Iran Israel War: ఇజ్రాయెల్ దాడిలో ఇరాన్ అణు కేంద్రం లోపల విషవాయువులు లీక్: UN ఏజెన్సీ వార్నింగ్
ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ మెయిన్ న్యూక్లియర్ సెంటర్‌లో రేడియోధార్మికత, విష వాయువులు లీకయ్యే అవకాశం ఉందని యూఎన్ టాప్ ఏజెన్సీ హెచ్చరించింది.

Israel Iran Conflict | ఇటీవల ఇజ్రాయెల్ చేసిన దాడుల (జూన్ 13, 2025) తర్వాత ఇరాన్‌లోని ప్రధాన అణు కేంద్రం నాటాంజ్ లోపల రేడియోలాజికల్, ఇతర రసాయన కాలుష్యం జరిగే అవకాశం ఉంది. ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితి అణు విభాగం అధిపతి సోమవారం హెచ్చరించారు. ప్రస్తుతం నాటాంజ్ కాంప్లెక్స్ బయట రేడియేషన్ సాధారణంగానే ఉందని స్పష్టం చేశారు. అక్కడ విడుదలయ్యే యురేనియం పీల్చినా, రేడియేషన్ విడుదలైన ప్రమాదమేనని అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ డైరెక్టర్ జనరల్ రాఫెల్ మరియానోగ్రాస్సీ స్పష్టం చేశారు.
వాతావరణ కాలుష్యం, ప్రాణ నష్టం సంభవించే అవకాశం
ఇరాన్‌లోని నాటాంజ్ అణు కేంద్రం బయట రేడియోధార్మికత స్థాయిలో మార్పులేదు. ప్రస్తుతానికి ప్రజలతో పాటు పర్యావరణంపై ఎలాంటి ప్రభావం లేదన్నారు. ఇరాన్ అణు సౌకర్యాలపై ఇజ్రాయెల్ దాడులపై రష్యా అభ్యర్థన మేరకు వియన్నాలో జరిగిన IAEA బోర్డు సమావేశంలో గ్రాస్సీ ప్రస్తావించారు. నాటాంజ్, ఇస్ఫహాన్ అణు పరిశోధనా కేంద్రాల నుంచి ఎలాంటి ప్రతికూల ఫలితాలు కనిపించలేదన్నారు. కానీ నాటాంజ్ లోపల ఉన్న యురేనియం హెక్సాఫ్లోరైడ్ అనే వాయువు విషపూరితం అన్నారు. ఇది శుద్ధి సమయంలో యురేనియంతో కలిపిన ఫ్లోరిన్ గా మారుతుంది. ఒకవైళ ఇది లీక్ అయితే చర్మాన్ని కాల్చేస్తుంది, ఎవరైనా దీన్ని పీల్చితే ప్రాణాంతకం అని తెలిపారు. దీనిపై ఇరాన్ అప్రమత్తంగా ఉండాలని, సరైన సమాచారం లేకుండా యూఎన్ ఎజెన్సీలు సైతం అవసరమైన సహాయం చేయలేవు. అనుమతి దొరికిన వెంటనే అణు సౌకర్యాలను తనిఖీ చేయాలని గ్రోస్సీ చెప్పారు.
నటాంజ్ అణు కేంద్రానికి నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్, రష్యా వంటి దేశాల తరపున వెనిజులా ప్రత్యేక బోర్డు సమావేశంలో సంయుక్త ప్రకటన చేసింది. ఇరాన్ అణు కేంద్రాలపై ఇజ్రాయెల్ దాడిని ఖండిస్తూ కొందరు దౌత్యవేత్తలు సమావేశమై చర్చించారు. అసోసియేటెడ్ ప్రెస్ విశ్లేషించిన శాటిలైట్ ఫోటోలు నటాంజ్‌లోని ఇరాన్ ప్రధాన అణు కేంద్రం వద్ద భారీ నష్టాన్ని చూపిస్తున్నాయి. ప్లానెట్ ల్యాబ్స్ పిబిసి ఫొటోలలో భవనాలు దెబ్బతిన్నట్లు కనిపిస్తున్నాయి. ఈ కేంద్రానికి విద్యుత్ సరఫరా నిలిచిపోయినట్లు తెలుస్తోంది. నటాంజ్ కేంద్రం వద్ద భూగర్భంలో ఉన్న ప్రధాన సెంట్రిఫ్యూజ్ సౌకర్యం దెబ్బతినలేదు.
ప్రస్తుతానికి తప్పిన ముప్పు
ఇజ్రాయెల్ ఇస్ఫహాన్‌లోని అణు పరిశోధన కేంద్రంపై సైతం దాడి జరిగింది. యురేనియం మార్పిడి కేంద్రంతో సహా కొన్ని భవనాలు దెబ్బతిన్నాయని IAEA తెలిపింది. IAEA గవర్నర్ల బోర్డులో సోమవారం గ్రాస్సీ మాట్లాడుతూ.. ప్రస్తుతానికి ఆ అణుకేంద్రాల నుంచి ఎలాంటి రేడియేషన్, ప్రమాదకర రసాయనాలు బయటకు లీక్ కాలేదు. వైమానిక దాడులను తట్టుకునేలా ఫోర్డోను రూపొందించారు.
ఇరాన్ లోని ఏకైక వాణిజ్య అణు విద్యుత్ కేంద్రం అయిన బుషెహర్ పై ఎలాంటి దాడులు జరగలేదు. టెహ్రాన్ రీసెర్చ్ రియాక్టర్ సైతం ప్రభావితం కాలేదని గ్రాస్సీ తెలిపారు. IAEA 35 మంది సభ్యుల బోర్డులోని ఏ దేశమైనా రూల్స్ ప్రకారం సమావేశాన్ని ఏర్పాటు చేయవచ్చు. 20 సంవత్సరాలలో మొదటిసారిగా ఇరాన్ గత వారం తన అణు బాధ్యతలను ఉల్లంఘించిందని IAEA బోర్డు గుర్తించింది.






















