హమాస్ మిలిటెంట్లతో ఇక యుద్ధమే : ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు
ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు చేశారు. మిలిటెంట్ సంస్థ హమాస్‌తో తాము యుద్ధంలో ఉన్నామని అధికారికంగా ప్రకటించారు.
హమాస్ మిలిటెంట్ల మెరుపు దాడితో ఇజ్రాయెల్ దద్దరిల్లింది. ప్రతిగా పాలస్తీనాలోని గాజాపై ఇజ్రాయెల్ కూడా వైమానిక దాడులకు దిగింది. ఇదే సమయంలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు చేశారు. మిలిటెంట్ సంస్థ హమాస్‌తో తాము యుద్ధంలో ఉన్నామని అధికారికంగా ప్రకటించారు. ఇందుకు సంబంధించి నిర్ణయానికి అక్కడి సెక్యూరిటీ కేబినెట్ ఆమోదముద్ర వేసింది.
గాజా నుంచి అక్టోబర్ 7న ఉదయం 6గంటలకు ఇజ్రాయెల్‌పై ఉగ్రవాదులు జరిపిన భీకర దాడులతో యుద్ధం మొదలైందని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది. యుద్దానికి అవసరమైన సైనిక కార్యకలాపాలు సమకూర్చుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. రెండ్రోజులుగా ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య జరుగుతున్న యుద్ధంలో ఇప్పటి వరకు వెయ్యి మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. మరో నాలుగు వేల మందికిపైగా తీవ్ర గాయాలపాలయ్యారు.
ఏకమవుతున్న ప్రభుత్వ, ప్రతిపక్షాలు
ఇజ్రాయెల్‌పై హమాస్ దాడితో ఆ దేశంలోని ప్రభుత్వ, ప్రతిపక్షాలు రాజకీయ విభేదాలను పక్కనపెట్టాయి. ఏకతాటిపైకి వచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి. అత్యవసర జాతీయ సమైక్యతా ప్రభుత్వం ఏర్పాటు చేయడంపై చర్చలు మొదలుపెట్టాయి. నెతన్యాహు ప్రభుత్వంలో చేరే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు ప్రతిపక్షనాయకులు యారీ లాపిడ్, బెన్నీ గాంట్జ్ వెల్లడించారు. తాము ప్రభుత్వంలో చేరాలంటే లాపిడ్ మాత్రం మంత్రివర్గంలోని ఇద్దరిని తొలగించాలని డిమాండ్ చేశారు. నెతన్యాహు ప్రభుత్వంలోని రాడికల్, అసమర్థ మంత్రివర్గం ఈ యుద్ధాన్ని తట్టుకోలేదని లాపిడ్ వ్యాఖ్యానించారు. అత్యవసర జాతీయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ప్రత్యర్థులకు బలమైన సంకేతాలు వెళతాయని అభిప్రాయపడ్డారు. నెతన్యాహు కూడా వీరిని ప్రభుత్వంలో చేర్చుకొనేందుకు సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.
400 మంది హమాస్ ఉగ్రవాదులు హతం
గాజాలో తలదాచుకుంటున్న సుమారు 400 మంది హమాస్ ఉగ్రవాదులను మట్టుబెట్టామని ఐడీఎఫ్ వెల్లడించింది. పదుల సంఖ్యలో వారిని బందీలుగా పట్టుకున్నామని ఇజ్రాయెల్ రక్షణ దళం (ఐడీఎఫ్) ప్రకటించింది. దళాలు తొలుత గాజా సరిహద్దు వెంబడి నివసిస్తున్న ప్రజలను ఖాళీ చేయిస్తున్నాయని తెలిపింది. అక్కడ దాడులను తగ్గించి, భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారని అధికారులు. అలాగే ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకొని దాడులు కొనసాగిస్తున్నాయి. ఇజ్రాయెల్ దళాలకు, హమాస్ ఉగ్రవాదులకు మధ్య కిఫర్ అజాలో భీకరపోరు కొనసాగుతోంది. ఈ ప్రాంతం గాజా సరిహద్దులో ఉంటుంది. దాంతో కనిపించిన ఉగ్రవాదులందరినీ మట్టుబెట్టేందుకు ఐడీఎఫ్ ప్రయత్నిస్తోంది.
బంధీలుగా పట్టుకున్న గుర్తించేందుకు సిచ్యూవేషన్ రూమ్
ఇజ్రాయెల్‌పై హమాస్ రాకెట్ దాడులను ఆపడం లేదు. ఇవాళ కూడా స్డెరోట్ నగరంపై ఏకంగా 100 రాకెట్లను ప్రయోగించారు. ఈ దాడుల్లో నలుగురు తీవ్రంగా గాయపడినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు నిన్న జరిపిన దాడిలో హమాస్ ఎంత మంది ఇజ్రాయెలీలను బందీలుగా పట్టుకుందో గుర్తించేందుకు ఐడీఎఫ్ ప్రత్యేకంగా సిచ్యూవేషన్ రూమ్‌ను ఏర్పాటు చేశాయి. హమాస్ గన్‌మెన్లు నిన్న భారీగా పిల్లలు, మహిళలు, పురుషులను ఈడ్చుకొని గాజాపట్టీలోకి తీసుకెళ్లారు. ఇప్పటికే ఇజ్రాయెల్ రక్షణ దళాలకు సుమారు ఎంత మంది బందీలుగా ఉన్న అంశంపై కొంత అవగాహన ఉంది. కచ్చితమైన సమాచారం తెలుసుకోవాలని భావిస్తోందని ఐడీఎఫ్. గాజాపట్టీలో భవిష్యత్తులో తీవ్రమైన దాడులు జరుగుతాయని ఆయన హెచ్చరించారు. ఇందులో భాగంగానే గాజా సమీపంలోని ఇజ్రాయెల్ వాసుల నివాస ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్నారు.