Russia Ukraine War: ఉక్రెయిన్‌లో రష్యా బాంబుల మోత- చిన్నారులు సహా 18 మంది మృతి!
Russia Ukraine War: ఉక్రెయిన్‌లోని సుమీ నగరంలో రష్యా బాంబుల మోత మోగించింది. ఈ దాడిలో 18 మంది పౌరులు మరణించినట్లు ఉక్రెయిన్ తెలిపింది.
Russia Ukraine War: ఉక్రెయిన్ నగరాలపై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. అయితే సుమీ నగరంలోని నివాస భవనాలపై రష్యా దళాలు 500 కేజీల బాంబులు కురిపించాయని ఉక్రెయిన్ తెలిపింది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు సహా 18 మంది పౌరులు మరణించారని పేర్కొంది. ఈ మేరకు ఆ దేశ సాంస్కృతిక, ప్రసారశాఖ మంత్రి ట్వీట్ చేశారు.
సుమీలో
సుమీ నగరంలో రష్యా వాయు సేనలు చేసిన లక్షిత దాడులు చేసింది. మృతుల్లో చిన్నారులు సైతం ఉన్నారని సుమీ ప్రాంతీయ పరిపాలనాధికారి దిమిత్రీ జివిట్స్కీ వెల్లడించారు. నివాస ప్రాంతాలపైనా దాడులు చేస్తోందని ఫేస్బుక్లో పోస్ట్ చేసిన వీడియోలో పేర్కొన్నారు.
చెర్నిహివ్‌లోనూ ఇలాంటి ఘటనే జరిగింది. అయితే, అది పేలకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. రష్యా జారవిడిచిన బాంబు ఫొటోను ఉక్రెయిన్ విదేశాంగ వ్యవహారాల మంత్రి దిమిత్రో కులేబా షేర్ చేశారు. ఇది చాలా భయంకరమైన ఘటన అని, 500 కేజీల బాంబును రష్యా నివాస భవనాలపై వేసిందని, అయితే అది పేలలేదని అన్నారు.
అమాయకులను మహిళలను, పురుషులు, చిన్నారులను చంపేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రష్యా అనాగరిక చర్యల నుంచి తమను ప్రజలను రక్షించేందుకు సాయం చేయాలని వేడుకున్నారు. తమ గగనతలాన్ని మూసివేయడంలో సాయం చేయాలని, రష్యాపై యుద్ధం కోసం విమానాలు అందించాలని, ఏదో ఒకటి చేయాలని వేడుకున్నారు.
కాల్పుల విరమణ
కాగా, పౌరుల తరలింపు కోసం కాల్పుల విరమణ ప్రకటించింది రష్యా. 5 నగరాల్లో కాల్పుల విరమణ ప్రకటించినట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌లో ఉన్న విదేశీయులు సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్నారు. సుమీ నగరం నుంచి వ్యక్తిగత వాహనాల్లో స్థానికులను తరలిస్తున్నట్లు ఉక్రెయిన్ ఉపప్రధాని ఇరీనా వెరెస్‌చుక్ వెల్లడించారు. ఇర్ఫిన్ నగరంలో చిన్నపిల్లలు, పెంపుడు జంతువులను తీసుకుని స్థానికులు ఇతర ప్రాంతాలకు తరలివెళ్తున్నారు.