Wikileaks Founder Assange: వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజ్‌కు విముక్తి.. జైలు నుంచి విడుదల
Julian Assange : వికీ లీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజ్ ఎట్టకేలకు జైలు నుంచి విడుదలయ్యారు. నేరంగీకార ఒప్పందంతో అమెరికా కోర్టులో బుధవారం హాజరుకానున్నారు.
WikiLeaks Founder Julian Assange Acquitted : ప్రపంచ వ్యాప్తంగా సంచలనాలకు మారుపేరైన వీకిలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజ్ కు ఎట్టకేలకు విముక్తి లభించింది. అగ్రరాజ్యం అమెరికా ప్రభుత్వం మోపిన గూడచర్యం అభియోగాలు నేపథ్యంలో 2019 నుంచి లండన్ జైల్లో ఆయన ఉంటున్నారు. అమెరికాతో జరిగిన ముందస్తు ఒప్పందం ప్రకారం జూలియన్ అసాంజ్ పసిఫిక్ మహా సముద్రంలోని మరియానా దీవులకు తరలించనున్నారు. చార్టెడ్ విమానంలో ఉత్తర మరియానా ఐలాండ్స్ లోని సైపన్ దీపానికి ఆయన బయలుదేరి వెళ్లారు. ఇక్కడి అమెరికా ఫెడరల్ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. ఆయన ఇక్కడే తన నేరాన్ని అంగీకరించనున్నారు. అనంతరం తన స్వదేశమైన ఆస్ట్రేలియాకు జూలియన్ అసాంజ్ ను తరలిస్తారు. గత కొన్నాళ్లుగా లండన్ లో శరణార్థులుగా ఉన్న జూలియన్ అసాంజ్ సతీమణి, ఆయన పిల్లలు మంగళవారం ఆస్ట్రేలియా బయలుదేరి వెళ్ళనున్నారు. ఐదేళ్లుగా జూలియన్ అసాంజ్ బ్రిటన్ లోనే జైలు జీవితం గడుపుతున్నారు. అమెరికాకు చెందిన న్యాయ విభాగంతో నేరంగీకార ఒప్పందం కుదుర్చుకోవడంతో జూలియన్ అసాంజ్ విడుదలకు మార్గం సుగమం అయింది. దీని ప్రకారం అమెరికా కోర్టులో విచారణకు హాజరయ్యేందుకు యూకే జైలు నుంచి ఆయన మంగళవారం ఉదయం విడుదలయ్యారు. అమెరికా వెళ్లడానికి జూలియన్ అసాంజ్ నిరాకరించడంతో ఆస్ట్రేలియాకు సమీపంలోని అమెరికా ఆధీనంలో ఉండే ఈ ప్రాంతంలో విచారణ చేపడుతున్నారు. కోర్టుకు సమర్పించిన పత్రాలు ప్రకారం గూడఛర్యం చట్టాన్ని అతిక్రమిస్తూ జాతీయ భద్రతకు సంబంధించిన కీలక సమాచారాన్ని పొందడం, వ్యాప్తి చేయడం వంటి ఆరోపణలను జూలియన్ అసాంజ్ అంగీకరించినట్లు సమాచారం. ఆయనపై మోపిన 18 అభియోగాలను కలిపి ఒకే కేసుగా విచారించనున్నట్లు తెలుస్తోంది. జూలియన్ అసాంజ్ నేరంగీకార వాంగ్మూలాన్ని న్యాయమూర్తి ఆమోదించాల్సి ఉంది. అనంతరం ఆయనకు శిక్ష ఖరారు చేస్తారు. ఇప్పటికే బ్రిటన్ లో అనుభవించిన ఐదేళ్ల శిక్షతో సరిపెట్టి విడుదల చేస్తారని తెలుస్తోంది. అదే జరిగితే ఆ వెంటనే అసాంజ్ నేరుగా స్వదేశం ఆస్ట్రేలియాకు వెళ్ళనున్నారు.
జూలియన్ అసాంజ్ అరెస్టు వెనుక నేపథ్యం ఇదే..
వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజ్ జైలు జీవితానికి అమెరికా ఆరోపణలే కారణం. ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ తదితర చోట్ల అమెరికా సైన్యం పాల్పడ్డ తప్పిదాలు, చేపట్టిన తప్పుడు చర్యలకు సంబంధించిన లక్షలాది రహస్య పత్రాలను లీక్ చేసి జూలియన్ అసాంజ్ అప్పట్లో సంచలనం సృష్టించారు. దీంతో ఆయన పేరు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగింది. జూలియన్ అసాంజ్ స్థాపించిన వీకీలీక్స్ అమెరికా రక్షణరంగ రహస్య పత్రాలెన్నింటినో విడుదల చేసింది. బాగ్దాదాద్ పై 2017 అమెరికా వైమానిక దాడిలో ఇద్దరు రాయిటర్ జర్నలిస్టులతోపాటు సామాన్యులు మృతి చెందిన వీడియా వంటివి వీటిలో ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్ యుద్ధానికి సంబంధించి 91 వేలకుపైగా పత్రాలను వికీ లీక్స్ విడుదల చేసింది. ఆ తరువాత ఇరాక్ యుద్ధాన్ని వివరించే నాలుగు లక్షల రహస్య సైనిక ఫైళ్లను విడుదల చేసింది. ఈ వ్యవహారం ప్రపంచ వ్యాప్తంగా కలకలం సృష్టించడంతో.. జూలియన్ అసాంజ్ పై అమెరికా తీవ్ర అభియోగాలను మోపింది. మరోవైపు లైంగిక నేరాలు ఆరోపణలపై జూలియన్ అసాంజ్ అరెస్టుకు స్వీడన్ కోర్టు 2017 నవంబర్ లో ఆదేశించింది. ఆ ఆరోపణలు ఆయన అప్పట్లోనే ఖండించారు. 2019 నుంచి ఆయన జైలు జీవితాన్ని గడుపుతున్నారు.
