Kyrgyzstan: కిర్గిస్థాన్‌లో గొడవలకు కారణమేంటి, భారత్ పాక్ విద్యార్థులనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు?
Kyrgyzstan Row: కిర్గిస్థాన్‌లో భారత్, పాకిస్థాన్ విద్యార్థులనే టార్గెట్‌గా చేసుకుని దాడులు చేస్తుండడం ఒక్కసారిగా అలజడి సృష్టించింది.
![Kyrgyzstan: కిర్గిస్థాన్‌లో గొడవలకు కారణమేంటి, భారత్ పాక్ విద్యార్థులనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? Why Indian Pakistani students were targeted in Kyrgyzstan Kyrgyzstan: కిర్గిస్థాన్‌లో గొడవలకు కారణమేంటి, భారత్ పాక్ విద్యార్థులనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/19/a85ebb4ff516bcc21d7d209ce99e9db21716103801229517_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Kyrgyzstan News: కిర్గిస్థాన్‌లో విదేశీ విద్యార్థులపై దాడులు (Kyrgyzstan Attacks) జరగడం సంచలనం సృష్టించింది. ఆ దాడులకు సంబంధించిన వీడియోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పాకిస్థాన్, బంగ్లాదేశ్‌తో పాటు భారత్ విద్యార్థులు అక్కడి యూనివర్సిటీల్లో చదువుతున్నారు. భారత్‌తో పాటు పాకిస్థాన్ వెంటనే అప్రమత్తమయ్యాయి. భారత్ అక్కడి విద్యార్థులకు మార్గదర్శకాలు జారీ చేసింది. ఎవరూ బయటకు రావద్దని సూచించింది. ఏమైనా అవసరం ఉంటే ఎంబసీని సంప్రదించాలని వెల్లడించింది. విదేశాంగ మంత్రి జైశంకర్ అక్కడి పరిస్థితులపై స్పందించారు. భారతీయ విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు. అయితే..కిర్గిస్థాన్‌లోని భద్రతా బలగాలు మాత్రం పరిస్థితులు అదుపులోకి వచ్చాయని చెబుతున్నాయి. కొంత మంది పాకిస్థానీ విద్యార్థులపై దాడులు జరగడం వల్ల దాయాది దేశం అలెర్ట్ అయింది. ఈ విద్యార్థులున్న హాస్టల్స్ వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. బాధితులకు కచ్చితంగా సహకరిస్తామని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ హామీ ఇచ్చారు. దాడుల్లో ముగ్గురు పాకిస్థానీలు మృతి చెందడం పట్ల విచారం వ్యక్తం చేశారు. అయితే...కిర్గిజ్‌స్థాన్ ప్రభుత్వం ఇదంతా అవాస్తవం అని, ఎవరూ ప్రాణాలు కోల్పోలేదని వాదిస్తోంది. అటు పాక్ కూడా ఇప్పటి వరకూ ఎలాంటి అధికారిక సమాచారం అందలేదని, కానీ అక్కడి పరిస్థితులను సమీక్షిస్తున్నామని వెల్లడించింది.
ఎందుకీ దాడులు..?
అసలు విదేశీ విద్యార్థులపై దాడులు ఎందుకు (Kyrgyzstan Row) జరుగుతున్నాయన్నదే పెద్ద ప్రశ్నగా మారింది. స్థానిక మీడియా కథనాలు ప్రకారం చూస్తే కిర్గిజ్, ఈజిప్ట్ విద్యార్థుల మధ్య జరిగిన గొడవలే ఇంత వరకూ తీసుకొచ్చాయి. మే 13న ఈ రెండు వర్గాల మధ్య గొడవలు జరిగాయి. విదేశీ విద్యార్థులపై స్థానికులు దారుణంగా దాడి చేసినట్టు స్థానికులు వెల్లడించారు. ఈ గొడవలు జరగడానికి ఓ కారణముంది. కొంత మంది కిర్గిజ్ విద్యార్థులు పాకిస్థాన్, ఈజిప్ట్‌కి చెందిన యువతులను వేధించారు. అక్కడి నుంచే ఘర్షణలు మొదలయ్యాయి. పాకిస్థాన్, ఈజిప్ట్‌కి చెందిన విద్యార్థులు స్థానిక విద్యార్థులతో గొడవకు దిగారు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవడం వల్ల మరికొంత మంది కిర్గిజ్ విద్యార్థులు రోడ్లపైకి వచ్చారు. విదేశీ విద్యార్థులపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. ఆ తరవాత విదేశీ విద్యార్థులున్న హాస్టల్స్‌ని టార్గెట్ చేశారు. అక్కడి నుంచి ఈ గొడవలు తీవ్రతరమయ్యాయి. గదుల్లో ఉన్న వాళ్లని లాక్కొచ్చి మరీ కొట్టారు. ఈ దాడుల్లోనే ముగ్గురు చనిపోయారన్న వార్తలు వస్తున్నాయి.
అయితే ఇప్పటి వరకూ ఇందుకు సంబంధించిన అధికారిక వివరాలు మాత్రం వెల్లడి కాలేదు. అంతా అదుపులోనే ఉందని ప్రభుత్వం చెబుతున్నా అక్కడి భారత్, పాకిస్థాన్ విద్యార్థుల మాత్రం (Indian Students in Kyrgyzstan) వణికిపోతున్నారు. Bishkek లోని మెడికల్ యూనివర్సిటీలకు మంచి డిమాండ్ ఉంది. అందుకే అక్కడికి భారత్ విద్యార్థులు ఎక్కువగా వెళ్తుంటారు. ఇప్పుడక్కడా పరిస్థితులు గందరగోళంగా ఉన్నాయి. కొంత మంది కిర్గిజ్ విద్యార్థుల కంటపడకుండా దాక్కుంటున్నారు. సాయం చేయాలంటూ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)