US President Joe Biden: తనకు క్యాన్సర్ ఉందన్న అమెరికా అధ్యక్షుడు, వివరణ ఇచ్చిన వైట్‌హౌజ్-ఏం జరిగిందంటే?
US President Joe Biden: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు క్యాన్సర్ ఉందన్న వార్తలు ఇంటర్నేషనల్ మీడియాలో గుప్పుమన్నాయి. ఆయన చేసిన వ్యాఖ్యల్ని తప్పుగా అర్థం చేసుకున్నారని వైట్‌హౌజ్ వివరణ ఇచ్చింది.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు క్యాన్సర్ ఉందా..? రెండు రోజులుగా ఇంటర్నేషనల్ మీడియాలో ఇదే చర్చ జరుగుతోంది. అందుకు కారణం. జో బైడెన్ ఓ సందర్భంగా చేసిన వ్యాఖ్యలే. తనకు క్యాన్సర్ ఉంది అనే అర్థం వచ్చేలా ఆయన చేసిన కామెంట్స్ షాక్‌కు గురి చేశాయి. బైడెన్ క్యాన్సర్‌తో బాధ పడుతున్నారంటూ మీడియాలో వార్తలు వచ్చాయి. ఒక్కసారిగా ఇది వైరల్ అవటం వల్ల వైట్‌హౌజ్ కార్యాలయం రంగంలోకి దిగి వివరణ ఇచ్చింది.
ఆ వ్యాఖ్యల అర్థమేంటి..?
ఓ హెల్త్ అనౌన్స్‌మెంట్ కార్యక్రమానికి హాజరైన జో బైడెన్ గ్లోబల్ వార్మింగ్ గురించి మాట్లాడారు. ఆయిల్ పరిశ్రమలు తీవ్ర స్థాయిలో కర్బన ఉద్గారాలను విడుదల చేస్తున్నాయని అన్నారు. అలాంటి వాతావరణంలోనే తానూ పెరిగానని చెప్పారు. క్లేమాంట్‌లోని డెలవేర్ ప్రాంతంలో తాను ఉండేవాడినని, అక్కడి వాతావరణం చాలా దారుణంగా ఉండేదని అప్పటి రోజులను గుర్తు చేసుకున్నారు. "మా ఇంటికి దగ్గర్లోనే ఆయిల్ రిఫైనరీ యూనిట్లు ఉండేవి. బయట కాసేపు కూడా నడిచే అవకాశం ఉండేది కాదు. మా అమ్మ ఎప్పుడూ మమ్మల్ని ఇంట్లోకి తరుముతూ ఉండేది. మా ఇంటి కిటికీలకు విండ్ షీల్డ్ వైపర్‌లు పెట్టుకునే వాళ్లం. అక్కడ వాతావరణం ఎప్పుడు ఎలా ఉండేదో తెలిసేది కాదు. విండోస్‌కి జిడ్డు పట్టేది. వాటిని వైపర్లతో తుడిచేవాళ్లం. ఇలాంటి వాతావరణంలో ఉన్నాం కాబట్టే క్యాన్సర్‌తో బారిన పడ్డాం. దేశవ్యాప్తంగా చూస్తే డెలవేర్ ప్రాంతంలోనే అత్యధిక క్యాన్సర్ రేట్ ఉంటుంది" అని చెప్పారు జో బైడెన్. ఈ కామెంట్స్ తరవాతే బైడెన్‌కు క్యాన్సర్ ఉందన్న చర్చ మొదలైంది
Did Joe Biden just announce he has cancer?
— RNC Research (@RNCResearch) July 20, 2022
“That’s why I — and so damn many other people I grew up with — have cancer.” pic.twitter.com/lkm7AHJATX
.
వైట్‌హౌజ్ ఆఫీస్ వెంటనే జోక్యం చేసుకుని వివరణ ఇచ్చింది. బైడెన్ తన స్కిన్ క్యాన్సర్ గురించి మాట్లాడారని స్పష్టం చేసింది. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టక ముందు స్కిన్ క్యాన్సర్‌తో బాధ పడ్డారని, కానీ పొరపాటున అది క్యాన్సర్ అన్న ప్రచారం జరుగుతోందని చెప్పింది. ఓ సీనియర్ జర్నలిస్ట్ కూడా ఇందుకు సంబంధించి వివరణ ఇచ్చారు. జో బైడెన్ మెడికల్ రిపోర్ట్‌ని షేర్ చేశారు. బైడెన్ స్కిన్ క్యాన్సర్ ట్రీట్‌మెంట్ తీసుకున్నట్టుగా స్పష్టంగా రాసుంది. ఆ విధంగా ఈ వార్తలకు చెక్ పడింది.