Heat Stroke: వడదెబ్బతో స్పృహ కోల్పోయిన వ్యక్తికి నీళ్లు తాగించకండి - కేంద్ర ఆరోగ్య శాఖ కీలక సూచన
Heat Stroke: వడదెబ్బ తగిలి స్పృహ కోల్పోయిన వ్యక్తికి బలవంతంగా నీళ్లు తాగిస్తే ప్రాణాలకే ప్రమాదమని కేంద్ర ఆరోగ్య శాఖ హెచ్చరించింది.
Heat Stroke Prevention: వడదెబ్బ తగిలితే ఎలాంటి జాగ్రత్తలు (Heatstroke Prevention Tips) తీసుకోవాలో కేంద్ర ఆరోగ్య శాఖ ఓ ప్రకటన చేసింది. ఆ సమయంలో చేయకూడనివి ఏంటో కూడా వివరించింది. వడదెబ్బ తగిలి స్పృహ కోల్పోయిన వ్యక్తికి చాలా మంది వెంటనే నీళ్లు తాగించే ప్రయత్నం చేస్తారు. ఇది చాలా ప్రమాదకరం అని వెల్లడించింది ఆరోగ్య శాఖ. ఎవరైనా స్పృహలో లేనప్పుడు నీళ్లు తాగించకూడదని స్పష్టం చేసింది. రానున్న రోజుల్లో వడగాలులు తీవ్రతరమయ్యే ప్రమాదముందని, అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించింది.
"వడగాలులు తీవ్రతరమవుతున్నాయి. మనం ముందస్తు జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలి. వడగాలులతో ఎప్పుడైనా మీకు ఇబ్బందిగా అనిపిస్తే వెంటనే రీహైడ్రేట్ అయ్యేందుకు నీళ్లు ఎక్కువగా తీసుకోండి. వదులుగా ఉన్న దుస్తులే వేసుకోండి. వడదెబ్బ తగిలిన వ్యక్తిని వెంటనే చల్లని ప్రదేశానికి తీసుకెళ్లాలి. శరీరం అంతా కోల్డ్ స్పాంజింగ్ చేయాలి. స్పృహలో లేకపోతే మాత్రం బలవంతంగా నీళ్లు తాగించే ప్రయత్నం చేయొద్దు"
- కేంద్ర ఆరోగ్యశాఖ
Heatwaves are here, but we can be prepared! Be heatwave ready with these first aid tips.
— Ministry of Health (@MoHFW_INDIA) May 1, 2024
Let's take care of each other during these sizzling days!
.#BeatTheHeat pic.twitter.com/ouYnTGJhCE
స్పృహ కోల్పోతే ఎందుకు నీళ్లు తాగించకూడదు..?
సాధారణంగా స్పృహలో లేని వ్యక్తి నీళ్లు మింగే స్థితిలో ఉండడు. అలాంటప్పుడు బలవంతంగా నీళ్లు తాగిస్తే అవి నేరుగా కడుపులోకి కాకుండా ఊపిరితిత్తుల్లోకి వెళ్లిపోతాయి. అదే జరిగితే న్యుమోనియా వచ్చే ప్రమాదముంది. శ్వాస తీసుకోవడంలోనూ ఇబ్బంది తలెత్తుతుంది. అంతే కాదు. ఇలాంటి స్థితిలో నీళ్లు తాగిస్తే రక్తనాళాల్లో ఎలక్ట్రోలైట్‌ల అసమతుల్యతకు దారి తీస్తుంది. ఫలితంగా గుండె కొట్టుకునే తీరు మారడంతో పాటు ఫిట్స్ వచ్చే ప్రమాదమూ ఉంది. పైగా ఇలా నోటి ద్వారా నీళ్లు అందించి రీహైడ్రేషన్ చేయాలని చూస్తూ కూర్చుంటే ఫస్ట్ ఎయిడ్ అక్కడితోనే ఆగిపోతుంది. వైద్యం అందించడానికి ఆలస్యమైపోతుంది. ఇది పూర్తిగా ఆ వ్యక్తి స్పృహ కోల్పోయే ప్రమాదానికి దారి తీస్తుంది. వడదెబ్బ తగిలినప్పుడే కాకుండా ఓ వ్యక్తి ఎప్పుడు ఇలా స్పృహ కోల్పోయినా బలవంతంగా నీళ్లు ఇవ్వకూడదని వైద్యులు సూచిస్తున్నారు. స్పృహ కోల్పోయిన వ్యక్తి కోమాలోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. గాలి వెలుతురు ధారాళంగా ఉన్న చోట ఆ వ్యక్తిని ఉంచాలి. తలను నెమ్మదిగా ఓ వైపు వాల్చాలి. ఆ వ్యక్తి శ్వాస తీసుకుంటున్నాడా లేదా అన్నది గమనించాలి. ఏదైనా సమస్య అనిపిస్తే వెంటనే CPR చేయాలి.
గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వడగాలులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇటీవల IMD వెల్లడించిన లెక్కల ప్రకారం దేశంలోనే అత్యధికంగా నంద్యాలలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఉదయం 8 గంటల నుంచే విపరీతంగా ఉక్కపోస్తోంది. సాయంత్రం 7 దాటినా వేడి గాలులు వీస్తూనే ఉన్నాయి.
Also Read: Prajwal Revanna: ప్రజ్వల్ రేవణ్ణకి బ్లూ కార్నర్ నోటీస్, దూకుడు పెంచిన ఇన్వెస్టిగేషన్ టీమ్