తొలిసారి 2010లో అరెస్ట్..
జూలియన్ అసాంజ్ 2010 అక్టోబర్ లో బ్రిటన్ లో అరెస్టయ్యారు. ఆ తర్వాత బెయిల్ పై విడుదలయ్యారు. అయితే, ఆయన్ను స్వీడన్ కు అప్పగించాలని 2011 ఫిబ్రవరిలో లండన్ కోర్ట్ ఆదేశించింది. దీనిపై బ్రిటన్ సుప్రీం కోర్టులో అప్పీల్ చేసిన లాభం లేకపోయింది. దీంతో కొంతకాలం లండన్ లోని రాయబార కార్యాలయంలో రాజకీయ ఆశ్రయం పొందారు. 2019 ఏప్రిల్ లో ఈ ఆశ్రయం రద్దయింది. అనంతరం బ్రిటన్ కోర్టు ఆయనకు 50 వారాల జైలు శిక్ష విధించింది. అమెరికాకు అప్పగింతపై విచారణ పెండింగ్ లో ఉండడంతో శిక్ష పూర్తయ్యాక కూడా జూలియన్ అసాంజ్ జైల్లోనే ఉన్నారు. జూలియన్ అసాంజ్ ఆత్మహత్య చేసుకునే ప్రమాదం ఉన్నందున అమెరికాకు అప్పగించడం కుదరదని బ్రిటన్ కోర్టు 2021 లోనే తేల్చి చెప్పింది.
ఆనందంలో కుటుంబ సభ్యులు
జూలియన్ అసాంజ్ జైలు నుంచి విడుదలవుతుండడం పట్ల కుటుంబ సభ్యులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. జూలియన్ అసాంజ్ భార్య స్టెల్లా ఆస్ట్రేలియాలో మీడియాతో మాట్లాడారు. భర్త రాక కోసం ఉత్కంఠతో ఎదురుచూస్తున్నట్లు ఆమె వెల్లడించారు. న్యాయవాది అయిన ఆమె అశాంతిను 2022లో జైల్లో ఉంటుండగానే అసాంజ్ ను ఆమె పెళ్లాడారు. జూలియన్ అసాంజ్ వెళ్లే చార్టెడ్ విమాన ప్రయాణ ఖర్చు 5 లక్షల డాలర్లని ఆయన అభిమానులు తెలిపారు. ఆ మొత్తాన్ని సేకరించడానికి ఫండ్ రైజింగ్ ప్రచారం మొదలు పెట్టామన్నారు. ఇదిలా ఉంటే జూలియన్ అసాంజ్ విడుదలను వికీలీక్స్ సంస్థ ధృవీకరించింది. ఈ మేరకు సామాజిక వేదిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. 1901 రోజుల జైలు జీవితం అనంతరం ఆయన జూన్ 24న విడుదలయ్యారు. జూలియన్ అసాంజ్ విడుదల కోసం ప్రపంచ వ్యాప్తంగా మద్దతు ఇచ్చిన వారికి వికీలీక్స్ సంస్థ కృతజ్ఞతలను తెలియజేసింది. 2006లో జూలియన్ అసాంజ్ స్థాపించిన వికీ లీక్స్ దేశ చరిత్రలోనే అతిపెద్ద రహస్య పత్రాల వెల్లడికి పాల్పడిందని అమెరికా ఆరోపించింది. ఈ లీక్స్ దాదాపు కోటికిపైగా రహస్య పత్రాలను ప్రచురించింది. అమెరికా మిలటరీ హెలికాప్టర్ నుంచి తీసిన ఒక వీడియోను 2017 వెబ్సైట్ బయటపెట్టింది. ఈ హెలికాప్టర్ వీడియో బాగ్దాద్ లో ఇద్దరు రైటర్ వార్తా సంస్థ రిపోర్టర్లు సహా డజన్ కిపైగా ఇరాకీ పౌరులను చంపినట్లు చూపించింది. జూలియన్ అసాంజ్ అత్యంత నమ్మకమైన సహచరుల్లో ఒకరైన యూఎస్ ఆర్మీ ఇంటెలిజెన్స్ అనలిస్టు సెల్సియ మార్నింగ్ కు 35 సంవత్సరాలు జైలు శిక్ష పడింది. అయితే, 2017లో ఒబామా ప్రభుత్వం ఆ శిక్షను కుదించింది. సుదీర్ఘ న్యాయ పోరాటాల నడుము కూడా ఆయన చాలా అరుదుగా బయట కనిపించారు. 2021లో జైల్లో ఉండగా ఆయనకు ఆరోగ్య సమస్యలు ఎదురయ్యాయి.