Earthquake In Nepal: అర్థరాత్రి భూకంపం - నేపాల్‌లో 128 మంది మృతి, వెయ్యి మందికిపైగా గాయాలు
Earthquake In Nepal: నేపాల్ రాజధాని ఖాట్మాండుకు 400కిలోమీటర్ల దూరంలోని జజర్‌కోట్‌లో భూకంప కేంద్రం గుర్తించినట్లు నేపాల్ సిస్మాలజీ కేంద్రం చెప్పింది. భూకంప కేంద్రం 11 మైళ్ల లోతులో ఉన్నట్లు తెలిపింది.
Earthquake In Nepal: నేపాల్‌లో అర్థరాత్రి భారీ భూకంపంతో వణికిపోయింది. శుక్రవారం 6.4 తీవ్రతతో సంభవించిన భూకంపం ధాటికి 100 మందికిపైగా మృతి చెందినట్టు ప్రస్తుతానికి అధికారులు ప్రకటించారు. ఈ దుర్ఘటనలో వెయ్యి మందికిపైగా గాయపడ్డారని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.
నేపాల్‌లో శుక్రవారం (నవంబర్ 3, 2023) రాత్రి 11:54 గంటలకు భూమి ఒక్కసారిగా కంపించింది. ఈ ప్రకంపనలు ధాటికి ప్రజలు ఒక్కసారిగా హాహాకారాలతో భయంతో నివాసాల నుంచి బయటకు పరుగులు తీశారు. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపు కొన్ని భవనాలు కుప్పకూలాయి. వందల మంది ఆ శిథిలాల కింద చిక్కుకుపోయారు.
నేపాల్ రాజధాని ఖాట్మాండుకు 400కిలోమీటర్ల దూరంలోని జజర్‌కోట్‌లో భూకంప కేంద్రం గుర్తించినట్లు నేపాల్ సిస్మాలజీ కేంద్రం చెప్పింది. భూకంప కేంద్రం 11 మైళ్ల లోతులో ఉన్నట్లు తెలిపింది. అంతా పడుకునే సమయంలో భూకంపం సంభవించండంతో ప్రమాద తీవ్రత పెరిగిందని అధికారులు అంటున్నారు. అర్థరాత్రి రావడంతో ప్రజలంతా అర్థరాత్రి రోడ్డుపైనే గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ప్రభావిత ప్రాంతానికి బయలుదేరిన ప్రధాని ప్రచండ
నేపాల్‌లోని భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఆర్మీ రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తోంది. గాయపడ్డవారిని మెరుగైనా చికిత్స అందిస్తున్నారు. నేపాల్ ఆర్మీకి చెందిన 16 వైద్య బృందాలు, అవసరమైన సామాగ్రితో ప్రధాని పుష్ప కమల్ దహల్ ప్రచండ ప్రభావిత ప్రాంతానికి చేరుకున్నారు.
ఉత్తరాది రాష్ట్రాల్లో కుదుపు
నేపాల్‌లో ఏర్పడ్డ భూకంపం ప్రభావం దేశంలోని ఉత్తరాదిపై కూడా ఉంది. దేశ రాజధాని ఢిల్లీసహా పలు రాష్ట్రాల్లో కొన్ని సెకన్లపాటు భూమి కంపించింది. ఢిల్లీతో పాటు ఉత్తరప్రదేశ్, బిహార్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో రాత్రి 11 గంటల 32 నిమిషాలకు భూకంపం సంభవించింది. రాత్రివేళ కావడంతో ప్రజలు నిద్రపోతున్న సమయంలో భూమి కంపించడంతో హడలెత్తిపోయారు. ఢిల్లీ రాజధాని చట్టుపక్కల ప్రాంతాలు, బిహార్ ప్రజలు భూ ప్రకంపనలు రావడంతో భయంతో ప్రాణ భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
గత నెల నుంచి కొన్ని రోజుల వ్యవధిలో సంభవించిన మూడో అతిపెద్ద భూకంపం ఇది. అయితే నిద్ర పోవడానికి అప్పుడే మంచం మీద పడుకున్న కొందరికి అసలు ఏమైంది అనేది అర్థం కావడానికి కొంత టైమ్ పట్టిందని ఢిల్లీ వాసులు చెబుతున్నారు.
తరచుగా భూకంపాలు..
అక్టోబర్ 3న సైతం ఢిల్లీ- ఎన్‌సీఆర్ ప్రాంతంలో భూకంపం సంభవించింది. ఉత్తరాది రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ లతో పాటు నేపాల్ లో భూప్రకంపనలతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. ముఖ్యంగా నేపాల్ లో రిక్టర్ స్కేలుపై 6.2 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. ఢిల్లీ, యూపీ, ఉత్తరాఖండ్ లో పలుచోట్ల దాదాపు 10 సెకన్ల పాటు భారీగా భూప్రకంపనలు వచ్చాయి. కొన్ని సెకన్లపాటు భూమి కంపించడంతో ప్రజలు ప్రాణ భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
అక్టోబర్ 22న సైతం నేపాల్ లో భారీ భూకంపం సంభవించడం తెలిసిందే. దేశ రాజధాని ఢిల్లీ నాల్గవ భూకంప జోన్ పరిధిలోకి వస్తుంది. ఈ ప్రాంతం భూకంపాలకు గురయ్యే అధిక రిస్క్ జోన్లలో ఒకటి. అయితే నేపాల్ కేంద్రంగా 5 కిలోమీటర్ల లోతులో భూకంప తీవ్రత ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు.