Gaza News: గాజాలోని హాస్పిటల్‌లో చిన్నారుల నరకయాతన, కుళ్లిన శవాల మధ్యే వేలాది మంది
Israel Gaza Attack: ఇజ్రాయేల్ దాడుల కారణంగా గాజాలోని హాస్పిటల్‌లో వేలాది మంది చిక్కుకున్నారు.
Israel Gaza War:
ఇజ్రాయేల్, హమాస్ యుద్ధం..
Gaza News: ఇజ్రాయేల్, హమాస్ మధ్య (Israel Hamas War) జరుగుతున్న యుద్ధంలో Al Shifa హాస్పిటల్ (Al Shifa Hospital) కీలకంగా మారింది. మొత్తం యుద్ధం అంతా ఇక్కడ ఒక్క చోటే జరుగుతున్నట్టుగా కనిపిస్తోంది. ఈ హాస్పిటల్‌నే హమాస్ ఉగ్రవాదులు కమాండ్ సెంటర్‌గా వినియోగించుకుంటున్నారని ఇజ్రాయేల్ భావిస్తోంది. అందుకే ఈ ఆసుపత్రిని లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడింది. ఈ కారణంగా వేలాది మంది రోగులకు వైద్యం అందడం లేదు. చిన్నారులు చనిపోతున్నారు. మరి కొంత మంది గాజా పౌరులు (Gaza Updates) అక్కడి నుంచి వేరే చోటకు వెళ్లిపోతున్నారు. ఈ విషయంలో ఇజ్రాయేల్‌పై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వస్తున్నప్పటికీ..."హమాస్‌ని అంతం చేయడమే మా లక్ష్యం" అని తేల్చి చెబుతోంది. హాస్పిటల్‌లో మిలిటరీ యాక్టివిటీస్ అన్నీ తక్షణమే ఆపేయాలని ఇజ్రాయేల్ గాజాని హెచ్చరించింది. 12 గంటల్లోగా దాడులను విరమించుకోవాలని డెడ్‌లైన్ పెట్టింది. కానీ అందుకు గాజా అంగీకరించలేదు. హమాస్ ఉగ్రవాదులు (Hamas in Gaza) లొంగిపోవాలని అల్టిమేటం జారీ చేసినప్పటికీ అదీ వర్కౌట్ కాలేదు. అందుకే దాడుల తీవ్రతను పెంచింది ఇజ్రాయేల్. ఐక్యరాజ్య సమితి లెక్కల ప్రకారం (United Nations) కనీసం 2,300 మంది రోగులు హాస్పిటల్ నుంచి వెళ్లిపోయారు.
36 మంది చిన్నారుల నరకయాతన..
చాలా రోజుల పాటు ఆసుపత్రిలోనే చిక్కుకుపోయిన వాళ్లూ మెల్లగా బయటకు వస్తున్నారు. నవంబర్ 14 నాటి లెక్కల ప్రకారం హాస్పిటల్‌లో 36 మంది చిన్నారులున్నారు. వాళ్లను ఇంక్యుబేటర్‌లలో పెట్టాల్సి ఉన్నా...కరెంట్ లేకపోవడం వల్ల అది సాధ్యపడడం లేదు. అందుకే కొంత మంది చిన్నారులు సరైన సమయానికి వైద్యం అందక కన్నుమూస్తున్నారు. అనస్థీషియా ఇవ్వకుండానే కొంత మందికి వైద్యం చేయాల్సి వస్తోంది. ఈ సమస్యలకు తోడు హాస్పిటల్ నిండా శవాలే గుట్టలుగా పడి ఉన్నాయి. అవి కుళ్లిపోతున్నాయి. ఆ వాసన భరించలేక విలవిలలాడిపోతున్నారు రోగులు. ఇజ్రాయేల్‌తో పాటు అమెరికా కూడా హమాస్ ఉగ్రవాదులపై తీవ్రంగా మండి పడుతోంది. హాస్పిటల్‌లో దాక్కుని ఇజ్రాయేల్‌పై దాడులు చేస్తున్నారని స్పష్టం చేసింది. అటు హమాస్ మాత్రం ఈ నిందని పూర్తిగా అమెరికాపైనే వేస్తోంది. అమెరికా కారణంగానే ఇలా హాస్పిటల్‌పై దాడులు జరుగుతున్నాయని మండి పడింది. ఇజ్రాయేల్‌ని కచ్చితంగా ఆక్రమించి తీరుతామని హెచ్చరించింది. అందుకు అమెరికానే బాధ్యత వహించాల్సి ఉంటుందని తేల్చి చెప్పింది.
ఇజ్రాయేల్, హమాస్ యుద్ధంపై (Israel Hamas War) ఐక్యరాజ్య సమతిలో ప్రవేశపెట్టిన ఓ తీర్మానానికి భారత్ అనుకూలంగా ఓటు వేసింది. పాలస్తీనాపై ఇజ్రాయేల్ చేస్తున్న యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం ప్రవేశపెట్టగా భారత్ అందుకు మద్దతు తెలిపింది. పాలస్తీనాతో పాటు తూర్పు జెరూసలేంని ఆక్రమించడంపై ఐక్యరాజ్య సమితి (United Nations Resolution) ఆందోళన వ్యక్తం చేసింది. మొత్తం 7 దేశాలు వ్యతిరేకంగా ఓటు వేయగా..వాటిలో అమెరికా, కెనడా ఉన్నాయి. 8 దేశాలు ఓటింగ్‌కి దూరంగా ఉన్నాయి. అయితే...ఇటీవల ఐక్యరాజ్య సమితిలో ఓ తీర్మానం ప్రవేశపెట్టారు. హమాస్‌పై దాడుల్ని ఇజ్రాయేల్ తక్షణమే ఆపేయాలని, మానవతా కోణంలో ఆలోచించాలని కోరుతూ తీర్మానం పాస్ చేశారు. ఈ ఓటింగ్‌కి భారత్ దూరంగా ఉంది.
Also Read: జమ్ముకశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, బస్సు లోయలో పడి 36 మంది మృతి