Obulapuram mining case: ఓబులాపురం మైనింగ్ కేసు ఓ సంచలనం - అసలా కేసు ఏంటి ? ఎంత మైనింగ్ చేశారు? పూర్తి వివరాలు
Obulapuram: ఏపీ రాజకీయాల్లో ఓబులాపురం మైనింగ్ కేసుకు ఓ ప్రత్యేకత ఉంది. ఈ కేసులో గాలి జనార్ధన్ రెడ్డితో పాటు ఐదుగురికి ఏడేళ్ల శిక్ష పడింది. అసలు ఈ కేసేంటి ?

What is Obulapuram mining case : ఓబులాపురం మైనింగ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపిన అక్రమ మైనింగ్ కుంభకోణం. అనంతపురం జిల్లాలోని ఓబులాపురం ప్రాంతంలో జరిగిన ఇనుము గనుల అక్రమ తవ్వకాలకు సంబంధించిన కేసు. ఈ కేసు రాజకీయ, ఆర్థిక, పర్యావరణ సమస్యలను లేవనెత్తింది. దేశం దృష్టిని ఆకర్షించింది.
ఓబులాపురం ఆంధ్రప్రదేశ్-కర్ణాటక సరిహద్దు లో ఉంటుంది. గాలి జనార్దన్ రెడ్డి ఓబులాపురం మైనింగ్ కంపెనీ అని పేరు పెట్టి అక్కడ మైనింగ్ చేశారు. రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలతో పాటు .. అనుమతి లేని ప్రాంతాలలో అక్రమ ఇనుము గనుల తవ్వకం, లైసెన్స్ ఉల్లంఘనలు, పర్యావరణ నష్టం వంటి వాటికి పాల్పడ్డారు. ఈ కేసు 2000ల చివరలో బయటపడింది, మరియు సీబీఐ 2010లో దర్యాప్తు ప్రారంభించింది. అప్పట్లో ప్రభుత్వాలు పట్టించుకోలేదు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ విచారణ చేపట్టింది.
సీబీఐ దర్యాప్తులో OMC లైసెన్స్‌లో నిర్దేశించిన ప్రాంతాలకు మించి, రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలలో ఇనుము గనులను తవ్విందని నిర్దారించింది. ఇది పర్యావరణ నష్టానికి దారితీసింది. గాలి జనార్దన్ రెడ్డి రాజకీయ ప్రభావాన్ని ఉపయోగించి, అక్రమంగా మైనింగ్ లైసెన్స్‌లను పొందినట్లు సీబీఐ తేల్చింది. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు , మంత్రులు OMCకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవడానికి లంచాలు తీసుకున్నారని సీబీఐ ఆరోపించింది. అయితే ఇప్పుడు ఈ కేసులో మంత్రిగా ఉన్న సబితా ఇంద్రారెడ్డి, ఐఏఎస్ అధికారి కృపానందం నిర్దోషులుగా బయట పడ్డారు. మరో అధికారి రాజగోపాల్ నిందితుడిగా ఏడేళ్ల జైలు శిక్షకు గుర్యయారు.
అక్రమ మైనింగ్ ద్వారా ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లుగా తేల్చారు. ఆంధ్రప్రదేశ్-కర్ణాటక సరిహద్దులోని గనుల స్థానం గురించి తప్పుడు సమాచారం అందించి, అక్రమ తవ్వకాలు జరిపినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కారణంగా సరిహద్దులు కూడా చెరిగిపోయాయి. 2010లో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ ఈ కేసును చేపట్టింది. 219 మంది సాక్షులను విచారించి, 3337 పత్రాలను పరిశీలించింది. 2011లో గాలి జనార్దన్ రెడ్డి , ఐఏఎస్ ఎర్ర శ్రీలక్ష్మిని సీబీఐ అరెస్టు చేసింది. ఇతర నిందితులు కూడా వివిధ దశలలో అరెస్టయ్యారు. హైదరాబాద్‌లోని సీబీఐ ప్రత్యేక కోర్టులో కేసు విచారణ 13 సంవత్సరాలకు పైగా కొనసాగింది. ఇటీవల సుప్రీంకోర్టు విచారణను పర్యవేక్షించింది. 2025 మే నాటికి తీర్పు పూర్తి చేయాలని గడువు విధించింది. ఈ ప్రకారం సీబీఐ కోర్టు తీర్పు చెప్పింది.
ఈ కేసు ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటక రాజకీయాలో కీలక పాత్ర పోషించింది. గాలి జనార్దన్ రెడ్డి బీజేపీకి చెందిన మాజీ మంత్రి. అయితే కాంగ్రెస్ కు చెందిన వైఎస్ రాజశేఖర్ రెడ్డితో సన్నిహితంగా ఉండేవారు. 2007లో ఓబులాపురం అక్రమ మైనింగ్‌ను పరిశీలించేందుకు వెళ్లిన టీడీపీ నాయకుల పై అప్పటి వైఎస్ రాజశే ఖర్ రెడ్డి ప్రభుత్వం అక్రమ కేసు నమోదు చేసింది. ఈ కేసును 2025లో విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టు కొట్టివేసింది.





















