Solar Storm : దూసుకొస్తున్న సౌర తుఫాను-నేడు భూమిని తాకే అవకాశం, నాసా హెచ్చరిక
సూర్యుని ఉపరితలంపై ఏర్పడిన రంధ్రం భూమి కంటే 20 రెట్లు పెద్దగా ఉందని నాసా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. దీని ప్రభావంతో దూసుసువస్తున్న సౌర తుఫాను శుక్రవారం భూమిని తాకవచ్చని భావిస్తున్నారు.
Solar Storm : సూర్యుని ఉపరితలంపై రంధ్రం ఏర్పడినట్లు నాసా శాస్త్రవేత్తలు గుర్తించారు. సూర్యునిపై ఏర్పడిన భారీ నల్లటి ప్రాంతం మన భూమి కంటే 20 రెట్లు పెద్దగా ఉందని పేర్కొన్నారు. దీనిని "కరోనల్ హోల్" అని పిలుస్తారు. ఈ నల్లని ప్రాంతం ( రంధ్రం) కారణంగా సూర్యునిలో కొంత భాగం అదృశ్యమైనట్లు కనిపిస్తుంది. దీని ప్రభావంతో భూమి వైపు 2.9 మిలియన్ కిలోమీటర్ల వేగంతో సౌర తుఫాను దూసుకువస్తోందని.. ఇది శుక్రవారం భూమిని తాకవచ్చని నాసా శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఫలితంగా భూమిపై వేడి విపరీతంగా పెరగడంతో పాటు వేడి గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు.
సూర్యుడు ఉగ్రరూపం దాల్చాడు. గత మూడు నెలల్లోనే ఏడుసార్లు భారీ స్థాయిలో నిప్పులుచిమ్మాడు. సూర్యుడిపై బుధవారం ఏర్పడిన భారీ సౌర తుఫాన్ కారణంగా ప్లాస్మా, రేడియేషన్‌తో కూడిన సౌర గాలులు భూమి వైపు వేగంగా దూసుకొస్తున్నాయని, ఇవి శుక్రవారం భూమిని తాకే అవకాశం ఉందని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ప్రకటించింది. సోమవారం సూర్యుడి దక్షిణ ధ్రువంపై జరిగిన భారీ పేలుడు (సోలార్ ఫ్లేర్)తో పెద్ద ఎత్తున ప్లాస్మా, రేడియేషన్ అంతరిక్షంలోకి ఎగజిమ్మాయని నాసా వెల్లడించింది. ఈ సోలార్ ఫ్లేర్ వల్ల విడుదలైన ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ ఎనర్జీ భూ వాతావరణంలోని అయనోస్పియర్‌ను తాకడంతో ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, ఆగ్నేయాసియా ప్రాంతాల్లో 30 మెగాహెర్జ్ కంటే తక్కువ ఫ్రీక్వెన్సీతో ఉన్న రేడియో సిగ్నల్స్‌కు ఆటంకం కలిగిందని తెలిపింది.
అతి తీవ్రమైన ఎక్స్1.2 రకానికి చెందిన ఈ పేలుడును అమెరికా అంతరిక్ష సంస్థ నాసాకు చెందిన సోలార్ డైనమిక్స్ అబ్జర్వేటరీ తన కెమెరాలో బంధించింది. సూర్యుడిపై జరిగే ఈ పేలుళ్ల వల్ల విడుదలయ్యే రేడియేషన్ తాకితే భూమిపై రేడియో కమ్యూనికేషన్లు, ఎలక్ట్రిక్ పవర్ గ్రిడ్లపై ప్రభావం పడుతుందని, వీటి తీవ్రత ఎక్కువగా ఉంటే శాటిలైట్లకు, అంతరిక్షంలో ఉన్న ఆస్ట్రోనాట్ లకు సైతం ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంటుందని నాసా వెల్లడించింది.
గంటకు 29 లక్షల కి.మీ. వేగంతో
సూర్యుడి దక్షిణ భాగంలో భారీ పేలుడు సంభవించడంతో ఆ ప్రాంతమంతా రంధ్రం పడినట్లు (కరోనల్ హోల్/సన్ స్పాట్)గా ఒక నల్లని మచ్చలా మారిందని బుధవారం నాసా వెల్లడించింది. అక్కడ విస్ఫోటం తర్వాత ప్లాస్మా చల్లబడి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బలహీనం కావడంతోనే అది సూర్యుడికి నల్లటి మచ్చలా మారినట్లు తెలిపింది. ఈ సన్ స్పాట్ ఏకంగా మన భూమి కంటే 20 రెట్ల పరిమాణంలో.. దాదాపుగా 3 లక్షల నుంచి 4 లక్షల కిలోమీటర్ల పరిమాణంలో ఉన్నట్లు వెల్లడించింది.
ఈ పేలుడు ధాటికి14 భూములను ఒక దానిపై ఒకటి పెడితే ఎంత ఎత్తు ఉంటాయో.. అంత దూరం వరకూ సూర్యుడి నుంచి ప్లాస్మా ఎగజిమ్మిందని వివరించింది. దీంతో జియోమ్యాగ్నెటిక్ స్టార్మ్ ఏర్పడిందని, గంటకు 29 లక్షల కిలోమీటర్ల వేగంతో సౌర గాలులు భూమివైపు దూసుకొస్తున్నాయని తెలిపింది. ఈ సౌర గాలులు శుక్రవారం భూమిని తాకే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.
సూర్యుడిలోని మ్యాగ్నెటిక్ ఫీల్డ్‌కు ఉండే నార్త్, సౌత్ పోల్స్ ప్రతి 11 ఏళ్లకు ఒకసారి స్థానాలు మార్చుకుంటాయి. ఇలా సూర్యుడిపై మ్యాగ్నెటిక్ యాక్టివిటీకి సంబంధించి ప్రతి11 ఏళ్లకు ఒక సైకిల్ పూర్తవుతుంది. ప్రస్తుతం సూర్యుడి సోలార్ సైకిల్ పీక్ స్టేజీకి చేరిందని, అందుకే భారీ ఎత్తున పేలుళ్లు జరుగుతున్నాయని నాసా వెల్లడించింది. సూర్యుడిపై పోయిన ఏడాది 7 పేలుళ్లు మాత్రమే సంభవించగా.. ఈ ఏడాది మూడు నెలల్లోనే ఏడు పేలుళ్లు జరిగాయని పేర్కొంది.
ఇటీవల భారీ సన్ స్పాట్ కు ముందు సూర్యుడిపై నాలుగు సోలార్ ఫ్లేర్స్ సంభవించాయని, 22 సార్లు చిన్న పేలుళ్లు జరిగి ప్లాస్మా అంతరిక్షంలోకి ఎగజిమ్మిందని నాసా పేర్కొంది. మళ్లీ కొత్త సోలార్ సైకిల్ మొదలయ్యే సమయానికి సూర్యుడిపై పేలుళ్లు తగ్గిపోతాయని వివరించింది.