DESAM Asking : వైద్య విద్యలో ఉక్రెయిన్ కంటే తీసిపోయామా? తప్పు ఎక్కడ జరుగుతోంది ?
మన దేశంలో లేనిది ఉక్రెయిన్‌లో ఉన్నదేమిటి ? ఒక్క మన దేశ విద్యార్థులకే 20 వేల మెడిసిన్ సీట్లు ఉక్రెయిన్ ఇవ్వగలిగిందా ? మరి మనం ఎందుకు ఇవ్వలేకపోతున్నాం ? తప్పుడు ఎక్కడ జరుగుతోంది ? "దేశం" అడుగుతోంది !
" యాన్ ఇన్వెస్ట్‌మెంట్ ఇన్ నాలెడ్జ్ పేస్ ద బెస్ట్ డివిడెండ్స్ "
చదువుపై పెట్టుబడి ఎంత లాభదాయకమో ప్రఖ్యాత రచయిత బెంజిమిన్ ఫ్రాంక్లిన్ ఈ ఒక్క మాటతో ప్రపంచం మొత్తానికి అర్థమయ్యేలా చెప్పారు. బెంజిమిన్ ఫ్రాంక్లిన్ ఆ మాట చెప్పేటప్పటికీ ఈ అంశంపై సందేహాలుండవచ్చేమో కానీ ఇప్పుడు మాత్రం వందకు వంద శాతం దీన్ని అంగీకరిస్తారు. మన దేశంలోనూ ఏకీభవిస్తారు. కానీ ఆచరిస్తున్నామా ? అంగీకరించడం వేరు... ఆచరించడం వేరు. రెండూ కలిసి జరిగినప్పుడే ప్రయోజనం ఉంటుంది. దురదృష్టవశాత్తూ భారత్‌లో ఆచరణే ఉండటం లేదు. అలా ఉంటే ఇప్పుడు భారతీయు విద్యార్థులు ఉక్రెయిన్ లాంటి దేశాల్లో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కు బిక్కు మంటూ గడపాల్సిన పరిస్థితి రాదు. స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలకు దశాబ్దాలు గడిచిపోతున్నాయి. కానీ వైద్య విద్య ఇంకా అందని ద్రాక్షలాగే ఉండిపోతోంది.
ఉక్రెయిన్ నుంచి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వస్తున్న భారత విద్యార్థులు !
రెండు వారాల క్రితం నుంచి రష్యా - ఉక్రెయిన్ మధ్య యుద్ధ మేఘాలు ఉన్నాయి. వారం నుంచి ఒకటే బాంబుల మోత. దేశం కోసం ఆయుధాలు చేతపట్టి ప్రతి ఒక్కరూ ఓ సైనికుడైన పరిస్థితి ఆ దేశంలో కనిపిస్తోంది. అది వారి సొంత గడ్డ. చావో రేవో తేల్చుకోవాలి. కానీ మన బిడ్డలు అక్కడ ఇరుక్కుపోయారు. ఒకరు కాదు.., ఇద్దరు కాదు ఇరవై వేల మంది. అందరూ విద్యార్థులే. అదీ కూడా అందరూ వైద్య విద్య చదవడం కోసమే వెళ్లారు. యుక్రెయిన్ ఏమీ అభివృద్ధి చెందిన దేశం కాదు.. జీవన ప్రమాణాలు విద్యా ప్రమాణాలు అంత గొప్పగా ఉన్న దేశం కూడా కాదు. అయినా అక్కడకి ఎందుకూ అంటే ... మరో దారి లేక..! ఇండియాలో చదువు "కొనలేక"... కల నెరవేర్చుకునే దారి కోసం వెదుక్కుని మరీ అక్కడకు వెళ్లారు. ఇండియాలో లేనిది ఉక్రెయిన్‌లో ఏముంది ? అంత మంది వైద్యులను ఉక్రెయిన్ తయారు చేస్తుందా ?
ఉక్రెయిన్ భారత్‌తో పోలిస్తే పేద దేశమే.. అయినా !
ఇండియా నుంచి బయటదేశాల్లో మెడిసిన్ చేసే దేశాల్లో ముందు ఉండేవి ఫిలిప్పీన్స్, యుక్రెయిన్, చైనా.. .ఇక్కడ బాగా అభివృద్ధి చెందిన దేశాల కంటే... ఫీజులు తక్కువ . బాగా అభివృద్ధి చెందని దేశాల కంటే...ప్రమాణాలు ఎక్కువ. సరిగ్గా చెప్పాలంటే.. ఇండియన్ మిడిల్ క్లాస్ మెంటాలిటీకి సరిగ్గా సూట్ అయ్యే ... టిపికల్ దేశాలు ఇవి. చాన్నాళ్లుగా మన వాళ్లు చదువుకోసం యుక్రెయిన్ వెళుతున్నారు. ఇప్పుడు యుద్ధం తరుముతుండటంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సరిహద్దులు దాటుతున్నారు. ఇవాళ ప్రాణాలు మీదకు వచ్చి... సరహద్దులు దాటాల్సిన పరిస్థితి వాళ్లకు ఎందుకు వచ్చింది...? ఎందుకు యుక్రెయిన్ వెళ్లి చదువుతున్నారు. ఇవాళ యుక్రెయిన్ లో భారతీయ విద్యార్థులు పడుతున్న అవస్థులు చూశాక.. యుక్రెయిన్ కంటే.. ఎంతో కొంత అభివృద్ధిలో ముందున్న భారత్.. ఎందుకు వైద్య విద్యావకాశాలు కల్పించలేకపోతోందనే మౌలిక మైన ప్రశ్న వస్తోంది.
వైద్య విద్యలో పాలకులు పెట్టుబడి పెట్టకపోవడంతోనే సమస్యలు !
ఓ చిన్న లెక్క చెప్పుకుందాం..
కిందటేడాది దేశంలో మెడికల్ ఎంట్రన్స్ పరీక్ష నీట్ రాసిన వాళ్లు 16లక్షల 14వేల మంది. మన దగ్గర ఉన్న సీట్లు 83వేలు. నమ్మశక్యం కాకపోయినా ఇది నిజం. 130 కోట్ల మంది జనాభాలకు ఏటా మన దేశంలో సిద్ధమయ్యే వైద్యులు కేవలం 80వేల లోపే. ఇంత పెద్ద దేశంలో ఉన్న మెడికల్ కాలేజీలు 590. ఇక్కడ కాలేజీలs కాదు సీట్లు కూడా సమస్యే. మెడికల్ ఎంట్రన్స్ కు హాజరవుతున్న వారిలో కేవలం 5శాతం మంది సెలక్ట్ అవుతున్నారు. 16లక్షల మందికిపైగా పరీక్ష రాస్తే.. అందులో కనీసం లక్ష మంది కూడా సెలక్ట్ కాకపోతే.. మరి మిగతా 15లక్షల మంది ఎక్కుడకు వెళతారు..? MBBS ఒక్కటే కాదు.. పై చదువులకు కూడా అవకాశం అంతంతమాత్రమే . గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక.. మెడికల్ పీజీకి మన దగ్గర ఉన్న సీట్లు 6వేల మాత్రమే. అంటే.. కేవలం 8శాతం మందికి మాత్రమే పీజీ చదివే వెసులుబాటు ఉంది. మరి ఎక్కువ సీట్లు కేటాయించలేకపోవడానికి మన దగ్గర ఏమైనా లెక్కకు మించి డాక్టర్లు ఉన్నారా.. .అంటే లేదు. ఇండియాలో ప్రతి 11000 మందికి ఒక ప్రభుత్వ డాక్టర్ ఉన్నారు. ప్రభుత్వం తరుపున అందుతున్న వైద్య సేవలు, సదుపాయాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలిపే కొలమానం అది..! అందుకే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గవర్నింగ్ బాడీలో పనిచేసిన ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ దేవీ షెట్టి ఒక సారి చెప్పారు. " భారత్ ఏడాదికి కనీసం 10లక్షల మంది మెడికల్ గ్రాడ్యుయేట్లను అందించాల్సి ఉందని.". కానీ ఎక్కడా ఏమీ లేవు.
