Donald Trump Tariffs: ఇరాన్ తో వ్యాపారం చేస్తే అమెరికా 25 శాతం టారిఫ్.. ఈ దేశాలపై నేరుగా ప్రభావం
US Iran Trade Warning: ఇరాన్ తో వ్యాపారం చేస్తే తీవ్ర పరిణామాలుంటాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్ లో నిరసనలు కొనసాగడంతో ఆందోళనకారులు చనిపోతున్నారు.

US Iran Trade Warning: అమెరికా, ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల వేళ అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక కఠిన నిరణయం తీసుకున్నారు. ఇరాన్‌తో వ్యాపారం చేసే ఏ దేశమైనా తాము వేసే అదనపు టారిఫ్ భరించవలసి ఉంటుందని ట్రంప్ స్పష్టం చేశారు. ఇరాన్‌తో వ్యాపార లావాదేవీలు నిర్వహించే దేశాలపై అమెరికా 25 శాతం సుంకాలు విధిస్తామని ప్రకటించింది.
ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్రూత్ సోషల్‌లో, ఏదైనా దేశం ఇరాన్‌తో వ్యాపారం చేస్తే, అమెరికాతో జరిగే ప్రతి వ్యాపారంపై 25 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈ రూల్ వెంటనే అమల్లోకి వస్తుందని, ఇందులో ఎలాంటి మార్పు ఉండదని ట్రంప్ అన్నారు.
ఈ దేశాలపై దీని ప్రభావం పడవచ్చు
అసోసియేటెడ్ ప్రెస్ నివేదిక ప్రకారం, చైనా, బ్రెజిల్, టర్కీతో పాటు రష్యా వంటి దేశాలకు ఇరాన్‌తో వాణిజ్య సంబంధాలు ఉన్నాయి. అలాంటి పరిస్థితిలో ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఈ దేశాలపై నేరుగా ప్రభావం చూపుతుంది.
చర్చల ద్వారా పరిష్కారం కోరుకుంటున్నాం
అంతకుముందు అమెరికా, ఇరాన్ అధికారులతో చర్చలు జరపవచ్చని, ఇరాన్ ప్రతిపక్ష నాయకులతో కూడా గుడ్ రిలేషన్ కలిగి ఉందని ట్రంప్ చెప్పారు. ఆయన ఇరాన్‌లో నిరసనకారుల మరణాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరాన్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతూ సైనిక చర్యను కూడా హెచ్చరించారు. అయితే, సోమవారం నాడు వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్, అమెరికాకు ఇప్పటికీ మొదటి ప్రాధాన్యత చర్చలేనని స్పష్టం చేశారు. దాడి చేయడం ఒక ఆప్షన్ అని, అయితే అధ్యక్షుడు మొదట చర్చల ద్వారా పరిష్కారం కోరుకుంటున్నారని అన్నారు.
ఇరాన్ నుండి అమెరికాకు స్పష్టమైన, ఒకే విధమైన సందేశాలు అందడం లేదని లెవిట్ చెప్పారు. ఇరాన్ ప్రభుత్వం బయటకు ఒకటి చెబుతోందని, అయితే అంతర్గత చర్చల్లో వేరే విషయాలు వెలుగులోకి వస్తున్నాయని, అధ్యక్షుడు ట్రంప్ ఈ సందేశాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆమె అన్నారు.
ఇరాన్‌లో నిరసనలు
ఇరాన్‌లో ఇటీవల నెలల్లో ప్రభుత్వంపై పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్నాయి. ఈ నిరసనలు తీవ్రమైన ఆర్థిక సంక్షోభంతో ప్రారంభమయ్యాయి, కానీ ఇప్పుడు ప్రభుత్వాన్ని తొలగించాలని డిమాండ్ చేసే స్థాయికి చేరుకున్నాయి. ఈ ప్రాంతంలో ఇరాన్ ప్రభావం కూడా బలహీనపడింది.






















