(Source: ECI/ABP News/ABP Majha)
హిజాబ్ సరిగ్గా వేసుకోలేదని ఆగ్రహం, విద్యార్థినులకు గుండు కొట్టించిన టీచర్
Hijab Controversy: ఇండోనేషియాలోనూ హిజాబ్ వివాదం వెలుగులోకి వచ్చింది.
Hijab Controversy:
ఇండోనేషియాలో దారుణం..
హిజాబ్‌పై పలు ముస్లిం దేశాల్లో వివాదం కొనసాగుతూనే ఉంది. ఇరాన్‌లో అయితే చాలా రోజులుగా హిజాబ్‌కి వ్యతిరేకంగా ఉద్యమం నడుస్తోంది. ఇండియాలోనూ కర్ణాటకలో ఇది పెద్ద దుమారమే రేపింది. ఇప్పుడు ఇండోనేసియాలోనూ ఓ స్కూల్‌లో హిజాబ్ వివాదం తెరపైకి వచ్చింది. హిజాబ్‌ని సరిగ్గా ధరించలేదన్న కోపంతో 14 మంది విద్యార్థినులకు గుండు కొట్టించింది యాజమాన్యం. ఈ ఘటన ఆ దేశవ్యాప్తంగా సంచలనమైంది. స్థానిక మీడియా వెల్లడించిన వివరాల ప్రకారం...14 మంది విద్యార్థినులు తలను కవర్ చేసే హిజాబ్‌ను సరిగ్గా వేసుకోలేదు. ఇది చూసి టీచర్ మండి పడింది. పనిష్‌మెంట్ తప్పదని హెచ్చరించింది. వెంటనే వాళ్ల జుట్టుని కత్తిరించింది. ఆగస్టు 23న ఈ ఘటన జరిగినట్టు అక్కడి మీడియా తెలిపింది. స్కూల్ యాజమాన్యానికి వ్యతిరేకంగా స్థానికంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. సోషల్ మీడియాలోనూ చాలా మంది పోస్ట్‌లు పెడుతున్నారు. ప్రిన్సిపల్ స్పందించి క్షమాపణలు చెప్పాలని, కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
స్పందించిన ప్రిన్సిపల్..
ఈ డిమాండ్‌ల తరవాత స్కూల్ యాజమాన్యం తలొగ్గింది. ప్రిన్సిపల్ స్పందిస్తూ "ఇప్పటికే మేం క్షమాపణలు చెప్పాం. ఆ టీచర్‌ని సస్పెండ్ చేశాం" అని క్లారిటీ ఇచ్చారు. జుట్టు కనిపించేలా హిజాబ్ ధరించినందుకే ఈ పని చేసినట్టు టీచర్ చెబుతోంది. అయితే...స్కూల్ యాజమాన్యం మాత్రం విద్యార్థినులు హిజాబ్ ధరించాలన్న రూల్ ఏమీ పెట్టలేదని స్పష్టం చేసింది. ఈ ఘటన తరవాత విద్యార్థులు తీవ్ర ఆందోళనకు లోనయ్యారు. వాళ్లందరికీ కౌన్సిలింగ్ ఇచ్చే బాధ్యత తమదేనని ప్రిన్సిపల్ ప్రకటించారు.
"ఇలాంటి ఘటనలు పిల్లలపై చాలా రోజుల పాటు ప్రభావం చూపుతాయి. అందుకే ఈ సమస్యను చాలా జాగ్రత్తగా పరిష్కరించుకోవాలి. వాళ్లకి కౌన్సిలింగ్ ఇచ్చి ధైర్యం నింపే బాధ్యత మాదే"
- స్కూల్ యాజమాన్యం
మానవ హక్కుల సంఘాల ఆగ్రహం..
అటు మానవ హక్కుల సంఘాలూ ఈ ఘటనపై భగ్గుమంటున్నాయి. విద్యార్థుల జుట్టుని కత్తిరించే హక్కు టీచర్‌కి ఎవరిచ్చారంటూ ప్రశ్నిస్తున్నాయి. ఆ టీచర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.
కేరళలో ఇలా..
కేరళలోని తిరువనంతపురం ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఏడుగురు ముస్లిం విద్యార్థినులు ఆపరేషన్ థియేటర్‌లోకి హిజాబ్‌కి బదులుగా వేరే లాంగ్ స్లీవ్ జాకెట్‌లు వేసుకునేందుకు అనుమతినివ్వాలని ప్రిన్సిపల్‌ని కోరారు. ప్రతి చోటా తమకు హిజాబ్ ధరించడం వీలుకాకపోవచ్చని, అందుకు బదులుగా అలాంటి డ్రెస్‌నే వేసుకునేందుకు అనుమతించాలని ప్రిన్సిపల్‌కి లేఖ రాశారు. దీనిపై స్పందించిన ప్రిన్సిపల్...ఆపరేషన్ థియేటర్‌లో డ్రెస్ కోడ్‌ని మార్చడం వీలుకాదని తేల్చి చెప్పారు. టెక్నికల్‌గా సమస్యలు ఎదురయ్యే అవకాశముందని అన్నారు. అయినా...వాళ్ల రిక్వెస్ట్ మేరకు సర్జన్లతో మీటింగ్ ఏర్పాటు చేస్తామని, ఇన్‌ఫెక్షన్ కంట్రోల్ టీమ్‌తోనూ మాట్లాడతానని హామీ ఇచ్చారు. ఆ తరవాతే దీనిపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం ఆ ఏడుగురు ముస్లిం విద్యార్థినులు కాలేజ్‌లో తాము హిజాబ్ ధరించడానికి ఇబ్బందిగా ఉంటోందని లేఖ రాశారు.
Also Read: ల్యాండర్ విక్రమ్ ఫొటో తీసిన ప్రజ్ఞాన్ రోవర్, నావిగేషన్ కెమెరాతో క్లిక్