Modi Tour: పోలాండ్ నుంచి ఉక్రెయిన్‌కు మోడీ-యుద్ధంతో సమస్య తీరదన్న భారత ప్రధాని
Ukraine Tour: యుద్ధంతో సమస్యకు పరిష్కారం దొరకదన్నారు భారత ప్రధాని మోడీ. పోలెండ్‌లో రెండు రోజులు పర్యటించిన ఆయన... శాంతి స్థాపనకు ఇండియా కట్టుబడి ఉందని చెప్పారు.
PM Modi Tour In Poland, Ukraine: భారత ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) 45 ఏళ్ల తర్వాత పోలండ్(Poland)లో పర్యటించారు. రెండు రోజుల పాటు అక్కడే ఉన్నారు. అక్కడి నుంచి విలాసవంతమైన ట్రైన్‌లో నిన్న సాయంత్రం ఉక్రెయిన్(Ukraine) బయల్దేరారు. పోలండ్ పర్యటనలో కీలక వ్యాఖ్యలు చేశారు మోడీ. యుద్ధ భూమిలో ఏ సమస్యకు పరిష్కారం దొరకదని చెప్పారు. ఈ విషయాన్ని భారత్ బలంగా నమ్ముతుందని తెలిపారాయన. ఉక్రెయిన్‌తోపాటు పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంక్షోభాలు ప్రపంచానికి మంచివి కావన్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై ఆందోళన వ్యక్తం చేశారు మోడీ. ఆ ప్రాంతంలో శాంతి, సుస్థిరత పునరుద్దరణను నెలకొల్పేందుకు అవసరమైన మద్దతు ఇస్తామన్నారు.
పోలండ్ రాజధాని వార్సా(Warsaw)లో ఆ దేశ ప్రధాని డొలాన్డ్ టస్క్(Donald Tusk)తో సమావేశయ్యారు నరేంద్ర మోడీ. రెండు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యంతోపాటు రాజకీయ, ఆర్థిక, సామాజిక అంశాలపై చర్చించారు. సమావేశం తర్వాత... ఇద్ద దేశాల ప్రధానులు కలిసి మీడియా ప్రకటన విడుదల చేశారు. భారత్, పోలండ్‌లు అంతర్జాతీయ వేదికపై సమన్వయంతో ముందుకు సాగుతున్నాయని తెలిపారు. భారత్, పోలండ్ మధ్య బంధం బలోపేతానికి మరింతగా కృషి చేస్తామన్నారు మోడీ. పోలండ్‌తో సామాజిక భద్రతా ఒప్పందం కుదుర్చుకున్నట్టు ప్రకటించారు. దీని వల్ల శుద్ధ ఇంధనం, కొత్త టెక్నాలజీ రంగాల్లో బంధం బలోపేతం అవుతుందన్నారు.
యుద్ధంతో సమస్య పరిష్కారం కాదు...
ప్రతీ సమస్యకు యుద్ధం పరిష్కారం కాదన్నారు ప్రధాని మోడీ. ఉక్రెయిన్‌తోపాటు పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఘర్షణలు ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు. సంక్షోభాల కారణంగా అమాయ ప్రజలు ప్రాణాలు కల్పోతున్నారని విచారం వ్యక్తం చేశారు భారత ప్రధాని మోడీ. ఇది మానవాళికి పెను సవాల్ అని అన్నారాయన. యుద్ధంతో ఏ సమస్యను పరిష్కరించలేమని భారత్ గట్టిగా నమ్ముతుందన్నారు. సాధ్యమైనంత త్వరగా శాంతి, స్థిరత్వం రావాలని... అందుకు చర్చలు, దౌత్యానికే ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. ఇందుకోసం మిత్ర దేశాలతో కలిసి వీలైంత సాయం చేసేందుకు సిద్ధమని ప్రకటించారు మోడీ.
మోడీ ఉక్రెయిన్ పర్యటన
పోలండ్ నుంచి రైలులో ఉక్రెయిన్ వెళ్లారు ప్రధాని మోడీ. 10 గంటల పాటు ట్రైన్‌లో జర్నీ చేశారు. గురువారం (ఆగస్టు 22) సాయంత్రం ట్రైన్‌ఫోర్స్ అనే లగ్జరీ ట్రైన్‌లో ఉక్రెయిన్ బయల్దేరారు. యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌లో ఎయిర్‌పోర్టులకు భద్రత కరువైంది. రోడ్డు మార్గాలు కూడా దెబ్బతిన్నాయి. దీంతో.. మోడీ... ట్రైన్ 10గంటలు ప్రయాణించి కీవ్ చేరుకోనున్నారు. అత్యాధునిక టెక్రాలజీతో తయారు చేసిన ట్రైన్‌లో అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి. ఉక్రెయిన్ పర్యటనలో ఆ దేశ అధ్యక్షుడు జెలెన్‌స్కీ(Zelensky) తో భేటీ కానున్నారు ప్రధాని మోడీ.
45ఏళ్ల తర్వాత పొలండ్‌లో పర్యటించిన తొలి భారత ప్రధానిగా నరేంద్ర మోడీ రికార్డు సృష్టించారు. 1978లో మురార్జీ దేశాయ్ పోలండ్ వెళ్లారు. ఆ తర్వాత భారత ప్రధానిగా మోడీ పర్యటించారు. భారత విదేశీ విధానంలోనూ మార్పు వచ్చిందన్నారు నరేంద్ర మోడీ. అన్ని దేశాలకు దూరంగా ఉండాలనేలా భారత విదేశాంగ విధానం ఉండేదని.. అయితే ప్రస్తుతం పరిస్థితి మారిందన్నారు. భారత విదేశాంగ విధానంలో 180 డిగ్రీల మార్పు వచ్చిందన్నారు. అన్ని దేశాలతో సన్నిహిత సంబంధాలను కలిగి ఉండటమే భారత దేశ విధానమని చెప్పారు. భారత్‌ను విశ్వ బంధుగా ప్రపంచ దేశాలు గౌరవిస్తున్నాయన్నారు మోడీ. నేటి భారత్ ప్రతి ఒక్కరితో కనెక్ట్ కావాలని.. ప్రతి ఒక్కరికీ లాభం చేకూరాలని ఆలోచిస్తోందని చెప్పారు.