No Confidence Motion: లాస్ట్ ఓవర్లో ఇమ్రాన్ ఖాన్ బ్యాటింగ్- క్లీన్ బౌల్డ్ అవుతారా? మ్యాచ్ క్యాన్సిల్ చేస్తారా?
పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు మరో షాక్ తగిలింది. అవిశ్వాస తీర్మానానికి ముందు ప్రధాన మిత్రపక్షం ఇమ్రాన్ ఖాన్‌కు మద్దతు ఉపసంహరించుకుంది.
పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు వరస కష్టాలు వచ్చి పడ్డాయి. జాతీయ అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం ఎందుర్కోబోయే ముందు ఇమ్రాన్‌కు గట్టి షాక్ తగిలింది. అధికార పాకిస్థాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ (పీటీఐ) ప్రధాన మిత్ర పక్షం ముతాహిదా ఖుయామి మూమెంట్ పాకిస్థాన్ (ఎమ్‌క్యూఎమ్) ఇమ్రాన్ ఖాన్‌కు హ్యాండ్ ఇచ్చింది. ప్రతిపక్ష పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీకీ)కి మద్దతిస్తున్నట్లు ఎమ్‌క్యూఎమ్ ప్రకటించింది.
మెజార్టీకి దూరంలో
పాక్ సంకీర్ణ ప్రభుత్వంలో పీటీఐకి ప్రధాన మిత్ర పక్షం ఎంక్యూఎమ్. ఈ పార్టీకి చెందిన ఏడుగురు సభ్యులు ఇమ్రాన్ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నారు. అయితే వీరంతా ఇప్పుడు ప్రతిపక్ష కూటమికి మద్దతివ్వనున్నారు. దీంతో ఇమ్రాన్ ఖాన్ మెజార్టీ మార్క్‌ను కోల్పోయారు.
ఎంక్యూఎమ్ సభ్యులు రాజీనామా చేస్తే ఇమ్రాన్ బలం 164కు తగ్గుతుంది. ప్రతిపక్షాల బలం 176కు పెరుగుతుంది. వీరితో పాటు పీటీఐ పార్టీకే చెందిన 24 మంది సభ్యులు ఇమ్రాన్‌పై తిరుగుబాటు చేశారు .
ఎంత కావాలి?
ఇమ్రాన్ ఖాన్‌పై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై మార్చి 31న చర్చ జరగనుంది. ఏప్రిల్ 3న ఓటింగ్ నిర్వహించనున్నారు. ప్రస్తుత బలాల ప్రకారం ప్రతిపక్షాల అవిశ్వాస తీర్మానం నెగ్గేలానే కనిపిస్తోంది.
342 మంది సభ్యులున్న పాక్ జాతీయ అసెంబ్లీలో ఇమ్రాన్ ఖాన్ తన బలం నిరూపించుకోవాలంటే 172 మంది సభ్యుల మద్దతు అవసరం.
ఓటింగ్‌కు వద్దు
అవిశ్వాస తీర్మానంపై జరిగే ఓటింగ్‌లో పాల్గొనరాదని తన సొంత పార్టీ పీటీఐ సభ్యులకు ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆదేశించారు. తీర్మానంపై ఓటింగ్ రోజు సభకు హాజరుకావద్దని, వచ్చినా ఓటింగ్‌లో పాల్గొనవద్దని ఆయన ఒక లేఖలో కోరారు. తన సూచనలు ప్రతి ఒక్కరూ పాటించాల్సిందేనని, ఉల్లంఘించిన వారిపై ఫిరాయింపు చట్టం కింద చర్యలుంటాయని హెచ్చరించారు.
రద్దు చేస్తారా ?
అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరిగితే కచ్చితంగా ఓడిపోతామని తెలిసే ప్రత్యామ్నాయ మార్గాలపై ఇమ్రాన్ దృష్టి పెట్టారని సమాచారం. జాతీయ అసెంబ్లీ గడువు ఎటూ ఏడాదిలో ముగియనున్నందున దాన్ని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని ఆయన యోచిస్తున్నారని తెలిసింది.
Also Read: Optical Illusion: ఈ ఫోటోలో మీకు ఏం కనిపిస్తోందో చెప్పండి, మీరెలాంటి వ్యక్తిత్వం కలవారో తెలిసిపోతుంది