UN chief's Advice: మైనార్టీల హక్కులను కాపాడాల్సిన బాధ్యత భారత్‌కి ఉంది, మహాత్ముని మార్గంలో నడవండి - గుటెర్రస్
UN chief's Advice: భారత్ మైనార్టీల హక్కులను కాపాడాలని యూఎన్ సెక్రటరీ జనరల్ గుటెర్రస్ సూచించారు.
UN Chief's Advice:
గాంధీ చూపిన మార్గంలో...
ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ భారత్‌పై విమర్శలు చేశారు. మానవహక్కుల విషయంలో భారత్ సరైన విధంగా వ్యవహరించడం లేదని అసహనం వ్యక్తం చేశారు. భారత జాతిపిత మహాత్మా గాంధీ అడుగు జాడల్లో నడిచి...దేశంలోని అన్ని వర్గాల హక్కులను రక్షించాల్సిన అవసరముందని సూచించారు. ఐఐటీ బాంబేలో ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన...కీలక వ్యాఖ్యలు చేశారు. "అంతర్జాతీయ వేదికపై భారత్‌కు మరింత ప్రాధాన్యత, జవాబుదారీతనం పెరగాలంటే మానవ హక్కులకు గౌరవం ఇవ్వాలి" అని చెప్పారు. అంతే కాదు. మైనార్టీల విషయాన్నీ ప్రస్తావించారు. "హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ సభ్యుడిగా నేను ఒకే మాట చెబుతున్నాను. మానవ హక్కులను కాపాడాల్సిన బాధ్యత భారత్‌కు ఉంది. అన్ని వర్గాల వాళ్ల హక్కుల్ని పరిరక్షించాలి. ముఖ్యంగా మైనార్టీల విషయంలో ఇది కచ్చితంగా పాటించాలి" అని వ్యాఖ్యానించారు. అహింసాయుత ఉద్యమంతో స్వాతంత్య్రం సాధించిన భారత్...గాంధీ విలువలను అనుసరించాలని కోరారు. ఆయన మార్గంలోనే నడిచి అన్ని వర్గాల ప్రజల గౌరవాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. "విభిన్న సంస్కృతులు, సంప్రదాయాలు, మతాలను ఒక్కతాటిపైకి తీసుకొని వచ్చేందుకు ప్రయత్నించాలి" అని చెప్పారు. విద్వేష పూరిత ప్రసంగాలను ఖండించటం సహా... జర్నలిస్ట్‌లు, మానవ హక్కుల కార్యకర్తలు, విద్యార్థుల హక్కులను రక్షించాలని సూచించారు. ఈ కార్యక్రమానికి హాజరు కాక ముందు ఆయన ముంబయిలోని 26/11 మెమోరియల్‌ను సందర్శించారు. "ఉగ్రవాదంపై పోరాడటమే అన్ని దేశాల ప్రాధాన్యత అవ్వాలి" అని సూచించారు.
ఐరాస భద్రతా మండలిలో భారత్..
ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం కల్పించాలనే డిమాండ్‌కు రష్యా తన మద్దతును ప్రకటించింది. ఈ హోదా పొందడానికి భారత్‌తో పాటు బ్రెజిల్‌కు అన్ని అర్హతలు ఉన్నాయని తెలిపింది. ఐరాస సర్వప్రతినిధి సభను ఉద్దేశించి ప్రసంగించిన సమయంలో రష్యా విదేశాంగ మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. మండలిలో తీసుకురావాల్సిన అత్యవసర మార్పులను ప్రతిపాదించడంలో భారత్ ఎప్పుడూ ముందు వరుసలో ఉంటోందని ఆయన అన్నారు. ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాల ప్రాతినిధ్యాన్ని విస్తరించడం ద్వారా ఐరాస భద్రతా మండలిని మరింత ప్రజాస్వామ్యయుతంగా మార్చాల్సిన అవసరం ఉందని లావ్రోవ్ అన్నారు. ప్రస్తుతం భద్రతా మండలిలో రష్యా, యూకే, చైనా, ఫ్రాన్స్, అమెరికా శాశ్వత సభ్యదేశాలుగా ఉన్నాయి. మరో 10 దేశాలు తాత్కాలిక శాశ్వత సభ్యదేశాలుగా వ్యవహరిస్తాయి. వీటిని ప్రతి రెండేళ్లకోసారి ఐరాస సర్వప్రతినిధి సభ ఎన్నుకుంటుంది. ప్రస్తుతం భారత్ తాత్కాలిక శాశ్వత సభ్యదేశంగా కొనసాగుతోంది. డిసెంబరుతో ఆ గడువు ముగియనుంది.
" అంతర్జాతీయంగా భారత్, బ్రెజిల్ దేశాలు చాలా కీలకమైనవి. సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా భద్రతామండలిలో మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. కనుక భారత్, బ్రెజిల్ దేశాలకు.. ఐరాస భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కల్పించాలి. దీనికి రష్యా పూర్తి మద్దతు ప్రకటిస్తోంది. "
-సెర్గీ లావ్రోవ్, రష్యా విదేశాంగ మంత్రి
Also Read: Liz Truss Resigns: ఆ ఒక్క నిర్ణయమే పడగొట్టిందా? లిజ్ ట్రస్ రాజీనామాకు కారణాలెన్నో!