Varanasi : 'వారణాసి' ఈ పేరెలా వచ్చింది? అక్కడ ప్రత్యేకతలు , వింతలు ఏంటి? రాజమౌళి - మహేష్ సినిమాకు ఈ టైటిల్ ఎందుకు?
Varanasi Movie: ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని, ప్రపంచ సాంస్కృతిక నగరం వారణాసి. మహేశ్ బాబు - రాజమౌళి సినిమా టైటిల్ ఇదే కావడంతో దీనిపై ప్రత్యేక చర్చ జరుగుతోంది. ఇంతకీ వారణాసికి ఆ పేరెలా వచ్చిందో తెలుసా?

Varanasi Special: జనన మరణ చక్రం నుంచి శాశ్వత విముక్తి లభించే క్షేత్రం వారణాసి. అందుకే కాశీని ముక్తి స్థలం అంటారు. గంగలో స్నానం చేస్తే పాపాలు నశిస్తాయని భక్తుల నమ్మకం.
వారణాసి అనే పేరెలా వచ్చింది?
వరుణ, అసి అనే రెండు నదుల సంగమాల మధ్య ఉన్నందునే 'వారణాసి' అనే పేరువచ్చిందని చెబుతారు.
పాళీభాషలో బారణాసిగా రాసేవారు.. అది బనారస్ గా మారింది.
పురాణ ఇతిహాసాల్లో వారణాసి నగరాన్ని అవిముక్తక, ఆనందకానన, మహాస్మశాన, సురధాన , బ్రహ్మవర్ధ, సుదర్శన, రమ్య, కాశీ అనే ఎన్నో పేర్లతో ప్రస్తావించారు.
5వేల సంవత్సరాల క్రితం శివుడు వారాణసి నగరాన్ని స్థాపించాడని పౌరాణిక గాథలు చెబుతున్నాయి.. హిందువుల ఏడు మోక్షదాయక క్షేత్రాల్లో ఇదొకటి
'వారణాసి' ప్రత్యేకతలు
సప్త మోక్షదాయక క్షేత్రాల్లో వారణాసి ఒకటి, 12 జోతిర్లింగాల్లో శ్రేష్ఠమైనది. 14 భువన భాండాల్లో విశేషమైన స్థలం కాశీ.
గొడుగు లాంటి పంచ క్రోశాల పరిధిలో ఏర్పడిన భూభాగమే కాశీ పట్టణం
వారణాసి బ్రహ్మ దేవుని సృష్టి కాదు... సృష్టి ఆరంభంలో శివుడు నిర్మించిన ఆధ్యాత్మిక రాజధాని, స్వయంగా పరమేశ్వరుడు నివాసం ఉండే పట్టణం
ప్రళయం వచ్చినా ప్రపంచం మొత్తం నీటమునిగినా కాశీని ఎలాంటి ప్రళయం ముంచెత్తలేదు...ఎందుకంటే అప్పుడు కూడా పరమేశ్వరుడు తాను సృష్టించిన వారణాసిని త్రిశూలంపై పైకెత్తి కాపాడుతాడని చెబుతారు
కాశీలో గంగానదీ స్నానం, బిందు మాధవుడి దర్శనం, డిండి వినాయకుడు, విశ్వనాథుడు,విశాలాక్షి, కాలభైరవ దర్శనం అత్యంత ముఖ్యం
ఎన్నో జన్మల పుణ్యం ఉంటే కానీ క్షేత్ర పాలకుడు భైరవుడు జీవిని వారణాసిలోకి అడుగుపెట్టనీయడు. ఇక్కడ మరణించిన వారికి పునర్జన్మ ఉండదని హిందువుల విశ్వాసం
కాశీలో ప్రవేశించే ప్రతి జీవికి సంబంధించి పాపపుణ్యాలు చిత్రగుప్తుడి చిట్టా నుంచి మాయమై కాలభైరవుని వద్దకు చేరుతుంది. అందుకే కాల భైరవ దర్శనం తర్వాత వీపుపై కర్రతో కొట్టి నల్లని దారం కడతారు
వారణాసిలో మరణించిన ప్రతి జీవికి శివుడు దర్శనమిచ్చి వారి చెవిలో తారక మంత్రం పలికి మోక్షం ప్రసాదిస్తాడని శివపురాణంలో ఉంది. అందుకే చాలామంది జీవిత చరమాంకాన్ని వారణాసిలో గడపాలి అనుకుంటారు
ఎవరి అస్తికలు అయితే గంగలో కలుపుతామో...వారు వారణాసిలో జన్మించి విశ్వనాథుడి కరుణాకటాక్షాలకు పాత్రులవుతారట. లోకమంతా కరవు వచ్చినా గంగమ్మ మాత్రం కాశీ ఘాట్లను వదిలి దూరం జరగలేదట..అందతా విశ్వనాథుడి మహిమే..
వారణాసిలో ఎన్ని వింతలో!
కాశీలో గ్రద్దలు ఎగరవు
గోవులు తల విదిల్చి పొడవవు
బల్లుల అరుపు వినిపించదు
శవాలు వాసన రావు
వారణాసిలో మరణించిన ప్రతి జీవి కుడి చెవి పైకి లేచి ఉంటుంది
వారణాసిలో విశ్వనాథుడి ఆలయం చుట్టూ ఎన్నో సందులుంటాయి.. అవన్నీ వలయాల్లా పద్మవ్యూహంలా అనిపిస్తాయ్. పూర్వం ఈ ప్రదేశంలో వనాలు ఉండేవట..విదేశీయుల దండయాత్ర నుంచి కాపాడుకునేందుకు ప్రజలంతా ఆలయం చుట్టూ పెద్ద పెద్ద బంగళాలు కట్టి శత్రు సైనికులకు దారిలేకుండా చేశారని చెబుతారు.
ఇక్కడ విశ్వేశ్వరుడికి భస్మలేపనంతో పూజ ప్రారంభిస్తారు. కాశీలోని పరాన్న భుక్తేశ్వరుణ్ణి దర్శించుకునేవారికి పరుల అన్నం తిన్న రుణం నుంచి విముక్తి లభిస్తుందట. కాశీలో పుణ్యం చేసినా, పాపం చేసినా అది కోటిరెట్లు అధికంగా ఉంటుందని విశ్వాసం...
మహేష్ బాబు-రాజమౌళి సినిమాకు ఈ పేరు ఎందుకు?
సృష్టి ఆరంభమైంది వారణాసి లోనే.. అసలు బ్రహ్మదేవుడు సృష్టి ప్రారంభించిందే ఇక్కడ. ఇక సృష్టి మొత్తం అంతం అయినా.. కలియుగాంతం వచ్చినా మిగిలేది ఆ నగరమే. అందుకే యుగాలు చుట్టూ సాగే రాజమౌళి సినిమా మొదలయ్యేది...శుభం కార్డ్ పడేది వారణాసిలోనే.
సర్వం శివమయం...అంతా శివుడే...






















