US Gun Culture-అమెరికాలో గన్ కల్చర్ ఎందుకు దారి తప్పుతోంది?
అమెరికాలో పెరిగిపోతున్న గన్ కల్చర్‌తో ఏటా వేలాది ప్రాణాలు బలి అవుతున్నాయి. అగ్రరాజ్యంలో జనాభా కంటే తుపాకులే ఎక్కువగా ఉన్నాయి.
ప్రపంచానికి పెద్దన్న. అగ్రరాజ్యం అనే బిరుదు. అభివృద్ధి చెందిన దేశంగా ఖ్యాతి. ఇవన్నీ అమెరికా గొప్పదనాన్ని చాటి చెప్పేవే. కానీ అక్కడి ప్రజలు ప్రశాంతంగా ఉండలేరు. పని మీద బయటకు వెళ్లినా, విహార యాత్రలు చేసినా ఇంటికెళ్లే వరకూ బిక్కుబిక్కుమంటూనే గడుపుతారు. ఎప్పుుడు ఎవరు వచ్చి దాడి చేస్తారో తెలియక అనునిత్యం భయపడుతూనే ఉంటారు. అక్కడి గన్ కల్చర్ తెచ్చిన తంటాలివి. ఇటీవల కాలంలో వరుసగా అమెరికాలో కాల్పుల ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. టెక్సాస్‌లోని ఉల్వేడ్‌లో ఓ ఎలిమెంటరీ స్కూల్ విద్యార్థులపై ఓ 18 ఏళ్ల యువకుడు కాల్పులు జరపటం మరోసారి అమెరికాలోని గన్ కల్చర్‌పై చర్చకు దారి తీసింది. ఈ ఘటనలో మొత్తం 21 మంది చనిపోగా అందులో 19 మంది పిల్లలే. అంతకు ముందు షాపింగ్ మాల్‌లోనూ ఇలాంటి సంఘటనే జరిగింది. ఓ మెడికల్ కాలేజ్‌లోనూ ఇదే తరహా ఘటన జరగ్గా..నలుగురు ప్రాణాలు కోల్పోయారు.
అమెరికాలో ఈ గన్ కల్చర్ ఎప్పుడు మొదలైంది..?
1775 నుంచే అమెరికా సంస్కృతిలో భాగమైపోయాయి తుపాకులు. ఆఫ్రికన్ అమెరికన్లను బానిసలుగా ఉంచుకోవాలనే ఉద్దేశంతో అమెరికన్లు తుపాకులు వినియోగించటం మొదలు పెట్టారు. రానురాను తుపాకి అనేది అమెరికా జాతి చిహ్నంగా మారిపోయింది. ఇక్కడే మరో అంశమూ ప్రస్తావించాలి. 1776లో ఇంగ్లాండ్‌తో పోరాటం చేసి స్వాతంత్య్రం సంపాదించుకుంది అమెరికా. ఆ సమయంలో అమెరికన్లు తమ భద్రత కోసం తుపాకులు పట్టుకుని తిరిగేవారు. "స్వీయరక్షణ" అనే కారణాన్ని చూపిస్తూ ఇప్పటికీ చాలా మంది లైసెన్స్‌డ్ గన్స్ మార్కెట్ నుంచి కొనుగోలు చేస్తున్నారు.