పరిమితంగా ఉన్న సీట్లలోనే ఎంత ప్రతిభ ఉన్నా సవాలక్ష అడ్డంకులు
దేశంలో మెడికల్ సీట్లే కాదు.. సుదీర్ఘంగా చర్చించాల్సిన మౌలిక సమస్యలూ ఉన్నాయి. అదేమిటంటే ఫీజులు.. రిజర్వేషన్లు. అందరికీ సీట్లు అందివ్వలేని మన వ్యవస్థ .. ప్రేవైటు మెడికల్ కాలేజీల్లో సీట్లు కొనుక్కోలేని వారి అవస్థ విద్యార్థులను వేధిస్తూ ఉంటుంది. భారత్‌లో ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో సీట్ల సంఖ్య చాలా తక్కువ. టాప్ 1000 ర్యాంక్ సాధించినా సొంత రాష్ట్రంలో సీట్ సంపాదించడం కష్టం. దేశంలోనే అత్యున్నత సంస్థ AIMS లాంటి వాటిలో అండర్ గ్రాడ్యుయేట్ సీట్లు ఉండేది 70 మాత్రమే. పోనీ ప్రైవేటు కాలేజీల్లో ఉంటుందా అంటే.. అక్కడ ఎగువ మధ్య తరగతి వాడు కూడా భరించలేడు. ప్రభుత్వ కళాశాలలో పేమెంట్ సీటుకే దాదాపు 7లక్షలు ఖర్చు అవుతోంది. ఇక ప్రైవేటు కళాశాలలో మెడికల్ సీట్ సాధించాలంటే.. మనం కోటీశ్వరులం అయితేనే సాధ్యం. లేకపోతే ఆ ఆశలు వదులుకోవాలి. ఎందుకంటే.. కాలేజీని బట్టి మెడికల్ సీటు రేటు... రూ. 60 లక్షల నుంచి కోటి వరకూ ఉంది. పీజీకి ఇంకా ఎక్కువ . మరి ఇంత డబ్బు పెట్టి ఎవరు చదివించగలరు..? అందుకే అంతా.. యుక్రెయిన్, ఫిలిప్పీన్స్ అని చూస్తున్నారు. అక్కడ మెడికల్ పూర్తి చేయడానికి అయ్యే ఖర్చు.. 12 నుంచి 30లక్షలు. రేటు తక్కువ అని మాత్రమే కాదు. నిజంగా డబ్బులు పెట్టగలిగే వారికి కూడా సీట్లు అందుబాటులో లేవు. ఇండియాలో మెడికల్ సీటుకు ఎమ్మెల్యే సీటు కన్నా డిమాండ్ ఉంది. ఎంత ప్రతిభ ఉన్నా.. రిజర్వేషన్ సిస్టమ్ వల్ల తమకు సీట్లు రాలేదని చాలా మంది వెళ్లిపోయారు. యుక్రెయిన్ లో బాంబు దాడిలో చనిపోయిన కర్ణాటక విద్యార్థి తండ్రి మాట ఓ సారి వింటే..అర్థం అవుతుంది. తన కొడకుకి 96శాతం మార్కులు వచ్చినా సీటు రాలేదని... అందుకే యుక్రెయిన్ పంపాం అంటారు.. అందుకే ఈ విద్యార్థి వలస.
ఫారిన్ చదువుపై మోజు పెంచుకుంటున్న భారతీయ విద్యార్థులు
యుక్రెయిన్ లో ఉన్న భారతీయ విద్యార్థులు 18వేల మంది. ఇందులో 99శాతం మెడికల్ స్టూడెంట్లే ఉంటారు. అసలు వివిధ దేశాల్లో చదవుల కోసం ఉంటున్న భారతీయ విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా.. ? అక్షరాల 11లక్షల ౩౩వేల 749. విదేశాంగ శాఖ పార్లమెంట్‌లో ఇచ్చిన సమాధానం ఇది. ఇంజనీరింగ్, ఐటీ కోసం ఎక్కువుగా యు.ఎస్. కెనడా, యుకె. ఆస్ట్రేలియా వెళుతున్నారు. మెడికల్ కోసం అయితే మాత్రం అందరూ చూసేది.. ఎక్కువుగా యుక్రెయిన్, ఫిలిప్పీన్స్, చెనా.. యుక్రెయిన్‌లో 18వేల మంది ఉంటే.. చైనాలో 23వేలు, ఫిలిప్పీన్స్ లో 15వేల మంది భారతీయ విద్యార్థులున్నారు. వీళ్లంతా కూడా భారత్‌లో సీట్లు రాక.. వైద్య విద్యను అభ్యసించడం కోసం బయటకు వెళ్లిన వాళ్లే.. అయితే ఈ దేశాల్లో వైద్యం చదివిన వాళ్లు ...ఇండియాలో ప్రాక్టీస్ చేయడం అంత తేలిక కాదు. దానికోసం వాళ్లు అత్యంత కఠిన మైన ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్‌ను -FMGE నెగ్గాల్సి ఉంటుంది. విదేశీ విద్యార్థుల్లో కేవలం నాలుగోవంతు మాత్రమే సక్సెస్ అవుతారు. అయినా దేశాలు దాటి వెళ్తున్నారు.
విద్య ప్రాముఖ్యాన్ని గుర్తించి మౌలిక సదుపాయాలు పెంచాలి !
