Nobel Prize In Physics: భౌతికశాస్త్రంలో ముగ్గురికి నోబెల్ పురస్కారం, ప్రకటించిన రాయల్ స్వీడిష్ అకాడమీ
Nobel Prize In Physics: సోమవారం వైద్య శాస్త్రంలో ఇద్దరికి నోబెల్ బహుమతి ప్రకటించారు. తాజాగా భౌతిక శాస్త్రంలో ముగ్గురు శాస్త్రవేత్తలను ప్రతిష్టాత్మక నోబెల్ పురస్కారం వరించింది.
Nobel Prize In Physics:
ఈ ఏడాది నోబెల్ బహుమతుల విజేతలను ప్రకటిస్తున్నారు. సోమవారం వైద్య శాస్త్రంలో ఇద్దరికి నోబెల్ బహుమతి ప్రకటించారు. తాజాగా భౌతిక శాస్త్రంలో ముగ్గురు శాస్త్రవేత్తలను ప్రతిష్టాత్మక నోబెల్ పురస్కారం వరించింది. జర్మనీకి చెందిన ఫెరెన్స్ క్రౌజ్, అమెరికాకు చెందిన పెర్రీ అగోస్తిని, స్వీడన్‌కు చెందిన అన్నె ఎల్ హ్యులియర్‌కు ఈ ఏడాది ఫిజిక్స్ లో నోబెల్ బహుమతి ప్రకటించారు. రాయల్ స్వీడిష్ అకాడమీ మంగళవారం ఈ అవార్డును ప్రకటించింది.
అణువుల్లో ఎలక్ట్రాన్ డైనమిక్స్‌ను అధ్యయనం చేయడంలో భాగంగా కాంతి తరంగాల ఆటోసెకండ్ పల్స్‌ను ఉత్పత్తి చేయడంపై చేసిన పరిశోధనలకుగానూ పెర్రీ అగోస్తిని, ఫెరెన్స్ క్రౌజ్, ఎల్ హ్యులియర్ లకు భౌతికశాస్త్రంలో నోబెల్ అందజేస్తు్న్నట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ తెలిపింది. వీరి పరిశోధనలతో పరమాణువులు, అణువులలో ఎలక్ట్రాన్స్ గురించి మరింత అధ్యయనం చేసేందుకు నూతన ఆవిష్కరణలు వచ్చాయని పేర్కొన్నారు. అయితే ఫిజిక్స్ విభాగంలో నోబెల్ పొందిన 5వ మహిళా శాస్త్రవేత్తగా హ్యులియర్ నిలిచారు.
2022లోనూ ముగ్గురికి నోబెల్ పురస్కారం
భౌతిక శాస్త్రంలో 2022 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక నోబెల్ బహుమతి ముగ్గురు శాస్త్రవేత్తలను వరించింది. ఫ్రాన్స్‌కు చెందిన అలెన్ ఆస్పెక్ట్, అమెరికాకు చెందిన జాన్ ఎఫ్ క్లాసర్, ఆ్రస్టియాకు చెందిన ఆంటోనీ జీలింగర్ లకు గత ఏడాది నోబెల్ ప్రదానం చేశారు. ఫోటాన్‌లలో చిక్కుముడులు, క్వాంటమ్ ఇన్ఫర్మేషన్ సైన్స్‌లో చేసిన పరిశోధనలకు గానూ వీరిని నోబెల్ పురస్కారం వరించింది. సమాచార బదిలీ, సెన్సింగ్ టెక్నాలజీ, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి విభాగాల్లో క్వాంటమ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ కీలక పాత్ర పోషిస్తోందని నోబెల్ కమిటీ పేర్కొంది.
కరోనా సమయంలో సేవలకు అత్యుత్తమ గుర్తింపు, నోబెల్ పురస్కారంతో సత్కారం
కరోనా సమయంలో విశేష కృషి చేయడంతో పాటు కొవిడ్ వ్యాక్సిన్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించినందుకు కాటలిన్ కరికో, డ్రూ వెయిస్‌మన్ కు ఈ ఏడాది అత్యంత ప్రతిష్ఠాత్మక నోబెల్ పురస్కారం వరించింది. కరోనాను ఎదుర్కొనేందుకు సమర్థవంతమైన ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ల అభివృద్ధిలో వీరిద్దరూ ఎంతో కృషి చేశారు. న్యూక్లియోసైడ్ బేస్ మాడిఫికేషన్లలో వీరు చేసిన ఆవిష్కరణలకు గానూ స్వీడన్ లోని స్టాక్‌హోంలో ఉన్న కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్ లోని నోబెల్ బృందం సోమవారం ప్రకటించింది. ఎంఆర్ఎన్ఏ (mRNA) వ్యాక్సిన్ల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించినందుకు గానూ వీరికి ఈ అవార్డును ప్రకటించారు. ఈ మేరకు స్వీడన్ లోని స్టాక్ హోంలో ఉన్న కరోలిన్ స్కా ఇన్‌స్టిట్యూట్ లోని నోబెల్ బృందం సోమవారం ప్రకటించింది.