Top Headlines Today: సిద్ధరామయ్య ప్రమాణం నుంచి ఐపీఎల్ మ్యాచ్‌ల వరకు మే 20 నాటి షెడ్యూల్డ్ హెడ్‌లైన్స్?
Top Headlines Today: తెలుగు రాష్ట్రాలతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఇవాళ్టి షెడ్యూల్‌లో ఉన్న ముఖ్యమైన అంశాలు ఇవే.
Top Headlines Today:
సిద్దరామయ్యకు పట్టాభిషేకం
కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్దరామయ్య నేడు ప్రమాణం చేయనున్నారు. దీనికి బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇవాళ(శనివారం, మే 20న) మధ్యాహ్నం 12.30కి ప్రమాణస్వీకార కార్యక్రమం ఉంటుంది. ముఖ్యమంత్రి సిద్దరామయ్యతోపాటు డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణం చేయనున్నారు.
మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న కొందరు ఎమ్మెల్యేలు కూడా ఇదే వేదికపై ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణస్వీకారానికి ముందు సిద్ధరామయ్య, శివకుమార్ ఢిల్లీకి చేరుకుని కొత్త మంత్రివర్గంలో చేర్చుకోవాల్సిన ఎమ్మెల్యేల పేర్లు, కేటాయించాల్సిన శాఖలపై హైకమాండ్ తో చర్చించారు.
నేడు తెలంగాణ ఈసెట్
తెలంగాణ ఈసెట్-2023 ఇవాళ జరగనుంది. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్‌లో, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండో సెషన్‌లో ఈసెట్ ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈసెట్ ద్వారా బీఈ, బీటెక్, బీఫార్మసీ కోర్సు్లో లేటరల్ ఎంట్రీ ద్వారా సెకండియర్‌లో ప్రవేశాలు కల్పిస్తారు.
నేడు పలు రైళ్లు రద్దు
ఖాజీపేట–కొండపల్లి సెక్షన్ మధ్యలోని చింతల్‌పల్లి–నెక్కొండ స్టేషన్ మధ్యలో జరుగుతున్న మూడోలైన్ నిర్మాణ పనుల్లో పలు రైళ్లను పూర్తిగా మరికొన్నింటిని పాక్షికంగా రద్దు చేశారు దక్షిణ మధ్య రైల్వే అధికారులు. ఖాజిపేట–డోర్నకల్లు (07753/07754), విజయవాడ–డోర్నకల్లు (07755/07756), విజయవాడ–గుంటూరు (07464/07465), భద్రాచలంరోడ్డు–సికింద్రాబాద్ (17660/17659), విజయవాడ–సికింద్రాబాద్(12713/12714) ఎక్స్‌ప్రెస్ రైళ్లును ఆదివారం నుంచి జూన్ ఏడు వరకు పూర్తిగా రద్దు చేశారు. ఖాజిపేట–తిరుపతి (17091/17092) రైళ్లు ఈ నెల 23, 30, జూన్ 6 తేదీల్లో, మచిలీపట్నం–సికింద్రాబాద్ (07185/07186) రైళ్లు ఈ నెల 21, 28, జూన్ 4 తేదీల్లో రద్దు చేశారు.
హైదరాబాద్‌లో నేడు ఎన్టీఆర్ శతజయంతి వేడుక
విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, దివంగత నేత ఎన్టీఆర్ శతజయంతిని పురస్కరించుకొని ‘ఎన్టీఆర్ లిటరేచర్, సావనీర్ అండ్ వెబ్‌సైట్ కమిటీ’ మే 20న సాయంత్రం 5గంటలకు హైదరాబాద్, కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డులోని కైతలాపూర్ మైదానంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా వేడులకలు నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశంపార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు హాజరవుతున్నారు. ప్రముఖ సినీ నటడు నందమూరి బాలకృష్ణ ప్రత్యేక అతిథిగా పాల్గొంటున్నారు.
నేడు పాలిసెట్ ఫలితాలు
ఆంధ్రప్రదేశ్ పాలి సెట్ ఫలితాలను నేడు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విడుదల చేయనున్నారు. ఉదయం 10.45 గంటలకు విజయవాడలో ఫలితాలను విడుదల చేయనున్నారు. పాలిసెట్ 1,43,625 మంది ఈ పరీక్షను రాశారు. పరీక్ష ఫలితాలను https://polycetap.nic.inలో చూడవచ్చు.
మునిసిపాలిటీల్లో మేరీ లైఫ్, మేరీ స్వచ్ఛ హెహర్
తెలంగాణలో నేటి నుంచి అన్ని మునిసిపాలిటీల్లో మేరీ లైఫ్, మేరీ స్వచ్ఛ హెహర్ పేరుతో పొడి చెత్త సేకరణకు శ్రీకారం చుట్టనుంది ప్రభుత్వం. పరిశుభ్రతే లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టనుంది. పొడిచెత్తతో ఆదాయం పొందవచ్చేనే విషయాన్ని ప్రజలకు తెలియజేయనున్నారు. నేరుగా విక్రయించి డబ్బులు సంపాదించవచ్చని ప్రచారం చేయనున్నారు. నల్గొండ జిల్లాలోలోని సూర్యాపేట, కోదాడ, నేరేడుచర్ల, హుజూర్‌నగర్, తిరుమలగిరిలో కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు.
నేటి నుంచి మహబూబ్‌నగర్, విశాఖ మధ్య ఎక్స్‌ప్రెస్ ట్రైన్
మహబూబ్‌నగర్, విశాఖ మధ్య నడిచే ఎక్స్‌ప్రెస్ ఇవాళ ప్రారంభంకానుంది. ఇప్పటికే కాజిగూడ, విశాఖ మధ్య నడుస్తున్న ట్రైన్‌ను మహబూబ్‌నగర్ వరకు పొడిగించారు. దీన్ని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మహబూబ్‌నగర్ స్టేషన్‌లో ఈ ట్రైన్ స్టార్ట్ చేస్తారు.
ఐపీఎల్ 2023లో నేడు
నేడు ఐపీఎల్‌లో రెండు కీలక మ్యాచ్‌లు జరగనున్నాయి. మధ్యాహ్నం 3.30కి ఢిల్లీ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది. రాత్రి 7.30గంటలకు కోల్‌కతా వేదికగా కోల్‌కతాతో లక్నో సూపర్ జెయింట్స్ తలపడనున్నాయి.