ఇంత సమస్య ఉన్నా.... ఈ ప్రభుత్వాలు సమస్యలు తీర్చాయా అంటే.. లేవు. ప్రతి పనిలో కాంగ్రెస్ పార్టీ పుట్టు పూర్వోత్తరాలు దగ్గర నుంచి విమర్శించే బీజేపీ ప్రభుత్వం కూడా 8 ఏళ్లు అవుతోంది. వీళ్లు వచ్చాక.. కాలేజీల సంఖ్య, సీట్ల సంఖ్య పెంచడంలో అప్పటి కంటే వేగం ఉంది కానీ.. అది మన అవసరాలకు సరిపోయేంత కాదు.. ఇండియన్ మెడికల్ రిజిస్ట్రీలో 14 లక్షల మంది డాక్టర్లు ఉన్నట్లుగా చెబుతున్నారు. కానీ ఈ సంఖ్యపై చాలా అనుమానాలున్నాయి. 50-60ఏళ్ల కింద రిజిస్టర్ చేసుకున్న వాళ్ల పేర్లు అలాగే ఉన్నాయి. 30 ఏళ్ల క్రితమే చనిపోయిన వారు కూడా ఉన్నారు. చాలామంది వృద్ధులై పనిచేయడం లేదు. కొంతమంది ఇతర దేశాలకు వెళ్లిపోయారు. దేశంలో 10లక్షల మంది వైద్యులు ఉంటారని అంచనా.. మన జనాభా దాదాపు 140కోట్లకు చేరింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ప్రతి వెయ్యి మందికీ ఒక వైద్యుడు ఉండాలి.. అది మినిమం మాత్రమే. చాలా దేశాల్లో వెయ్యికి ఇద్దరు ముగ్గురు కూడా ఉంటారు. కానీ మన దేశంలో డాక్టర్ పేషెంట్ రేషియో 0.7:1000మనకు ప్రపంచంలోనే ఎక్కువ సంఖ్యలో మెడికల్ కాలేజీలున్నాయి. కానీ సీట్లు లేవు. ప్రతి ఏటా 83వేల మంది వైద్య కోర్సుల్లో చేరుతున్నారు. 75శాతం పాస్ పర్సెంట్ రేట్ ఉంటోంది.. అంటే బయటకు వచ్చేవాళ్లు 5౩వేల మంది ఉంటారు. కానీ ప్రతి ఏటా మన జనాభా కోటీ ౩౦లక్షల మంది పెరుగుతున్నారు. ఇంకో పదేళ్ల పాటు.. మెడికల్ కాలేజీలు ఇదే రీతిలో పెరిగి.. జనాభా అలాగే కొనసాగిన ఆ రేషియో మాత్రం అలాగే ఉంటుంది. అంటే ఇప్పుడున్న దాని కంటే.. చాలా వేగంగా కాలేజీల సంఖ్య పెంచితే కానీ సాధ్యం కాదు.
డాక్టర్లను పెంచడం సమస్యకు పరిష్కరం కాదు. మనం ఇంకా చాలా విషయాల్లో వెనుకబడ్డాం.. మెడికల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ చాలా పూర్.. వెయ్యి మందికి కనీసం మడు బెడ్లు ఉండాలి. ఇప్పుడు ఉన్నది ఒక్కటే.. అసలు మన డాక్టర్లు చదువుతున్న తీరుపై విమర్శలున్నాయి. డాక్టర్లు అంటే పుస్తకాలు పుస్తకాలు చదువుతున్నారు.. అవి జ్ఞాపకశక్తి పరీక్షల్లా ఉంటాయ్ తప్ప... ప్రతిభా పరీక్షల్లా లేవు అని.. అంటే.. వాళ్ల పుస్తకాల నాలెడ్జ్ పరీక్షించే పరీక్షలే ఉన్నాయి. నీట్ అంటే ఓకే. కనీసం పీజీ లో అయినా వాళ్ల వైద్య సామర్థ్యాన్ని చూడాలి కదా.. అదీ లేదు. విదేశాల్లో ఇలా లేదు .ఇలా చెప్పుకుంటూ వెళితే ఇంకా చాలా సమస్యలున్నాయి. ఇప్పుడు యుక్రెయిన్ వచ్చిందనే కాదు.. కరోనా సెకండ్ వేవ్‌లో దేశం ఎలా అల్లాడి పోయిందో చూశాం కదా.. తగినంత మెడికల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్, డాక్టర్లు లేకపోవడం వల్లే కదా ఈ పరిస్థితి. ఇవాళ యుక్రెయిన్లో జరుగుతున్న దాన్ని చూసిన తర్వాత అయినా మనం కళ్లు తెరవాలి కదా.. దేశమంతా ఇబ్బందులు పడుతోంది..!
ఇప్పటికైనా కళ్లు తెరవాలి. విద్యపై ఇన్వెస్ట్ మెంట్ పెంచాలి. మెడికల్ మాత్రమే కాదు విద్యా వ్యవస్థలోనే మార్పులు రావాలి. అందుకే దేశానికి మంచి డివిడెండ్స్ అందుతాయ. ఇదే దేశం అడుగుతోంది.. "ఏబీపీ దేశం" అడుగుతోంది..!