UP Election 2022: భాజపాకు 4 గంటల్లో ఐదుగురు ఎమ్మెల్యేలు బైబై.. సైకిల్ ఎక్కి రయ్ రయ్.. రసవత్తరంగా యూపీ రాజకీయం!
ఎన్నికలు దగ్గర పడుతోన్న కొద్దీ ఉత్తర్‌ప్రదేశ్‌లో రాజకీయం వేడెక్కుతోంది. ఇప్పటికే ఐదుగురు ఎమ్మెల్యేలు భాజపాకు బైబై చెప్పారు. దీంతో భాజపా ఆలోచనలో పడింది.
ఉత్తర్‌ప్రదేశ్‌లో రాజకీయం రసవత్తరంగా ఉంది. ఓవైపు ఒపీనియన్ పోల్స్, సర్వేలు.. మరోసారి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని భాజపా అధికారంలోకి వస్తుందని చెబుతున్నాయి. కానీ మరోవైపు భాజపా నుంచి సమాజ్‌వాదీ పార్టీలోకి రోజురోజుకు వలసలు పెరిగిపోతున్నాయి. 4 గంటల వ్యవధిలో ఏకంగా ఒక మంత్రి సహా నలుగురు భాజపా ఎమ్మెల్యేలు అఖిలేశ్ యాదవ్ చెంతన చేరారు. దీంతో భాజపాలో గుబులు మొదలైంది. అసలు ఈ వలసలకు కారణమేంటి?
వలసల పర్వం..
మంగళవారమే.. యోగి ఆదిత్యనాథ్ సర్కార్‌లోని కేబినెట్ మంత్రి స్వామి ప్రసాద్ తన పదవికి రాజీనామా చేసి అఖిలేశ్ యాదవ్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. అది జరిగిన గంటల వ్యవధిలోనే మరో నలుగురు ఎమ్మెల్యేలు సమాజ్‌వాదీ పార్టీ బాట పట్టారు. రోషన్ లాల్ వర్మ, బ్రిజేష్ ప్రజాపతి, భగవతి సాగర్, వినయ్ శాక్య తాము రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. వీరంతా స్వామి ప్రసాద్ మౌర్యకు సన్నిహితులే.
స్వామి ప్రసాద్ మౌర్య ఓబీసీ వర్గానికి చెందిన బలమైన నాయకుడు. ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. బహుజన్ సమాజ్ పార్టీ నుంచి 2016లో ఆయన భాజపాలో చేరారు. అప్పటి నుంచి అఖిలేశ్ యాదవ్ పార్టీకి ఓబీసీ ఓటర్లను దూరం చేసే ప్రణాళికల్లో ముఖ్యపాత్ర పోషించారు మౌర్య.
ఇప్పుడు రాజీనామా చేసిన నలుగురు ఎమ్మెల్యేల్లో ముగ్గురు మౌర్యలానే బీఎస్పీ నుంచి భాజపాకు చేరారు. ఇప్పుడు సమాజ్‌వాదీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
అదే కారణం..
తాను రాజీనామా చేయడానికి దళితులపై భాజపా చిన్నచూపు వైఖరే కారణమని మౌర్య రాజీనామా పత్రంలో పేర్కొన్నారు.
కేశవ్ ప్రసాద్ మౌర్య వ్యాఖ్యలపై స్వామి ప్రసాద్ మౌర్య కూడా ఘాటుగా స్పందించారు.
చిగురించిన ఆశలు..
ఇలా ఎమ్మెల్యేలు వరుసగా పార్టీని వీడటం భాజుపాను ఆశ్చర్యపరచగా సమాజ్‌వాదీ పార్టీలో మాత్రం ఆశలు చిగురింప జేసింది. ఇప్పటికే అఖిలేశ్ యాదవ్‌కు మద్దతుగా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్ ప్రచారం చేసేందుకు సిద్ధమయ్యారు.
Also Read: ABP CVoter Survey: యూపీకి యోగి, ఉత్తరాఖండ్‌కు హరీశ్ రావత్.. సీఎంలుగా వీళ్లే కావాలట!
Also Read: ABP C-Voter Survey: యూపీలో భాజపా హవా.. ఉత్తరాఖండ్‌లోనూ కాషాయం జోరు.. పంజాబ్‌లో మాత్రం!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి