NASA Artemis 1: 1972 తర్వాత చంద్రుడిపైకి ఎవరూ ఎందుకెళ్లలేదు ! 50 ఏళ్ల తర్వాత మళ్లీ నాసానే ప్రయోగాలు
1969 జూలై 20న అపోలో 11 అంతరిక్ష నౌక ద్వారా చంద్రుడిపైకి వెళ్లిన అమెరికన్ వ్యోమగాములు ఫస్ట్ టైం అక్కడ కాలు మోపటానికి ఏకంగా ఆరు గంటల పాటు ఓపికగా ఎదురుచూశారు.
చంద్రుడిపై మనిషి తొలిసారిగా అడుగుపెట్టింది 1969లో
చరిత్రలో నిలిచిపోయిన వ్యోమగామి నీల్ ఆర్మ్ స్ట్రాంగ్
చివరి సారిగా అడుగుపెట్టింది 1972 సంవత్సరంలో
యాభైఏళ్లుగా అపోలో మిషన్లు నిలిపివేసిన నాసా
అమెరికా తర్వాత ఏ ఒక్క దేశం చూపని ఆసక్తి
యాభై ఏళ్ల తర్వాత మళ్లీ నాసానే ప్రయోగాలు
మిషన్ మార్స్ లో భాగంగా చంద్రుడిపైకి ఆర్టెమిస్
చంద్రుడిపై మనిషి తొలిసారి అడుగుపెట్టిన రోజు మానవ చరిత్రలో మరిచిపోలేని రోజు. 1969 జూలై 20న అపోలో 11 అంతరిక్ష నౌక ద్వారా చంద్రుడిపైకి వెళ్లిన అమెరికన్ వ్యోమగాములు ఫస్ట్ టైం అక్కడ కాలు మోపటానికి ఏకంగా ఆరు గంటల పాటు ఓపికగా ఎదురుచూశారు. అప్పటికే పదిసార్లు చంద్రుడిపైకి రాకెట్ల ద్వారా మనుషులను పంపించాలనే ప్రయోగాలు విఫలమై నాసా (NASA) సహా ప్రపంచ దేశాలన్నీ ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.
చంద్రుడిపై తొలి అడుగు :
1969 జూలై 20వ తేదీన అపోలో 11 వ్యోమనౌకకు చెందిన ఈగల్ మాడ్యూల్ ట్రాన్‌క్విలిటీ బేస్‌పైన దిగింది. ఆరు గంటల తర్వాత నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ చంద్రుడిపై తొలిసారిగా అడుగుపెట్టిన మనిషిగా చరిత్రలో నిలిచిపోయారు. ఆ క్షణం అమెరికాకు చెందిన నాసా సహా మానవచరిత్రలో ఒక గొప్ప మలుపుగా నేటికీ చెప్పుకుంటారు. 1969 తర్వాత 1972 మధ్యలో నాసా పది మందిని చంద్రుడిపైన కాలు మోపేలా చేసింది. అయితే 1972లో యుజెన్ సెర్నన్ చంద్రుడిపైకి వెళ్లివచ్చాక అక్కడికి మనుషులను పంపే అపోలో మిషన్‌కు అమెరికా స్వస్తి పలికింది.
కారణాలు అనేకం :
అప్పటి నుంచి నేటి వరకు అంటే ఈ 50 ఏళ్ల కాలంలో చంద్రుడి మీదకు ఏ ఒక్క దేశం మనుషులను పంపించలేదు. చంద్రుడి మీదకు మనుషులు వెళ్లనే లేదని, అక్కడికి వెళ్లివచ్చారనే ఫొటోలు కూడా అమెరికా సృష్టించినవేనని అనేక కాన్సిపెరసీ థియరీలు కూడా వ్యాప్తిలో ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెడితే యాభై ఏళ్లుగా ఎందుకు చంద్రుడిపైకి అమెరికా మనుషులు పంపించలేదని ప్రశ్నకు వాళ్లు చెప్పే కారణాలు ఎన్నో.
సోవియట్‌తో పోటీ :
1960, 70 ల సమయం అమెరికా, సోవియట్ యూనియన్ కు పోటా పోటీగా ఉండే రోజులు. నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్‌ను చంద్రుడిపైకి పంపి రష్యాతో జరుగుతున్న అంతరిక్షపోరులో అమెరికా విజయం సాధించింది కానీ, ఈ మూన్ మిషన్‌కు అమెరికాకు భారీగా ఖర్చు చేసింది. వాస్తవం చెప్పాలంటే అంత ఖర్చు చేసి చంద్రుడిపైకి పంపి ప్రతీసారి అక్కడి మట్టిని రాళ్లను తీసుకురావటం తప్ప వేరే ఏం చేయాలో కూడా అప్పటి నాసా శాస్త్రవేత్తలకు అవగాహన లేదనేది ఓ వాదన. ఎందుకంటే ఇప్పడున్నంత టెక్నాలజీలు కానీ స్పేస్ టెలిస్కోపులు కానీ అప్పటికి అందుబాటులోకి లేవు. శాస్త్రీయ ఆసక్తి కంటే రాజకీయ, ప్రచార కారణాల వల్లే చంద్రుడిపైకి మానవసహిత యాత్రలు చేపట్టారని కొందరు నిపుణులు నాసాను తప్పు పట్టేవారు.
పన్నులు కట్టేది చంద్రుడి కోసమా :
పైగా అమెరికా ఫెడరల్ సిస్టం.. అక్కడ ప్రజలు కట్టే పన్నులకు జవాబులు చెప్పుకోవాల్సిన అవసరం ప్రెసిడెంట్ కైనా ఉంటుంది. మూన్ మిషన్స్ టైం అంటే అపోలో ప్రాజెక్టుల కోసం అమెరికా ప్రభుత్వం ఫెడరల్ బడ్జెట్‌లో నాసాకు 5 శాతం నిధులను కేటాయించేది. దానిపై ప్రజల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వినిపించాయి. తాము కట్టిన పన్నులు చంద్రుడు మీదకు వెళ్లిపోతున్నాయని ప్రజలు భావించేవారని అది అప్పటి నాయకులపై ఎన్నికల టైంలో విపరీతంగా ప్రభావం చూపించేదని రాజకీయ విశ్లేషకులు నేటికి చెబుతుంటారు. ఫలితంగా అపోలో మిషన్ లను అమెరికా ప్రభుత్వం నాసాతో రద్దు చేయించింది.
నిజం చెప్పాలంటే ఇప్పుడు కూడా అమెరికా ప్రభుత్వం నాసాకు కేటాయిస్తున్న నిధులు చాలా తక్కువ. అమెరికా ఫెడరల్ బడ్జెట్ లో 0.4 శాతం నిధులు మాత్రమే నాసాకు అందుతున్నాయి. జేమ్స్ వెబ్ లాంటి డీప్ స్పేస్ ప్రయోగాల కోసం పెడుతున్న ఖర్చు..మూన్ పై ప్రయోగాల కంటే ఎక్కువ ఉపయోగపడుతుందనేది అక్కడి నేతల్లో బలంగా పాతుకుపోయిన అభిప్రాయం. అందుకే ఇప్పుడు చంద్రుడిపైకి యాభై ఏళ్ల తర్వాత మనుషులను పంపిస్తున్నది మిషన్ మార్స్ లో భాగంగానే కానీ... చంద్రుడిపైకి సరదాగా పంపించి తీసుకువద్దామని మాత్రం కాదు.
Also Read: NASA Artemis 1 : జాబిల్లిపై ఇన్ని ప్రయోగాలు చేయటం వెనుక ఉద్దేశమేంటీ..?