Producers Meet Pavan : అమరావతిలో పవన్‌ను కలిసిన అగ్రనిర్మాతలు ! ఒంటరిని చేయలేదని క్లారిటీ ఇచ్చారా?
2 రోజుల కిందట మంత్రి పేర్ని నానిని కలిసిన నిర్మాతలు ఇవాళ జనసేనానిని కలిశారు. ఇండస్ట్రీ కోసం మాట్లాడిన పవన్‌ను ఒంటరి చేశారన్న అభిప్రాయం బలపడటంతో అలాంటిదేమీ లేదని చెప్పేందుకు వచ్చినట్లుగా తెలుస్తోంది.
జనసేన పార్టీ వ్యవహారాల్లో తీరిక లేకుండా ఉన్న పవన్ కల్యాణ్‌నుఅగ్ర సినీ నిర్మాతల బృందం కలిసింది. అమరావతిలోని జనసేన కార్యాలయానికి వచ్చిన నిర్మాతలు పవన్‌కల్యాణ్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. దిల్ రాజు, బన్నీ వాసు, సునీల్ నారంగ్, ఎర్నేని నవీన్ లాంటి ముఖ్య నిర్మాతలు అమరావతి వచ్చిన వారిలో ఉన్నారు. వీరందరూ రెండు రోజుల కిందట ఏపీ సమాచార మంత్రి పేర్ని నానిని మచిలీపట్నంలో కలిశారు. ఒక్క రోజు తేడాతో మళ్లీ పవన్ కల్యాణ్‌ను కలిసేందుకు మంగళగిరి రావడం టాలీవుడ్‌లో ఆసక్తి రేపుతోంది.
Also Read : ఎవరి ఈగోను వారు తృప్తి పరుచుకుంటున్నారు.. పంజాబీ పిల్ల పూనమ్ కౌర్ ట్వీట్ వైరల్
రిపబ్లిక్ సినిమా ప్రి రిలీజ్ ఫంక్షన్‌లో సినిమా ఇండస్ట్రీ విషయంలో ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై పవన్ కల్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే ఆ తర్వాత ఆయనకు ఇండస్ట్రీలో మద్దతు లభించలేదు. ఇద్దరు, ముగ్గురు హీరోలు తప్ప అందరూ సైలెంట్‌గా ఉన్నారు. ఇక ఫిల్మ్ చాంబర్ అధ్యక్షుడు నారాయణదాస్ నారంగ్ అయితే అది పవన్ కల్యాణ్ వ్యక్తిగత అభిప్రాయమని ప్రెస్‌నోట్ రిలీజ్ చేశారు. ఆ తర్వాత కూడా పవన్ కల్యాణ్ ఇండస్ట్రీ కోసం మాట్లాడలేదని .. రాజకీయం కోసం మాట్లాడారని మంత్రి పేర్ని నాని విమర్శలు చేస్తున్నారు. ఇండస్ట్రీలోని వారందరూ పవన్‌ను గుదిబండగా భావిస్తున్నారంటూ సజ్జల రామకృష్ణారెడ్డి కూడా వ్యాఖ్యానించారు.
అదే సమయంలో తాను ఎవరి కోసం మాట్లాడానని.. తనకేమైనా ధియేటర్లు ఉన్నాయా అని పవన్ కల్యాణ్ కూడా కార్యవర్గ సమావేశం వేదికగా ప్రశ్నించారు. అదే సమయంలో ఇండస్ట్రీ కోసం ఎలుగెత్తిన పవన్ కల్యాణ్‌ను ఒంటరి చేశారన్న అభిప్రాయం బలంగా ఏర్పడుతూండటంతో నిర్మాతలు కూడా ఆలోచించినట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వం వైపు ఉండి .. తమ కోసం గొంతెత్తిన వారిని నిర్లక్ష్యం చేసిన భావన వస్తే ఇబ్బంది పడతామన్న ఉద్దేశంతో నిర్మాతలందరూ అమరావతి వచ్చి పవన్ కల్యాణ్‌ను కలిసి పేర్ని నానితో జరిగిన చర్చల వివరాలను వెల్లడించినట్లుగా తెలుస్తోంది. దీనిపై పవన్ కల్యాణ్ స్పందనేమిటో బయటకు తెలియలేదు.
Also Read : మాటల్లో చెప్పిన ‘రాజకీయం’ చేతల్లో చూపిస్తే తిరుగులేనట్లే..! పవన్ కల్యాణ్ ‘సొంత’ బాట ..?
సినీ ఇండస్ట్రీకి ఏమీ సమస్యలు లేవని కాదని.. ఏపీలో చాలా సమస్యలు ఉన్నాయని పరిష్కరించాలని సినిమా పరిశ్రమ ప్రతినిధులు పదే పదే ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ప్రభుత్వం సానుకూలంగా ఉన్నామని చెబుతోంది కానీ ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడం లేదు. ఈ కారణంగా సినిమాల విడుదల ఎక్కడివక్కడ ఆగిపోతోంది. ప్రభుత్వంతో లడాయి పెట్టుకోవడం కన్నా సామరస్యంగా అనుమతులు తెచ్చుకోవాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను ఖండించమంటే నిర్మాతలు ఖండించారని... సినీ పరిశ్రమను రాజకీయాల్లోకి లాగవద్దని కూడా కోరారు. అయితే ప్రభుత్వం వైపునుంచి రావాల్సిన అందాల్సిన సహకారం అందడం లేదనే భావన వారిలో ఉందంటున్నారు. గురువారం అల్లు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కూడా ప్రభుత్వం సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ సందర్భంగా నిర్మాతలు పవన్ కల్యాణ్‌ను కలవడంతో తదుపరి ఎలాంటి పరిస్థితి ఉంటుందన్నదానిపై టాలీవుడ్‌లోనే కాదు.. ఏపీ రాజకీయవర్గాల్లో ఆసక్తి ఏర్పడింది.
Watch Video : జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ పోరాటం ఎవరి కోసం? పార్టీ కోసమా? సినీ పరిశ్రమ కోసమా?