(Source: ECI/ABP News/ABP Majha)
Turkiye-Syria Earthquake: టర్కీ సిరియాలో 20 వేలకు పెరిగిన మృతుల సంఖ్య, సహాయక చర్యలకు "చలి గండం"
Turkiye-Syria Earthquake: టర్కీ సిరియాలో భూకంపం ధాటికి మృతి చెందిన వారి సంఖ్య 20 వేలకు చేరుకుంది.
Turkiye-Syria Earthquake Deaths:
20 వేలు దాటిన మృతుల సంఖ్య
టర్కీ సిరియాలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అంతకంతకూ మృతుల సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం దాదాపు 20 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. 80 వేల మంది తీవ్రంగా గాయపడ్డారు. రెండు దేశాల్లోనూ రెస్క్యూ ఆపరేషన్ సాగుతున్నప్పటికీ చలి కారణంగా కాస్త ఆలస్యమవుతోంది. అంత చలిలోనూ తీవ్ర ఇబ్బందులు పడుతూ అన్ని బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతుండటం వల్ల భూకంప ముప్పు నుంచి సురక్షితంగా బయటపడిన వాళ్లు కూడా అవస్థలు పడుతున్నారు.
"మమ్మల్ని మరో ముప్పు వెంటాడుతోంది. ఈ చలి కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అయినా సరే ఇప్పుడున్న వేగంతోనే సహాయక చర్యలు కొనసాగిస్తే కానీ కాపాడలేం"
- రాబర్ట్ హోల్డన్, WHO ప్రతినిధి
మూడు రోజులుగా క్రమంగా మృతుల సంఖ్య పెరుగుతోంది. అక్కడక్కడా మళ్లీ భూకంపాలు నమోదవుతున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న ఓ 2 ఏళ్ల బాలుడిని బయటకు తీసేందుకు దాదాపు 79 గంటల పాటు శ్రమించారు. మరి కొన్ని సిటీల్లోనూ ఇవే పరిస్థితులు ఉన్నాయి. అయితే...టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్‌పై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సహాయక చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండి పడుతున్నారు. ఇంత పెద్ద ముప్పు ముంచుకొచ్చినా ప్రభుత్వం ఏమీ చేయలేదని ఆరోపిస్తున్నారు. అయితే..ఆ రెండు దేశాల దుస్థితి చూసిన ప్రపంచ దేశాలు సహాయక చర్యలు అందించేందుకు ముందుకొస్తున్నాయి. ఇప్పటికే 56 దేశాలకు చెందిన సహాయక బృందాలు టర్కీ, సిరియాకు చేరుకున్నాయి. మరో 24 గంటల్లో మరో 19 దేశాలకు చెందిన బృందాలు రంగంలోకి దిగనున్నాయి.
ఈ దీనస్థితిని గమనించిన భారత్...ఆ రెండు దేశాలకూ సాయం చేసేందుకు ముందుకొచ్చింది. "ఆపరేషన్ దోస్త్" పేరిట ఈ సహాయక చర్యలు అందిస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తున్న తరుణంలో భారత్ అండగా ఉండేందుకు సిద్ధమైంది. విదేశాంగ మంత్రి జైశంకర్ ఈ మేరకు ట్వీట్ చేశారు. ఆపరేషన్ దోస్త్‌లో భాగంగా...టర్కీ, సిరియాకు సాయం అందిస్తున్నట్టు ప్రకటించారు.
"ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల మధ్య సంబంధాల్లో ఎన్నో మార్పులు వస్తున్నాయి. కానీ భారత్ మాత్రం అన్ని దేశాలతోనూ స్థిరమైన బంధాన్ని కొనసాగిస్తోంది. వసుధైవ కుటుంబం అనే సూత్రానికి కట్టుబడిన భారత్...మానవత్వంతో సాయం అవసరమైన వారికి అండగా నిలబడుతుంది"
-జైశంకర్, విదేశాంగ మంత్రి
ఇండియన్ ఎయిర్ ఫోర్స్...ప్రత్యేక విమానాల్లో భారీ ఎత్తున మెడికల్ ఎక్విప్‌మెంట్‌ను పంపుతోంది. ఇండియన్ ఆర్మీ మెడికల్ టీమ్‌కి చెందిన 54 మంది సిబ్బంది కూడా ఈ విమానాల్లో వెళ్తోంది. వైద్య పరమైన సాయం అందించేందుకు ముందుంటామని వెల్లడించింది. ఇలాంటి కష్టకాలంలో భారత్ సాయం చేస్తుండటంపై టర్కీ కృతజ్ఞతలు తెలిపింది.
Also Read: Digital Credit: ఈ ఏడాది నుంచి డిజిటల్ లోన్స్ ఇస్తాం, చిన్న వ్యాపారులూ తీసుకోవచ్చు - కేంద్ర మంత్రి