Minister Roja On Pawan Kalyan : రోడ్ల గుంతలకు గత ప్రభుత్వమే కారణం, పవన్ ను చూసి జనం నవ్వుతున్నారు- మంత్రి రోజా
Minister Roja On Pawan Kalyan : బీజేపీతో కలవాల్సిన అవసరం వైసీపీకి లేదని మంత్రి రోజా అన్నారు. రాష్ట్రంలో రోడ్ల దుస్థితికి గత ప్రభుత్వమే కారణమని విమర్శించారు. ప్రజల హృదయాల్లో పవన్ కల్యాణ్ ఎప్పటికీ స్థానం సంపాదించలేరని ఆరోపణలుచేశారు.
Minister Roja On Pawan Kalyan : జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై ఏపీ మంత్రి ఆర్.కె.రోజా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. శుక్రవారం తిరుపతి జిల్లా సచివాలయంలో జరిగిన వైఎస్సార్ వాహనమిత్ర ఆటో, రిక్షా, టాక్సీ, వాహనదారులకు ఆర్థిక సహాయం అందించే కార్యక్రమంలో మంత్రి రోజా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి విశాఖలో ప్రారంభించిన వాహన మిత్ర కార్యక్రమాన్ని వర్చువల్ విధానంలో వీక్షించిన అనంతరం ఎంపీ గురుమూర్తి, జిల్లా కలెక్టర్ వెంకటరమణా రెడ్డి, ఎస్పీ పరమేశ్వర రెడ్డిలతో కలిసి మంత్రి రోజా లబ్ధిదారులకు చెక్ లను అందించారు. ఈ కార్యక్రమంలో మంత్రి రోజా ఆటో కూడా నడిపారు.
రోడ్ల దుస్థితికి గత ప్రభుత్వమే కారణం
ఈ కార్యక్రమం అనంతరం మంత్రి ఆర్.కె.రోజా మీడియాతో మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ ను చూసి జనం నవ్వుకుంటున్నారని విమర్శించారు. పార్టీ పెట్టి ఎన్నికలకు వెళ్లకుండా ఇతర పార్టీలకు ఓట్లేయమని చెప్పిన ఏకైక వ్యక్తి పవన్ కల్యాణ్ అని ఆమె ఎద్దేవా చేశారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు డిజిటల్ క్యాంపెయిన్ చేస్తుండడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రజల హృదయాల్లో పవన్ కల్యాణ్ ఎప్పటికీ స్థానం సంపాదించలేరని ఆమె అన్నారు. పవన్ కల్యాణ్ మాట మీద అసలు నిలబడని వ్యక్తని విమర్శించారు. గత ప్రభుత్వ నాసిరకం పనులే రాష్ట్రంలో రోడ్ల దుస్థితికి కారణమని మంత్రి రోజా విమర్శించారు.
బీజేపీతో కలవాల్సిన అవసరం లేదు
టీడీపీ, బీజేపీలను పవన్ కల్యాణ్ ఎందుకు ప్రశ్నించరని మంత్రి రోజా ప్రశ్నించారు. ప్రధాని మోదీ దేశం కోసం అప్పులు చేయడం లేదా అని ఆమె గుర్తు చేశారు. అప్పులు తెచ్చినా అభివృద్ధి కోసం జగన్ డబ్బులు ఖర్చు పెడుతున్నారన్నారు. జనంలో తిరగని ఒకే ఒక వ్యక్తి పవన్ కల్యాణ్, ఒక కాలు మీదే కాదు, రెండు కాళ్ల మీద కూడా సరిగ్గా పవన్ కల్యాణ్ నిలబడలేరని ఆరోపించారు. ఆకాశాన్ని చూసి ఉమ్మెస్తే అది మనపైనే పడుతుందన్న విషయాన్ని పవన్ కల్యాణ్ గుర్తుపెట్టుకోవాలని రోజా అన్నారు. బీజేపీతో కలవాల్సిన అవసరం వైసీపీకి లేదని, వచ్చే ఎన్నికల్లో సింగిల్ గా పోటీ చేస్తామని మంత్రి ఆర్.కె.రోజా స్పష్టం చేశారు.
జనసేన డిజిటల్ క్యాంపెయిన్
జనసేన పార్టీ గుడ్ మార్నింగ్ సీఎం సార్ అంటూ సోషల్ మీడియాలో క్యాంపెయిన్ చేస్తుంది. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితులకు ఎత్తిచూపిస్తూ రోడ్ల ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో ఆ పార్టీ కార్యకర్తలు పోస్టు చేస్తు్న్నారు. జులై 16 నాటికి రాష్ట్రంలో గుంతల లేని రోడ్లు ఉండాలని గత సమీక్షలో సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. దీనిపై జనసేన పార్టీ డిజిటిల్ క్యాంపెయిన్ చేస్తుంది. రాష్ట్రంలో రోడ్ల తీరు మారలేదని అందుకు ఈ ఫొటోలే నిదర్శనం అని #GoodMorningCMSir అనే యాష్ టాగ్ ట్రెండ్ చేస్తుంది. ఈ క్యాంపెయిన్ పై వైసీపీ నేతలు కౌంటర్లు ఇస్తున్నారు.