ABP CVoter Survey: యూపీకి యోగి, ఉత్తరాఖండ్‌కు హరీశ్ రావత్.. సీఎంలుగా వీళ్లే కావాలట!
ఉత్తర్‌ప్రదేశ్, పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్‌లో జరగనున్న ఎనికలపై ఏబీపీ- సీఓటర్ ప్రజల అభిప్రాయాలను సేకరించింది. ఎవరు ముఖ్యమంత్రిగా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారో చూడండి.

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు (ఉత్తర్‌ప్రదేశ్, పంజాబ్, మణిపుర్, గోవా, ఉత్తరాఖండ్) మరో నెలలో మొదలుకానున్నాయి. ప్రజల నాడి ఎలా ఉందనే విషయంపై ఇప్పటికే ఏబీపీ సీఓటర్ సర్వే చేసింది. అయితే ఈ రాష్ట్రాల ప్రజలు తమ ముఖ్యమంత్రిగా ఎవరిని కోరుకుంటున్నారో కూడా సర్వేలో వెల్లడైంది. ఆ వివరాలు చూద్దాం.
ఉత్తర్‌ప్రదేశ్..
ఉత్తర్‌ప్రదేశ్‌లో 43% మంది ప్రజలు.. యోగి ఆదిత్యనాథ్ తమ ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నారు. అఖిలేశ్ యాదవ్ సీఎం కావాలని 34% మంది అన్నారు. బీఎస్పీ అధినేత్రి మాయావతికి 14% మంది జై కొట్టారు. మరోవైపు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ముఖ్యమంత్రి కావాలని 3% మంది మాత్రమే అన్నారు.
ఆదిత్యనాథ్‌కు మద్దతు భారీగా పెరిగింది. 2021 సెప్టెంబర్‌లో 40% మంది యోగి సీఎం కావాలని కోరుకోగా 2022 జనవరికి ఇది 43%కి పెరిగింది.
ఉత్తరాఖండ్..
కాంగ్రెస్ వెటరన్ లీడర్, మాజీ ముఖ్యమంత్రి హరీశ్ రావత్.. ఉత్తరాఖండ్ సీఎంగా ఉండాలని 37% మంది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుత సీఎం పుష్కర్ సింగ్ ధామీకి 29% మంది మద్దతు పలికారు. రాజ్యసభ ఎంపీ, భాజపా అధికార ప్రతినిధి అనిల్ బలూనీ సీఎం కావాలని 18 శాతం మంది కోరుకున్నారు.
ప్రస్తుత సీఎం కంటే ప్రతిపక్షంలో ఉన్న నేతను ముఖ్యమంత్రి కావాలని ఎక్కువ మంది కోరుకోవడం ఇదే మొదటిసారి. ఒకవేళ మరోసారి భాజపా సర్కార్ ఏర్పడితే రాష్ట్రంలో సీఎంను మార్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే ఏడాదిలో ముగ్గురు ముఖ్యమంత్రులను భాజపా మార్చింది.
పంజాబ్..
పంజాబ్ సీఎంగా ఎవరుండాలని కోరుకుంటున్నారని చేసిన సర్వేలో అనూహ్య ఫలితాలు వచ్చాయి. ఆమ్‌ఆద్మీ పార్టీకి చెందిన భగవత్ మన్.. ముఖ్యమంత్రి కావాలని 23 శాతం మంది ప్రజలు కోరుకుంటున్నారు. అయితే డిసెంబర్‌లో ఇది 13 శాతంగానే ఉంది. ఒక్క నెలలో పెరిగింది.
మరోవైపు ప్రస్తుత సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ ముఖ్యమంత్రిగా ఉండాలని 29% మంది అన్నారు. పంజాబ్ పీసీసీ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూ సీఎం కావాలని 6 శాతం మంది అన్నారు. అరవింద్ కేజ్రీవాల్‌కు 17% మంది జై కొట్టగా సుఖ్‌బీర్ సింగ్ బాదల్ ముఖ్యమంత్రి కావాలని 15 మంది పంజాబీలు కోరుకుంటున్నారు.
గోవా..
గోవాలో నిర్వహించిన సర్వే ప్రకారం.. ప్రస్తుత సీఎం ప్రమోద్ సావంత్ లీడ్‌లో ఉన్నారు. ఆయన మరోసారి ముఖ్యమంత్రి కావాలని 34 శాతం అన్నారు. 19 శాతం మంది ఆమ్‌ఆద్మీ అభ్యర్థి ముఖ్యమంత్రి కావాలన్నారు. కాంగ్రెస్ నేత దిగంబర్ కామత్ ముఖ్యమంత్రి కావాలని 9% మంది తెలిపారు.
మోగిన ఎన్నికల నగారా..
దేశంలో కీలకమైన ఐదు రాష్ట్రాలకు ఎన్నికల నగారా మోగింది. ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపుర్ రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది.ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు ఏడు విడతలుగా ఎన్నికలు జరపనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. అన్ని రాష్ట్రాల ఎన్నికలకు కౌంటింగ్ మార్చి 10న నిర్వహించనున్నారు
Also Read: ABP C-Voter Survey: యూపీలో భాజపా హవా.. ఉత్తరాఖండ్‌లోనూ కాషాయం జోరు.. పంజాబ్‌లో మాత్రం!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