గన్ కల్చర్ 2.0
రెండు దశాబ్దాల్లో అమెరికాలో సుమారు 20 కోట్ల తుపాకులు అమ్ముడైనట్టు అంచనా. మొదట్లో భద్రత కోసం తుపాకి ఉంటే మంచిదని భావించిన అమెరికన్ల సంఖ్య కాస్త తక్కువగానే ఉండేది. రానురాను ఇది ప్రెస్టేజ్ సింబల్‌గా మారింది. చేతిలో లైసెన్స్‌డ్ తుపాకీ ఉండటాన్ని హోదాగా భావించే ధోరణి పెరిగింది. ఫలితంగా కుటుంబంలో కనీసం ఒక్కరైనా తుపాకీ కొనుగోలు చేస్తున్నారు. తమ కుటుంబాన్ని రక్షించుకోవాలంటే గన్ తప్పనిసరిగా ఉండాల్సిందే అనుకునే వారి సంఖ్య పెరగటం వల్ల క్రమంగా గన్ కల్చర్ దారి తప్పింది. ప్రస్తుతం అమెరికాలో గన్ కల్చర్ 2.0 నడుస్తోందని అంటున్నారంతా. జంతువులు, దొంగల నుంచి తమని తాము రక్షించుకోటానికి తుపాకులు వినియోగించటంలో తప్పేమీ లేదని అక్కడి రాజ్యాంగమే చెబుతోంది. కానీ చాలా సందర్భాల్లో ఇవి దుర్వినియోగమవుతున్నాయి.
ఇటీవల జరిగిన సంఘటనలే ఇందుకు నిదర్శనం.
జనాభా కంటే తుపాకులే ఎక్కువ..
అమెరికా జనాభా 33 కోట్లు. కానీ అక్కడ ఉన్న తుపాకుల సంఖ్య మాత్రం 39 కోట్లు. అంటే ఏ స్థాయిలో ఇక్కడ తుపాకులు వినియోగిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. గన్ కల్చర్ వల్ల చెలరేగుతున్న హింసతో అగ్రరాజ్యానికి ఏటా దాదాపు 22 లక్షల కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతోందని అంచనా. ఇలాంటి ఘటనల్లో నష్టపోతున్న కుటుంబాలు మెడికల్ బిల్స్ కోసం ఏటా 36 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోందని అధికారిక గణాంకాలే చెబుతున్నాయి. ఇంత జరుగుతుంటే ప్రభుత్వం ఏమీ చేయటం లేదా అన్న అనుమానం రాక మానదు. నిజానికి అమెరికా రాజ్యాంగం ప్రకారం తుపాకుల వినియోగించటాన్నీ హక్కుగానే భావిస్తారు. అయితే అక్కడి సుప్రీం కోర్టు మాత్రం "స్వీయరక్షణ కోసం తుపాకులు ఇళ్లలోనే ఉంచుకోవాలి" అని అప్పట్లో వ్యాఖ్యానించింది. కానీ అక్కడి ప్రజలు బాహాటంగా వాటిని బయటకు తీసుకొస్తున్నారు.
మరో సమస్య ఏంటంటే..తుపాకుల వినియోగానికి సంబంధించి రాష్ట్రాల వారీగా నియమ నిబంధనలు మారిపోతున్నాయి. ఏ రాష్ట్రానికా రాష్ట్రం ప్రత్యేకంగా రూల్స్ తయారు చేసుకోవటం వల్ల గన్ కల్చర్‌ని నిర్మూలించటం సాధ్యం కావటం లేదు.
వేలాది ప్రాణాలు బలి
2020లో అమెరికాలో కాల్పుల కారణంగా 45 వేల 222 మంది మృతి చెందారు. ఆ ఏడాదిలో రోజుకు 124 మంది ప్రాణాలు కోల్పోయారు. 2000-2020 మధ్య కాలంలోనే ఈ తరహా ఘటనలు పెరిగినట్టు ఎఫ్‌బీఐ వెల్లడించింది. నేషనల్ రైఫిల్ అసోసియేషన్-NRA ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున గన్ లైసెన్స్‌లు అందిస్తారు. ఈ ఎన్‌ఆర్ఏ కోసం కాంగ్రెస్ ప్రత్యేకంగా ఏటా 19 వందల కోట్ల రూపాయలు నిధులు కేటాయిస్తుంది. ఎవ్రీ టౌన్ ఫర్ గన్ సేఫ్టీ సంస్థ గన్ కల్చర్‌కు వ్యతిరేకంగా పోరాడుతోంది. ట్రంప్ హయాంలో తుపాకుల వినియోగానికి సంబంధించిన రూల్స్‌ని కఠినతరం చేయాలని భావించినా అవి ఆలోచనలకే పరిమితమయ్యాయి.