TTD News: శ్రీనివాసుడి సన్నిధిలో కొనసాగుతున్న భక్తుల రద్దీ - సర్వదర్శనం భక్తులకు 24 గంటల సమయం
TTD News: శ్రీనివాసుడి సన్నిధిలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్సులో 31 కంపార్మెంట్లల్లో భక్తులు వేచి ఉండగా.. సర్వదర్శనం భక్తులకు 24 గంటల సమయం పడుతోంది.
![TTD News: శ్రీనివాసుడి సన్నిధిలో కొనసాగుతున్న భక్తుల రద్దీ - సర్వదర్శనం భక్తులకు 24 గంటల సమయం TTD News Tirumala Hundi Income And Rush Details on June 13th And Union Minister Piyush Goyal special Prayer at tirumala TTD News: శ్రీనివాసుడి సన్నిధిలో కొనసాగుతున్న భక్తుల రద్దీ - సర్వదర్శనం భక్తులకు 24 గంటల సమయం](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/13/6aaa0182e9d19cd873394f459be22ba71686627856629519_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
TTD News: తిరుమల పుణ్యక్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వేసవి సెలవులు పూర్తయినా శ్రీనివాసుడి దర్శనం కోసం భక్తులు ఏడు కొండలకు క్యూ కడుతున్నారు. సోమవారం రోజున 79,087 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. ఇక స్వామి వారికి 35,640 మంది తలనీలాలు సమర్పించగా, 4.41 కోట్ల రూపాయలు భక్తులు హుండీ ద్వారా కానుకలుగా సమర్పించారు. ఇక సర్వదర్శనం భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్సులో 31 కంపార్ట్మెంట్లల్లో భక్తులు వేచి ఉన్నారు. దీంతో టైం స్లాట్ టోకెన్లు లేని సర్వదర్శనం భక్తులకు 24 గంటల సమయం పడుతుంది. ఇక ప్రత్యేక ప్రవేశ దర్శనానికి దాదాపు మూడు గంటల సమయం పడుతుంది.
శ్రీవారి సేవలో కేంద్రమంత్రి పీయూష్ గోయల్..
తిరుమల శ్రీవారిని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ సందర్శించారు. శ్రీవారి అనుగ్రహంతో భారతదేశం అన్ని విధాల అభివృద్ధి చెందాలని స్వామి వారిని ప్రార్థించినట్లు తెలిపారు. మంగళవారం ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్వామి వారి ఆశీస్సులు పొందారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న ఆయనకు టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం పలుకుగా.. అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేసి శేష వస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశానికి మరింత సేవ చేసే భాగ్యం తనకు కల్పించాలని, దేశ ప్రజలకు స్వామి ఆశీస్సులు ఉండాలని ఆయన తెలిపారు.
శ్రీవారి ఆలయంలో వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం శ్రీ వేంకటేశ్వరుడికి కైంకర్యాలు నిర్వహిస్తున్నారు అర్చకులు. ఇందులో భాగంగా మంగళవారం ప్రత్యూషకాల ఆరాధనతో ఆలయ ద్వారముకు తెరిచిన అర్చకులు.. బంగారు వాకిలి వద్ద శ్రీ వేంకటేశ్వర సుప్రభాత స్త్రోతంతో స్వామి వారిని మేలు కొలిపారు. అనంతరం తోమాల, అర్చన సేవలు నిర్వహించిన అర్చకులు.. ప్రాతఃకాల ఆరాధనలో భాగంగా స్నపన మండపంలో శ్రీకొలువు శ్రీనివాస మూర్తి వారి సమక్షంలో దర్భార్ నిర్వహించారు. శ్రీవారికి పంచాంగ శ్రవణం, హుండీ జనాకర్షణ విన్నవించి, బెల్లంతో కలిపిన నువ్వుల పిండిని స్వామి వారికి నైవేద్యంగా సమర్పించారు. నవనీత హారతి సమర్పించి అనంతరం శ్రీనివాసమూర్తిని తిరిగి సన్నిధిలో వేంచేపు చేశారు. ప్రాతఃకాల ఆరాధనలో భాగంగా మొదటి ఘంటా నివేదనలో అన్నప్రసాదం, లడ్డూ, వడలు, చక్కెర పొంగలి, మిరియాలు పొంగలి, పగిలిన కుండలో వెన్నతో కలిపిన అన్నం(మాత్ర), దద్దోజనం స్వామి వారికి నైవేద్యంగా సమర్పించారు.
సన్నిధిలో శ్రీ వైష్ణవ సాంప్రదాయం ప్రకారం సాత్తుమొర నిర్వహించిన అనంతరం సర్కారు హారతి అందించి వీఐపీ భక్తులకు స్వామి వారి దర్శన భాగ్యం కల్పించింది టీటీడీ. అనంతరం స్వామి వారికి రెండోవ గంట నివేదన, బలి జరిపిన అనంతరం ప్రతి "మంగళవారం" రోజు నిర్వహించే "అష్టదళపాద పద్మరాధన" 108 సువర్ణ పద్మాలతో శ్రీవారిని అర్చించడం ఈ సేవ విశేషం. అనంతరం సర్వదర్శనం భక్తులను స్వామి వారి దర్శనానికి అనుమతించారు. శ్రీవారి ఉత్సవమూర్తులు అయినా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారిని విమాన ప్రదక్షణగా సంపంగి ప్రాకారంలోనికి వేంచేపు చేసి మధ్యాహ్నం 12 గంటలకు నిత్య కళ్యాణోత్సవాన్ని నేత్ర పర్వంగా నిర్వహించారు. ఆ తర్వాత ఆలయంలోని అద్దాల మండపంలో డోలోత్సవం సేవను నిర్వహించి, ఉత్సవ మూర్తులను ఆలయ వెలుపల ఉన్న వైభోత్సవ మంపానికి ఊరేగింపుగా తీసుకెళ్ళి ఆర్జిత బ్రహ్మోత్సవం, ఆర్జిత వసంతోత్సవం సేవలు నిర్వహిస్తారు. సాయంకాలం సహస్రదీపాల కొలువులో ఊంజల్ సేవ నిర్వహించిన పిదప నిత్యోత్సవం జరిపిస్తారు. సర్వదర్శనం నిలుపుదల చేసిన అనంతరం శ్రీవారికి రాత్రి కైంకర్యాలు ప్రారంభిస్తారు. ఈ కైంకర్యాల్లో భాగంగా రాత్రి తోమాల, అర్చన, రాత్రి గంట, తిరువీసం, ఘంటాబలి నిర్వహిస్తారు. తిరిగి సర్వదర్శనం భక్తులను స్వామి వారి దర్శనానికి అనుమతించి, సర్వదర్శనం పూర్తి అయిన తరువాత ఆగమోక్తంగా శ్రీవారికి చివరి సేవగా ఏకాంత సేవను నిర్వహిస్తారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)