Russia Ukraine War: రంగంలోకి కొత్త ఆర్మీ జనరల్- ఆ రోజు లోపు యుద్ధం ఫినిష్ చేయాలని పుతిన్ ఆదేశం!
ఉక్రెయిన్‌పై రష్యా ఆ రోజు లోపు యుద్ధం ముగించాలని పుతిన్ టార్గెట్ పెట్టుకున్నారట. ఇందుకోసం కొత్త ఆర్మీ జనరల్‌ను నియమించారు.
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం మొదలై 40 రోజులు దాటింది. కానీ ఇప్పటివరకు ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ను రష్యా హస్తగతం చేసుకోలేకపోయింది. దీంతో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇందుకోసమే ఆయన ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ యుద్ధానికి నాయకత్వాన్ని మార్చారు. రష్యా సదరన్ మిలిటరీ డిస్ట్రిక్ట్ కమాండర్ అలెగ్జాండర్ ద్వోర్నికోవ్‌ను నూతన ఆర్మీ జనరల్‌గా నియమించారు.
టార్గెట్
రెండో ప్రపంచ యుద్ధంలో జర్మనీపై సోవియెట్ యూనియన్ విజయానికి గుర్తుగా ప్రతి సంవత్సరం మే 9న విజయోత్సవాలను నిర్వహిస్తారు. రష్యాలో దీనికి చాలా ప్రాధాన్యం ఉంది. ఆ రోజుకు ముందే ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం గెలవాలని పుతిన్ యోచిస్తున్నారు. ఇందుకోసమే ఉక్రెయిన్‌లో రష్యా మిలిటరీ కాంపెయిన్ థియేటర్ కమాండర్‌గా అలెగ్జాండర్ ద్వోర్నికోవ్‌ను పుతిన్ నియమించినట్లు తెలుస్తోంది
ఈ విధంగా గడువును పొడిగించడం వల్ల రష్యా దళాలు తప్పులు చేసే అవకాశం ఉందని, అదే సమయంలో మరిన్ని దురాగతాలకు పాల్పడే అవకాశం ఉందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
ఉక్రెయిన్ జవాబు
బలమైన రష్యా సైన్యాన్ని ఉక్రెయిన్ కూడా అంతే దీటుగా ఎదుర్కొంటోంది. డజనుకు పైగా ఉన్న మిత్రదేశాలు, అమెరికా కూడా ఉక్రెయిన్‌కు పరోక్షంగా సాయమందిస్తున్నాయి. అన్నింటిని మించి ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లొదిమిర్ జెలెన్‌స్కీ మాటలు ఆ దేశ సైన్యాన్ని అలుపెరగకుండా పోరేడేలా చేస్తున్నాయి.
అమెరికా పాత్ర
ఈ యుద్ధంలో అమెరికా పాత్ర కూడా ఎక్కువే ఉంది. ముఖ్యంగా అమెరికా ఎన్నడూ చూడని విదేశాంగ విధానాలు ఇప్పడు అవలంబించాల్సి వచ్చింది. ఇప్పటివరకు చైనానే శత్రువుగా చూసిన అమెరికా.. ఈ యుద్ధం వల్ల రష్యాపై ఫోకస్ పెట్టాల్సి వచ్చింది. అమెరికా మిత్ర దేశాలు.. రష్యాపై వీలైనన్నీ ఆర్థిక ఆంక్షలు విధించాలని బైడెన్ కోరారు. అయితే అణ్వాయుధాలు కలిగిన రష్యాతో నేరుగా యుద్ధం చేయడం ప్రపంచానికి ప్రమాదకరమని అమెరికా భావిస్తోంది.
రష్యాకు ఎదురుదెబ్బ
2014లో క్రిమియాను ఆక్రమించిన సమయంలో రష్యా సైన్యం చాలా వేగంగా పని పూర్తి చేసింది. అయితే ఇప్పుడు ఉక్రెయిన్ విషయంలోనూ ఇదే ప్లాన్ అమలు చేయాలని పుతిన్ భావించారు. వీలైనంత త్వరగా ఉక్రెయిన్ నగరాలను ఆక్రమించుకుని ప్రభుత్వాన్ని కూల్చేసి తమకు నచ్చిన వారితో తోలుబొమ్మ సర్కార్ ఏర్పాటు చేయించాలని పుతిన్ ప్రణాళిక రచించారు.
కానీ యుద్ధం మొదలైన ఐదో రోజుకే ఇది అంత సులభం కాదని పుతిన్‌కు అర్థమైంది. అందుకే రష్యా లాంటి బలమైన సైన్యానికి కూడా ఉక్రెయిన్ ఇంకా చేజిక్కలేదు. దీంతో పుతిన్ ప్లాన్- బీ అమలుకు సిద్ధమయ్యారు. ఉక్రెయిన్ సైనిక స్థావరాలు, పాఠశాలలు, ఆసుపత్రులు, నివాసాలు ఇలా వీటిపై బాంబుల వర్షం కురిపిస్తున్నారు.
Also Read: Covid 19 Precaution Dose: ప్రికాషన్ డోసు షురూ- ఎలా బుక్ చేసుకోవాలి? ధర తెలుసుకోండి