India-Canada Diplomatic Row: కెనడా చర్య సిగ్గుచేటు- నిప్పుతో చలగాటమాడుతున్నారు: అమెరికా నిపుణులు
India-Canada Diplomatic Row: కెనడా ప్రవర్తిస్తున్న తీరు సిగ్గు చేటు అని, అత్యంత స్వార్థపూరితంగా ఉందని, అమెరికా నేతలు ఇందులో ఏమాత్రం జోక్యం చేసుకోవద్దని నిపుణులు హెచ్చరించారు.
ఖలిస్థానీ సానుభూతి పరుడు హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక హత్య వెనుక భారత్ హస్తం ఉండొచ్చని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తీవ్ర ఆరోపణలు చేయడంతో భారత్, కెనడాల మధ్య సంబంధాలు తీవ్రంగా క్షీణించిన సంగతి తెలిసిందే. ఇరు దేశాలు రాయబారులను బహిష్కరించడంతో విభేదాలు తారా స్థాయికి వెళ్లాయి. అయితే ఈ పరిణామాల నేపథ్యంలో ఇతర దేశాలు కూడా ట్రూడో తీరును తప్పు పడుతున్నాయి. కెనడా ఇలాంటి ఆరోపణలు చేయడం ఆందోళనకరమని అంటున్నాయి. తాజాగా అమెరికాలోని నిపుణులు కూడా ట్రూడో తీరును తీవ్రంగా ఖండించారు. కెనడా భారత్‌పై చేసిన ఆరోపణలు.. ప్రవర్తిస్తున్న తీరు సిగ్గు చేటు అని, అత్యంత స్వార్థపూరితంగా ఉందని విమర్శలు చేశారు. అమెరికా నేతలు ఇందులో ఏమాత్రం జోక్యం చేసుకోవద్దని నిపుణులు హెచ్చరించారు.
కెనడా-భారత్‌ల మధ్య జరుగుతున్న పరిణామాలపై చర్చిచేందుకు వాషింగ్టన్‌లోని హడ్సన్ ఇన్‌స్టిట్యూట్ లో సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో పలువురు అమెరికా నిపుణులు మాట్లాడుతూ.. ఖలిస్థానీ ఉద్యమాన్ని లాభార్జనగా చూస్తున్న కొంతమంది చేతుల్లో కెనడా ప్రధాని ట్రూడో కీలుబొమ్మగా మారారని అన్నారు. నిజ్జర్ హత్య కేసులో భారత ఏజెంట్ల పాత్ర ఉందంటూ ఆరోపణలు చేయడం సిగ్గుచేటు అని, చాలా స్వార్థపూరితమైన వ్యాఖ్యలు అని అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో అమెరికా నేతలు ఎట్టిపరిస్థితుల్లో జోక్యం చేసుకోవద్దని తాము భావిస్తున్నామని, ఎందుకంటే కెనడా నిప్పుతో చలగాటమాడుతోందని పేర్కొన్నారు. ట్రూడో ప్రవర్తిస్తున్న తీరు రాజకీయంగా ఆయనకు లాభం చేకూరుస్తుందేమో కానీ, ఇది నాయకత్వ లక్షణం మాత్రం కాదని వారు అభిప్రాయపడ్డారు.
జూన్ 18న కెనడాలోని బ్రాంప్టన్ పట్టణంలోని గురుద్వారా సాహిబ్ పార్కింగ్‌లో హర్‌దీప్ సింగ్ నిజ్జర్‌పై కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో అతడు మరణించాడు. అయితే ఇందులో భారత హస్తం ఉందన్నది కెనడా వాదన. ఇటీవల దిల్లీలో జరిగిన జీ 20 సమావేశాల సమయంలో కూడా కెనడా ప్రధాని ట్రూడో, ప్రధాని మోదీతో జరిగిన చర్చల్లో ఈ అంశాన్ని ప్రస్తావించారు. కెనడాలో కెనడా పౌరుడి హత్య వెనుక విదేశీ హస్తం ఉంటే అది తమ సార్వభౌమత్వానికి విఘాతం కలిగించడమే అని అన్నారు. ఆ కేసుకు సంబంధించిన విచారణకు సహకరించాలని ట్రూడో కోరారు. కెనడా చేస్తున్న ఆరోపణలను భారత్ తీవ్రంగా ఖండిస్తోంది.
సోమవారం హౌస్ ఆఫ్ కామన్స్‌లో జస్టిన్ ట్రూడో మాట్లాడుతూ.. భారత ప్రభుత్వ ఏజెంట్లు, కెనడియన్ పౌరుడు హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్యకు మధ్య సంబంధాల గురించి కెనడియన్ సెక్యూరిటీ ఏజెన్సీలకు విశ్వసనీయమైన సమాచారం ఉందని అన్నారు. అయితే ట్రూడో వాదనలను భారత్ తిరస్కరించింది. కెనడాలో హింసాత్మక చర్యలో భారత ప్రభుత్వం ప్రమేయం ఉందనే ఆరోపణలు పూర్తి అసంబద్ధమైనవని, ప్రేరేపించబడినవి అంటూ విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. భారత ప్రధాని మోదీపై కెనడా ప్రధాని ట్రూడో చేసిన ఆరోపణలను ఖండిస్తున్నట్లు పేర్కొంది. కెనడా ప్రవాస సిక్కులకు ఇష్టమైన దేశం. ఇక్కడ తీవ్రవాదం పుట్టగొడుగుల్లా పెరుగుతోందని భారత్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ప్రపంచంలోని పలు దేశాల్లో భారత దౌత్య కార్యాలయాలు, ప్రజలు, ఆలయాలపై ఖలిస్థానీల దాడులు పెరిగాయి.