Nuclear Power Plant On Moon: జాబిల్లిపై అణు విద్యుత్ కేంద్రం-రష్యా, చైనాల సంచలన నిర్ణయం
చంద్రమామ రహస్యాల గుట్టువిప్పేందుకు ఒకవైపు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇదే సమయంలో మానవులు అక్కడ నివసించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాల దిశగాకూడా అడుగులుపడుతున్నాయి. ఇది ఇప్పటికే మొదలైంది.
Nuclear power plant on Moon: చందమామ(Moon)పై ఇప్పటి వరకు ప్రయోగాలకు మాత్రమే పరిమితమైన దేశాలు(Countries).. ఇక, నుంచి అక్కడ మానవులు నివసించేందుకు అనువైన వాతావరణాన్ని కూడా కల్పించే దిశగా అడుగులు వేస్తున్నాయి. ఈ క్రమంలో రష్యా(Russia), చైనా(China) దేశాలు సంయుక్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టనున్నాయి. జాబిల్లి(Moon)పై నివాస యోగ్యమైన ప్రాంతాలను కనుగొనే ప్రయత్నాలు ముమ్మరమైన నేపథ్యంలో అక్కడ నివాసం ఉంటే అవసరమైన మౌలిక సదుపాయాల మాటేంటనే ప్రశ్న సాధారణంగా తెరమీదికి వచ్చేదే. ప్రధానంగా మానవులకు కావాల్సింది విద్యుత్. ఇదిఉంటే సగం అవసరాలు తీరినట్టే. దీంతో చైనా, రష్యాలు చంద్రునిపై విద్యుత్ ఉత్పత్తికి కార్యాచరణను ప్రారంభించాయి. దీనిలో భాగంగా 2035 లోగా జాబిల్లిపై అణు విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేయాలని నిర్ణయానికి వచ్చాయి. ఈ ప్రాజెక్టు ఇప్పటికే మొదలైందని రష్యా అంతరిక్ష సంస్థ రోస్ కాస్మోస్ తెలిపింది.
సాధ్యమేనా?
సాధారణంగా చంద్రమామను చేరుకునేందుకే చాలా కష్టపడుతున్న పరిస్థితి ఉంది. అక్కడి భిన్నమైన వాతావరణం, అననుకూల పరిస్థితుల గురించి తరచుగా చర్చకు వస్తున్నాయి.ఇ లాంటి సమయంలో ఏకంగా అణు విద్యుత్ కేంద్రం నిర్మాణం చేయడం సాధ్యమేనా? అనేది ప్రశ్న. దీనిని రష్యా అంతరిక్ష సంస్థ రోస్ కాస్మోస్(Rosecosmos) చైర్మన్ యూరీ(Dr. Uri) స్పందించారు. అంత ఈజీ కాదని చెప్పుకొచ్చారు. కాకపోతే, న్యూక్లియర్ స్పేస్ ఎనర్జీ రంగంలో రష్యాకున్న అపార నైపుణ్యం ఈ విషయంలో బాగా ఉపయోగపడనుందని మాత్రం చెప్పారు. రష్యా తలపెట్టిన ప్రాజెక్టు చంద్రునిపై మనిషి శాశ్వత ఆవాసం దిశగా కీలక ముందడుగు కానుందన్నారు. చందమామపై ఎదురయ్యే ఇంధన అవసరాలు, డిమాండ్లను తీర్చేందుకు సోలార్ ప్యానళ్లు చాలబోవని, అందుకే అణు విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు.
తొలి దశలో రోబో సాయం
అయితే చంద్రునిపై అణు విద్యుత్ కేంద్రం(Nuclear power plant) ఏర్పాటుకు రష్యా ఇప్పటికే ఓ కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. తొలి దశలో మానవ ప్రమేయంతో నిమిత్తం లేకుండా చంద్రునిపై అణు ప్లాంటు స్థాపన ప్రయత్నాలు పూర్తిగా ఆటోమేటెడ్ పద్ధతిన సాగుతాయి. దీనికి రోబోలను రంగంలోకి దించి వాటి సాయంతో కార్యాచరణ ప్రారంభిస్తారు. స్పేస్ టగ్‌బోట్ పేరిట అణు విద్యుత్‌తో నడిచే అంతరిక్ష నౌకను అభివృద్ధి చేయనున్నారు. దీనిలో భారీ అణు రియాక్టర్‌తోపాటు `హై పవర్ టర్బై`న్లు ఉంటాయి. విద్యు త్కేంద్రం తయారీకి కావాల్సిన సామగ్రిని దాన్నుంచే చంద్రునిపైకి పంపుతారు. చంద్రునిపై అణు విద్యుత్ కేంద్రం నిర్మాణంలో అనేక సమస్యలు ఉన్నాయి. ప్రధానంగా అణు ప్లాంటును ఎప్పటికప్పుడు చల్లబరచడం కీలకం. గతేడాది రష్యా ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన లూనా–25 అంతరిక్ష నౌక అంతరిక్షంలో అదుపు తప్పి పేలిపోయింది. ఈ నేపథ్యంలో అణు విద్యుత్ కేంద్రంనిర్మాణం, దాని రక్షణ, భద్రత వంటివి కూడ చర్చకు వస్తున్నాయి. చైనా కూడా చందమామపైకి మానవ సహిత యాత్రకు పక్కా ప్లాన్ చేస్తోంది. 2030 నాటికల్లా తమ తొలి వ్యోమగామిని పంపాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో రష్యా చేపట్టిన అనువిద్యుత్ కేంద్రం నిర్మాణానికి చైనా ప్రాధాన్యం ఇస్తుండం గమనార్హం. మరి ఏమేరకు సక్సెస్ అవుతాయో చూడాలి. దీనికి అంతర్జాతీయ సమాజం ఎలా స్పందిస్తుందనేది కూడా కీలకంగా మారింది.