకుడు ప్రకాశ్ సింగ్ బాదల్, ఆయన కుమారుడు సుఖ్‌బీర్ సింగ్ బాదల్ కూడా ఓటమిపాలయ్యారు. మరోవైపు మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ కూడా పరాజయం పొందారు.