Gali Janardhan Reddy: కానిస్టేబుల్ కొడుకే మైనింగ్ డాన్ - డబ్బుతో రాజకీయం - ఆడంబర లైఫ్ స్టైల్ - గాలి జనార్ధన్ రెడ్డి గురించి తెలుసా?
Mining Don: కర్ణాటకలో ఒకప్పుడు ఓ మంత్రి ఉదయం టిఫిన్ చేసి హెలికాఫ్టర్ లో సచివాలయానికి వెళ్తారు. మళ్లీ హెలికాప్టర్‌లో లంచ్ కోసం ఇంటికి వస్తారు. అది ఆయన సొంత హెలికాఫ్టర్. ఆయనే గాలి జనార్దన్ రెడ్డి

Who is Gali Janardhan Reddy : ఓబుళాపురం మైనింగ్ కేసులో గాలి జనార్ధన్ రెడ్డికి ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తూ సీబీఐ కోర్టు తీర్పు చెప్పింది. దీంతో అసలు ఈ గాలి జనార్ధన్ రెడ్డి ఎవరు అన్న ఆసక్తి అందరిలో ఏర్పడింది. ఆయన పుట్టుకతో శ్రీమంతుడు కాదు.. ఆయన కేవలం ఓ ఓ సాధారణ పోలీస్ కానిస్టేబుల్ కొడుకు. ఆయన తండ్రి చిత్తూరు జిల్లా నుంచి బళ్లారికి వలస వెళ్లారు.
చిట్ ఫండ్ సంస్థ ఓనర్ - అక్రమాలతో మూతేయించిన ఆర్బీై
బుళాపురం మైనింగ్ కంపెనీ పేరుతో మైనింగ్ వ్యాపారం ప్రారంభించకముందు, కోల్‌కతాలోని ఓ కంపెనీ కోసం గాలి జనార్ధన్ రెడ్డి ఇన్సూరెన్స్ పాలసీలు విక్రయించే వారు. ఆ తర్వాత చిట్‌ఫండ్ సంస్థను ప్రారంభించారు. అందులో ఆయన అక్రమాలకు పాల్పడటంతో రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) చర్యలతో దీన్ని మూసేశారు. అయితే అక్కడే ఆయనకు చాలా కిటుకులు తెలిశాయి. వ్యాపారాల్లో, రాజకీయాల్లో జనార్దన్ రెడ్డి సరికొత్త మార్గాలను అన్వేషించారు.
మైనింగ్ లోకి రాక !
ఇన్సూరెన్స్, చిట్ ఫండ్ కంపెనీలు కలసి రాకపోడంతో మైనింగ్ లోకి వచ్చారు. అనంతపురం జిల్లాలో ఓబులాపురం మైనింగ్ కంపెనీ (OMC) ని స్థాపించి ఇనుము గనుల తవ్వకంలోకి దిగాడు. ఈ కంపెనీ అతన్ని దక్షిణ భారతదేశంలో అతిపెద్ద మైనింగ్ వ్యాపారవేత్తగా నిలబెట్టింది. అతని వ్యాపారం బళ్లారి (కర్ణాటక) ఓబులాపురం (ఆంధ్రప్రదేశ్) ప్రాంతాలలో విస్తరించింది. మొదటగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి సాయంతో తన ఓఎంసీ కంపెనీకి మైనింగ్ లైసెన్సులు పొందారు. అధికారం అండతో చెలరేగిపోయారు.
రాజకీయంగా బీజేపీలో కీలక పాత్ర!
మైనింగ్ లో బాగా డబ్బు సంపాదించడంతో ఆయన బీజేపీలో చేరారు. 1999లో సోనియాగాంధీ బళ్లారి నుంచి పోటీ చేశారు. ఆమెపై సుష్మస్వరాజ్ పోటీ చేశారు. ఆ సమయంలోనే గాలి జనార్దన్ రెడ్డి పేరు వెలుగులోకి వచ్చింది. సుష్మస్వారాజ్ గెలుపు కోసం గాలి జనార్ధన్ రెడ్డి కష్టపడ్డారు. బీభత్సంగా ఖర్చు పెట్టారు. సుష్మా స్వరాజ్ బళ్లారికి వచ్చినప్పుడు జనార్దన్ రెడ్డి ఇంట్లో జరిగే వరమహాలక్ష్మి పూజకి కచ్చితంగా హాజరయ్యేవారు. అదే సమయంలో 1999 నుంచి 2012 మధ్య కాలంలో రెడ్డి సోదరులు – జనార్దన్ , సోమశేఖర్, వారి పెద్దన్న కరుణాకర్ రెడ్డి మైనింగ్‌లో బడా వ్యాపారులుగా ఎదిగారు.
ఏదైనా లగ్జరీ
గాలి జనార్ధన్ రెడ్డి ఏదైనా చేస్తే కోట్లు ఖర్చు పెడతారు. సీబీఐ,ఈడీ ఆస్తులు జప్తు చేసిన తర్వాత కూడా ఆయన తన కుమార్తె పెళ్లిని దేశం మొత్తం ఆశ్చర్యపోయేలా చేశారు. తన కుమారుడ్ని హీరోగా పెట్టి సినిమాలు తీస్తున్నారు. ప్రస్తుతం ఆయన బీజేపీ నేతగా ఉన్నారు. 2024 మార్చి 25న తాను సొంతంగా పెట్టుకున్న పార్టీని BJPలో విలీనం చేసి మళ్లీ BJPలో చేరాడు. : బళ్లారి జిల్లాలో BJP అధ్యక్షుడిగా పనిచేసిన జనార్ధన్ రెడ్డి, కర్ణాటక రాజకీయాలలో గణనీయమైన ప్రభావం చూపాడు.




















