Union Budget 2024: అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తలకీ ఆయుష్మాన్ భారత్ స్కీమ్ - గుడ్ న్యూస్ చెప్పిన నిర్మలమ్మ
Budget 2024 Highlights: ఆయుష్మాన్ భారత్ పథకంలో అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తలనూ అర్హులుగా చేరుస్తామని నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
Budget 2024 Speech Highlights: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆశా కార్యకర్తలకు, అంగన్‌వాడీలకు గుడ్‌న్యూస్ చెప్పారు. కేంద్ర ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ పథకంలో (Ayushman Bharat-Pradhan Mantri Jan Arogya Yojana) వీళ్లనూ అర్హులుగా చేరుస్తామని కీలక ప్రకటన చేశారు. అయితే...ఇందుకోసం ఎంత బడ్జెట్ ప్రవేశపెడుతున్నారన్నది మాత్రం వెల్లడించలేదు. గత బడ్జెట్‌లో ఈ స్కీమ్ కోసం రూ.7,200 కోట్లు కేటాయించారు. మొత్తంగా కేంద్ర కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ కింద రూ.88,956 కోట్లు కేటాయింపులు జరిగాయి. ఆయుష్మాన్ భారత్ పథకం కింద అర్హులందరికీ రూ.5 లక్షల మేర ఆరోగ్య బీమా అందిస్తారు. అంతే కాదు. ఈ కార్డ్ ద్వారా వాళ్లు వైద్యం చేయించుకునేందుకూ అవకాశముంటుంది. పైగా ఇది క్యాష్‌లెస్ సర్వీస్. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 30.6 కోట్ల కుటుంబాలకు లబ్ధి జరుగుతోందని కేంద్రం వెల్లడించింది. పథకం ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకూ ఈ స్కీమ్ కింద దేశవ్యాప్తంగా 6.2 కోట్ల హాస్పిటల్ అడ్మిషన్స్ జరిగాయి. మొత్తంగా రూ.79,157 కోట్ల మేర నిధులు ఖర్చయ్యాయి. ఎలాంటి నగదు, పత్రాలు లేకుండానే ఈ లబ్ధి పొందేలా వెసులుబాటు కల్పించింది కేంద్రం.
పదేళ్లలో రికార్డు స్థాయిలో మౌలిక వసతులు కల్పించామని అన్నారు నిర్మలా సీతారామన్. 11.8 కోట్ల మంది అన్నదాతలకు రకరకాల పథకాల ద్వారా లబ్ధి చేకూర్చామని వివరించారు. ప్రపంచమంతా ఆర్థిక పరంగా ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటున్న సమయంలో భారత్ దిక్సూచిగా నిలిచిందని అన్నారు. ఇలాంటి సంక్షోభ సమయంలోనూ G20 సదస్సుని విజయవంతంగా పూర్తి చేయగలిగామని వెల్లడించారు. యూరప్ ఎకనామిక్ కారిడార్ నిర్మాణం చరిత్రాత్మక నిర్ణయం అని ప్రశంసించారు.దేశవ్యాప్తంగా 92 యూనివర్సిటీలు ఏర్పాటు చేసినట్టు గుర్తు చేశారు. యువతకు నాణ్యమైన విద్య అందించాలన్నదే ప్రధాని మోదీ లక్ష్యం అని వివరించారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద 70 వేల ఇళ్లు కట్టించి ఇచ్చామని స్పష్టం చేశారు. భారత్‌కి ఆకాశమే హద్దు అని తేల్చి చెప్పారు. స్కిల్ ఇండియా పథకం కింద 1.4 కోట్ల మంది యువతకు శిక్షణ అందించినట్టు వివరించారు నిర్మలా సీతారామన్. ప్రజల సగటు ఆదాయం 50% మేర పెరగడంతో పాటు ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టిందని చెప్పారు.