9/11 Remembrance Day 2024: అమెరికాలో జరిగిన 9/11 ఉగ్రదాడికి 23 ఏళ్లు- అయినా మానని గాయాలు
Patriot Day 2024 in USA: సెప్టెంబర్ 11. ఈ డేట్ గుర్తు చేస్తేనే అమెరికన్ల గుండెలు పగిలిపోతాయి. 2001లో జరిగిన దాడి చేదు జ్ఞాపకాలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి
Patriot Day And National Day of Service And Remembrance: సెప్టెంబర్ 11 అమెరికా చరిత్రలోనే మర్చిపోలేని రోజు. ఈ తేదీ వస్తేనే అమెరికన్లను తెలియని భయం వెంటాదుతుంది. సెకండ్ వరల్డ్ వార్ టైంలో జరిగిన పెంటగాన్ అటాక్‌ను మరిచిపోతున్న అమెరికన్లకు.. సరిగ్గా 60 ఏళ్ల తర్వాత 2001లో అల్‌ఖైదా ఉగ్రమూక జరిపిన భీకరదాడి పెనుభయోత్పాన్ని మిగిల్చిందనే చెప్పాలి. మతఛాందస నరహంతకుడుగా ముద్రపడ్డ ఉగ్రనాయకుడు ఒసామాబిన్ లాడెన్ కనుసన్నల్లో న్యూయార్క్ నడిబొడ్డున జరిగిన నరమేథానికి సరిగ్గా నేటితో 23 ఏళ్లు పూర్తయ్యాయి. అమెరికన్ల విమానాలనే మృత్యుపాశాలుగా మార్చి లాడెన్ సృష్టించిన మారణహోమంలో నాడు ౩ వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోగా.. ఆ దాడిలో గాయపడి చికిత్స పొందుతూ 2023 నాటికి మరో 5 వేల 700 మందికిపైగా మృత్యువాత పడ్డారు. నాటి ఘటనను కళ్లారా చూసిన వాళ్లు ఇప్పటికీ నిద్రలేని రాత్రులు గడుపుతుంటారు.
దాడి జరిగిందిలా:
ఉగ్ర శిక్షణ పొందిన 19 మంది ఉగ్రవాదులు 2001 సెప్టెంబర్ 11న నాలుగు విమానాలను హైజాక్ చేశారు. అందులో రెండు విమానాలు న్యూయార్క్‌లోని వరల్డ్ ట్రేడ్ టవర్స్ లక్ష్యంగా ఉదయాన్నే దాడి చేశారు. మరో విమానంతో పెంటగాన్‌పై దాడి చేశారు. నాలుగో విమానంలో ప్రయాణికులు ఎదురు తిరగడంతో ఉగ్రవాదులకు వారికి మధ్య జరిగిన ఘర్షణలో విమానం అదుపుతప్పి శాంక్స్‌విల్లే సమీపంలో కూలింది. ఈ విమానాన్ని వాషింగ్టన్‌పై దాడికి ఉపయోగించాలని ఉగ్రవాదులు భావించినట్లు విచారణలో తేలింది. ఈ దాడిలో వరల్డ్ ట్రేడ్ సెంటర్స్ మీద జరిగిన దాడిలో 2 వేల 753 మంది మరణించారు. వీరిలో ఫైర్ ఫైటర్స్ దాదాపు 343 మంది వరకు ఉన్నారు. అమెరికా సైనిక స్థావరం పెంటగాన్‌పై జరిగిన దాడిలో మరో 184 మంది చనిపోగా.. పెన్సిల్వేనియాలోని శాంక్స్‌విల్లే ఘటనలో 40 మంది పౌరులు చనిపోయారు.
కుట్ర వెనుక ఉన్నదెవరు?
వాస్తవానికి ఈ దాడి వెనకున్నది నాటి అల్‌ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్ కాగా.. ముందుండి నడిపింది మాత్రం ఖలీద్ షేక్ మహమూద్. విమానాలతో దాడి చేయాలన్న పథకం ఖలీద్‌కి కాగా.. ఉగ్రవాదులను, అవసరమైన నిధులను సమకూర్చింది మాత్రం అల్‌ఖైదానే. సౌదీ అరేబియాకు చెందిన ఉగ్రవాదులతో కూడిన 19 మందికి మొహమ్మద్ అట్టా నేరుగా దాడిలో పాల్గొని నేతృత్వం వహించాడు. వీరిలో కొందరు విమానాలు నడపడంలోనూ శిక్షణ పొందారు.
ఈ దాడికి మాస్టర్‌మైండ్‌గా భావించే మొహమూద్‌ను 2003లో అమెరికా సైన్యం పట్టుకోగా.. ఒసామాను 2011లో పాకిస్తాన్‌లోని ఒక అబోటాబాద్‌లో నిర్వహించిన రహస్య ఆపరేషన్లో నేవీ సీల్స్ మట్టుపెట్టాయి. తద్వారా అతడి కోసం సాగించిన పదేళ్ల వెతుకులాటకు తెరపడింది. అతడి శవాన్ని హిందూమహాసముద్రంలో గుర్తు తెలియని ప్రదేశంలో అమెరికా సైన్యం ఖననం చేసింది. అప్పటి వరకూ అతడి తలమీద 25మిలియన్ డాలర్ల విలువ ఉండగా.. 2001 సెప్టెంబర్ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా అమెరికా మొదలు పెట్టిన ఉగ్రవేట ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.
సెప్టెంబర్ 11న దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులందరూ ఆ దాడిలోనే చనిపోయారు. ఈ దాడి జరిగే సమయానికి అమెరికాలో అధ్యక్ష ఎన్నికల సమరం జరుగుతుండగా.. దాడి అనంతరం జార్జ్ బుష్ తీసుకున్న స్విఫ్ట్ యాక్షన్‌కు 90 శాతం అమెరికన్లు మద్దతుగా నిలిచి మరోసారి అధ్యక్ష పీఠంపై కూర్చోబెట్టారు. న్యూయార్క్ ఉగ్రదాడి జరిగిన ప్రదేశాన్ని తొలుత గ్రౌండ్ జీరోగా పిలిచిన అమెరికన్లు.. క్రమంగా దాని నుంచి బయటపడి 2014 నాటికి ఒక వరల్డ్ ట్రేడ్ సెంటర్ టవర్‌తో పాటు సెప్టెంబర్ 11 దాడులను వివరించే మ్యూజియం సహా మమోరియల్ ను నిర్మించారు.