Camel Bites Zoo Owner: తలను గట్టిగా కొరికి, దూరంగా లాక్కెళ్లి-జూ ఓనర్‌పై దాడి చేసిన ఒంటె
అమెరికాలోని ఓ జూ ఓనర్‌పై ఒంటె దాడి చేసింది. తలపై గట్టిగా కొరికి 15 అడుగుల దూరం వరకూ లాక్కెళ్లింది.
ఎంతసేపటికీ వదలని ఒంటె..
అమెరికాలోని మిన్నెసొటలోని జూలో ఒంటె జూ ఓనర్ తలను కొరికింది. అలాగే నోటితో పట్టుకుని అతడిని కొద్ది దూరం పాటు లాక్కెళ్లింది. తీవ్ర గాయాలపాలైన బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. ఈ నెల 13వ తేదీన ఈ ఘటన జరిగినట్టు అక్కడి అధికారులు తెలిపారు. బ్లెంకర్ అనే 32 ఏళ్ల వ్యక్తి ఒంటెను సరకు రవాణా కోసం వినియోగించాలని భావించాడు. అందుకోసం అవసరమైన శిక్షణ ఇస్తున్నాడు. అప్పటి వరకూ బాగానే ఉన్న ఒంటె ఒక్కసారిగా అతని తలను గట్టిగా కొరికింది. దాదాపు 15 అడుగుల వరకూ లాక్కెళ్లి పడేసిందని సీబీఎస్ న్యూస్ రిపోర్ట్ వెల్లడించింది. ఒంటె పళ్లు తలపై లోతుగా దిగినట్టు తెలిపింది. ఒంటె దాడి చేయటాన్ని చూసిన ఓ ఉద్యోగి వెంటనే పరిగెత్తుకుని వచ్చి బాధితుడిని కాపాడే ప్రయత్నం చేశాడు. చాలా సేపటి వరకూ ఒంటె బాధితుడి తలను అలాగే కొరికి పట్టుకుంది. చివరకు ఓ ప్లాస్టిక్ వాకింగ్ బోర్డ్ సాయంతో అతని తలను బయటకు తీశాడు. కాపాడటానికి వెళ్లిన వ్యక్తిపైనా ఒంటె దాడి చేసింది. చేతులపైనా, తలపైనా గట్టిగా కొరికింది. ఏదో విధంగా చాలా సేపు పోరాడి ఒంటె దాడి నుంచి తప్పించుకున్నాడా వ్యక్తి.
ప్రాణాపాయం తప్పింది..
బాధితుడుని హెలికాప్టర్ సాయంతో స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ దాడిలో గాయపడిన మరో వ్యక్తి మాత్రం వైద్యం చేయించుకునేందుకు
ఒప్పుకోలేదని పోలీసులు వెల్లడించారు. జూ యాజమాన్యం ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్ చేసింది. "జులై 13న ఈ ఘటన జరిగింది. గాయపడ్డ మాయజమానిని వైద్యులు పరీక్షించారు. చిన్న చిన్న గాయాలతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. చికిత్స చేసిన వైద్యులందరికీ ధన్యవాదాలు" అని పేర్కొంది. ఒంటెకు ఎలాంటి గాయాలు అవలేదని, పూర్తి ఆరోగ్యంగా ఉందని స్పష్టం చేశారు. జూని తెరిచే ఉంచామని, ప్రజలు ఎప్పటిలాగే రావచ్చని ప్రకటించింది. సాధారణంగా ఒంటెలు చాలా ప్రశాంతంగా ఉంటాయి. కానీ అవి ఎప్పుడు ఎలా క్రూరంగా మారతాయో చెప్పలేం. గతంలోనూ అమెరికాలోని ఓ జూలో ఇదే విధంగా ఓ ఒంటె దాడి చేయగా ఇద్దరు మృతి చెందారు.
Also Read: Minister Roja On Pawan Kalyan : రోడ్ల గుంతలకు గత ప్రభుత్వమే కారణం, పవన్ ను చూసి జనం నవ్వుతున్నారు- మంత్రి రోజా