50 ఏళ్లలో ఇంత చెత్త ప్రధానిని చూడలేదు, ఓ సర్వేలో దారుణమైన రేటింగ్ - ట్రూడోపై ఓటర్ల అసహనం
Canada PM Justin Trudeau: కెనడా ప్రధానికి ఓ సర్వేలో ఓటర్లు దారుణమైన రేటింగ్ ఇచ్చారు.
Canada PM Justin Trudeau:
సర్వేలో దారుణమైన రేటింగ్..
భారత్‌పై తీవ్ర ఆరోపణలు చేసిన కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోపై (Justin Trudeau) ఓటర్లు అసంతృప్తితో ఉన్నట్టు ఓ సర్వేలో వెల్లడైంది. ఆయన పాపులారిటీ దారుణంగా పడిపోయినట్టు స్పష్టం చేసింది. Ipsos పేరిట జరిగిన సర్వేలో ప్రధానిగా జస్టిన్ ట్రూడోని కాదనుకుంటున్న వాళ్లే ఎక్కువగా ఉన్నారు. ఈ ప్రధాని రేసులో ఉన్న ప్రతిపక్ష నేత పియెర్రే పొయిలెవ్రే (Pierre Poilievre)కే 40% మంది మద్దతు పలికారు. పొయిలెవ్రేనే ప్రధానిగా ఉండాలని ఓటు వేశారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహించినా ఆయన 39% ఓట్లు పడతాయని ఈ సర్వే స్పష్టం చేసింది. 2015లో కెనడా ప్రధానిగా ఎన్నికయ్యారు ట్రూడో. లిబెరల్ పార్టీకి ప్రస్తుతం ఆయనే నేతృత్వం వహిస్తున్నారు. ఇప్పుడు ఎన్నికలు జరిగితే ట్రూడోకి కేవలం 30% ఓట్లు మాత్రమే పోల్ అయ్యే అవకాశముందని సర్వే తెలిపింది. ఎప్పుడు ఎన్నికలు జరిగినా ట్రూడో లీడ్ చేస్తున్న లిబరల్ పార్టీ కచ్చితంగా ఓడిపోతుందని, ప్రతిపక్ష పార్టీ The Conservatives గెలుస్తుందని స్పష్టం చేసింది ఈ సర్వే. 2025లో కెనడాలో ఎన్నికలు (Canada Elections) జరగనున్నాయి. ఈ ఏడాది జులైలోనూ ఓ సర్వే జరిగింది. అప్పుడు కూడా ట్రూడోకి దారుణమైన రేటింగ్ ఇచ్చారు. ఈ 50 ఏళ్లలో అత్యంత చెత్త ప్రధాని ఆయనే అంటూ ఓటర్లు మండి పడ్డారు. జస్టిన్ ట్రూడో తండ్రి పియెర్రే ట్రూడో 1968-79 వరకూ కెనడా ప్రధానిగా పని చేశారు. ఆ తరవాత 1980-84 వరకూ అదే పదవిలో ఉన్నారు. ఉత్తమ ప్రధానిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన కొడుకైన జస్టిన ట్రూడోకి మాత్రం ఓటర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
ఖలిస్థాన్ ఉద్యమంపై మెతగ్గా..
ఖలిస్థాన్ ఉద్యమంపై మెతక వైఖరితో ఉంటున్నారని ట్రూడోపై ఆరోపణలు వస్తున్నాయి. భావ ప్రకటనా స్వేచ్ఛ పేరు చెప్పి అల్లర్లు సృష్టిస్తున్న వారిపై చర్యలు తీసుకోవడం లేదన్న అసహనం కెనడా ప్రజల్లో ఉన్నట్టు సర్వేలో వెల్లడైంది. ప్రస్తుతం లిబరల్స్ పార్టీ న్యూ డెమొక్రటిక్ పార్టీ (NDP)తో కలిసి ప్రభుత్వాన్ని నడిపిస్తోంది. NDPకి నేతృత్వం వహిస్తోంది జగ్‌మీత్ సింగ్. ఇతనో ఖలిస్థాన్ సానుభూతి పరుడు. వచ్చే ఎన్నికలు జరిగేంత వరకూ ప్రభుత్వానికి తమ మద్దతు ఉంటుందని NDP ప్రకటించింది. ఖలిస్థాన్ సానుభూతి పరుడితో కలిసి ప్రభుత్వం నడపడంపైనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పైగా ఇప్పుడు భారత్‌తో ఇదే విషయమై వివాదం నడుస్తోంది. కానీ ట్రూడ మాత్రం పూర్తిగా భారత్‌పైనే తప్పు నెట్టేసి చేతులు దులుపుకుంటున్నారు. నిజ్జర్ హత్య వెనక భారత్ హస్తం ఉందంటూ నిరాధార ఆరోపణలు చేసి అంతర్జాతీయంగా విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సమయంలో ఈ సర్వే వెల్లడవడం కీలకంగా మారింది. వచ్చే ఎన్నికల్లో జస్టిన్ ట్రూడో ఓడిపోక తప్పదన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే...సిక్కుల మద్దతుతో అధికారంలోకి వచ్చిన ఆయన ఖలిస్థాన్ ఉద్యమంపై చర్యలు తీసుకునే అవకాశాలే కనిపించడం లేదు. ఆ ఓటు బ్యాంకుని కాపాడుకోవడం కోసం మౌనంగా ఉండిపోతున్నారు. పైగా భారత్‌పై నిందలు వేస్తున్నారు.
Also Read: సిక్కుల ఓటు బ్యాంక్ కోసం కెనడా చిక్కుల్లో పడిందా? భారత్‌తో మైత్రిని కాదనుకుని ఉండగలదా?